జ‌న‌తా గ్యారేజ్ మూవీ రివ్యూజ‌న‌తా గ్యారేజ్..  అనౌన్స్మెంట్ ద‌గ్గ‌ర నుంచే క్రేజ్ తెచ్చుకున్న సినిమా. నాన్న‌కు ప్రేమ‌తో విజ‌యం త‌ర్వాత ఎన్టీఆర్, టాలెంటెడ్ డైర‌క్ట‌ర్ కొర‌టాల శివ‌తో జ‌త క‌ట్ట‌డంతో,వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో సినిమా అనౌన్స్ చేసిన ద‌గ్గ‌రి నుంచి సినీ అభిమానులంద‌రిలోనూ ఎక్కువ ఆస‌క్తి క‌లిగింది. దీనికి తోడు మ‌ళ‌యాల సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ఒక ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తుండ‌టం.. ఇవ‌న్నీ జ‌న‌తా గ్యారేజ్ క్రేజ్ ను ఎంతో పెంచేశాయి. ట్రైల‌ర్ బాగా పాపుల‌ర్ అవ‌డంతో, సినిమామీద అంచనాలు కూడా బాగానే పెరిగాయి. ఇటు తెలుగులో పాటూ, అటు మ‌ళ‌యాలంలోనూ ఇవాళ విడుద‌లైన ఈ సినిమా ప్ర‌స్తుత జెన‌రేష‌న్ లో రానున్న మంచి సినిమా అనుకుంటున్న వారి అంచ‌నాల‌ను అందుకునే రేంజ్ లో ఉందా లేదా చూద్దాం.


1980 ల్లోనే హైద‌రాబాద్ లో జ‌న‌తా గ్యారేజ్ అనే మెకానిక్ షెడ్ ను ప్రారంభించిన మోహ‌న్ లాల్, కేవ‌లం వాహ‌నాల‌ను మాత్ర‌మే కాకుండా, త‌ప్పు దారిలో న‌డిచే మ‌నుషుల‌కు కూడా రిపేర్స్ చేస్తుంటాడు.
ఎన్టీఆర్, ముంబై లో ఉంటూ.. ప్ర‌కృతిని ప్రేమించే వ్య‌క్తిగా, ఆ ప్ర‌కృతిని ఎవ‌రైనా నాశనం చేస్తుంటే వారితో ఎంత దూరం వ‌రకైనా వెళ్ల‌గ‌లిగే వ్య‌క్తి. ఒక స్ట‌డీ ఎక్ఛేంజ్ ప్రోగ్రామ్ లో భాగంగా హైద‌రాబాద్ కి వ‌చ్చిన ఎన్టీఆర్ కు, అక్క‌డ మోహ‌న్ లాల్ కొడుకు ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లిగించే క్వారీ ఒక‌టి న‌డిపిస్తున్నాడ‌ని తెలిసి, అత‌డిని బెదిరించ‌డానికి వెళ‌తాడు. అక్క‌డి నుంచి ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ కు ఎలా వెళ్తాడు, మోహ‌న్ లాల్-ఎన్టీఆర్ మ‌ధ్యన అస‌లేం జ‌రుగుతుంది అన్న‌దే క‌థ‌.


ఎన్టీఆర్ త‌న న‌ట‌న‌ను మ‌రోసారి నిరూపించుకున్నాడు. స‌మంత తో వ‌చ్చే ల‌వ్ సీన్ లో, ముఖ్యంగా స‌మంత త‌నను వ‌దిలి వెళ్లేట‌ప్పుడు త‌న న‌ట‌నకు ఎవ‌రైనా వాహ్ అనాల్సిందే. సెకండాఫ్ లో సినిమాను మొత్తం ఒక చేత్తోనే న‌డిపించాడు. మోహ‌న్ లాల్, ఆయ‌న న‌ట‌నకు వంక పెట్టే ఛాన్సే లేదు. యాక్టింగ్ ద‌గ్గ‌రి నుంచి, డ‌బ్బింగ్ వర‌కు అన్నీ ప‌ర్ఫెక్ట్ గా సరిపోయాయి. బ‌హుశా అందుకే మోహ‌న్ లాల్ ను కంప్లీట్ యాక్ట‌ర్ అంటారేమో. ఆయ‌న న‌టించ‌డానికి అంత‌కంటే అవ‌కాశం లేదు. ఆ పాత్ర అలాంటిది.హీరోయిన్లు పాట‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు త‌ప్ప‌, వాళ్ల‌తో పెద్ద‌గా వ‌చ్చే స‌న్నివేశాలేమీ ఉండ‌వు. విల‌న్ లుగా ఉన్ని ముకుంద‌న్, స‌చిన్ ఖేడ్క‌ర్ తేలిపోయారు. ఎక్క‌డా వాళ్లను చూస్తే భ‌యం లాంటిది క‌ల‌గ‌క‌పోగా.. ఏదో ఒక మామూలు వ్య‌క్తిని చూస్తున్న‌ట్లుంటుంది.సాయి కుమార్ పాత్ర చెప్పుకోద‌గ్గ‌దేమీ కాదు. రాజీవ్ క‌న‌కాల మ‌రోసారి మంచి పాత్ర‌తో సినిమాకు ప్ల‌స్ అయ్యాడు. దేవ‌యాని త‌న స‌హ‌జ న‌ట‌న‌తో బాగా చేసింది. కాజ‌ల్ అగ‌ర్వాల్ స్పెషల్ అప్పీరియ‌న్స్ లో వ‌చ్చిన పాట స‌రైన సంద‌ర్భంలో రాక‌పోయిన‌ప్ప‌టికీ, త‌న అందాలతో, డ్యాన్స్ తో అల‌రించింది.మిగ‌తా పాత్ర‌లు అజ‌య్, బ్ర‌హ్మాజీ, వెన్నెల కిషోర్ వాళ్ల వాళ్ల పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.


ప్ర‌కృతిని కాపాడుకోవ‌డంతో పాటూ, మ‌నుషుల‌ను కూడా కాపాడాలి అనే గొప్ప లైన్ ను తీసుకుని, దాన్నే డెవ‌లెప్ చేసి.. జన‌తా గ్యారేజ్ గా మ‌లిచిన కొర‌టాల శివ క‌థనంలో కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉండాల్సింది. రెండు గొప్పపాత్ర‌ల‌ను క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు, ఆ పాత్ర‌ల‌కు స‌రైన న్యాయం చేయ‌లేక‌పోయాడు. ఎన్టీఆర్ క‌నిపిస్తే, మోహ‌న్ లాల్ ఉండ‌డు.. మోహ‌న్ లాల్ ఉంటే, ఎన్టీఆర్ ఉండ‌డు. ఫ‌స్టాఫ్ అంతా అలానే లాక్కొచ్చాడు. స‌రే ఇక సెకండాఫ్ లో, ఇద్ద‌రూ ఒకే ద‌గ్గ‌ర ఉన్నా కానీ, ఫ‌స్టాఫ్ లో అంత‌టి ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్ గా చూపించిన మోహ‌న్ లాల్ ను సెకండాఫ్ లో ఒక్క‌సారిగా ఢీలా పరిచేస్తాడు. జ‌నం కోసం జ‌న‌తా గ్యారేజ్ ఎప్పుడూ ఎదురుచూస్తుంది లాంటి గొప్ప మాట‌ను చెప్పిన మోహ‌న్ లాల్ ను ఒక చిన్న యాక్సిడెంట్ తో ఆయ‌న వాట‌న్నింటికీ దూరంగా ఉండ‌టం రుచించ‌దు. నేచ‌ర్ ని ప్రేమించే వ్య‌క్తిగా ప‌రిచ‌య‌మైన ఎన్టీఆర్ సెకండాఫ్ లో నేచ‌ర్ అనే మాటే ఎత్త‌డు. ఒక్క‌సారిగా నేచ‌ర్ ని మ‌ర్చిపోయి, మోహ‌న్ లాల్ లా మారిపోయి, నేచ‌ర్ ను మ‌ర్చిపోయి, కేవ‌లం మ‌నుషుల‌ను మాత్ర‌మే ప‌ట్టించుకుంటాడు.


ఎన్టీఆర్, మోహ‌న్ లాల్ మ‌ధ్య‌న వ‌చ్చే ఎమోష‌నల్ సీన్స్ బాగా పండాయి. ముఖ్యంగా ”అడ్డ‌గోలుగా పెరిగితే కొమ్మ‌ల‌ను, కొడుకును నరికేసినా నేనిలానే ఉంటా” అని మోహ‌న్ లాల్ చెప్పే డైలాగ్ బాగుంటుంది.సినిమా పరంగా సెకండాఫ్‌లో మొదటి ఇరవై నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్‌గా చెప్పాలి. రాజీవ్ క‌న‌కాల తో వ‌చ్చే జీహెచ్ఎంసీ సీన్ సినిమాకు ప్ల‌స్.‘జయహో జనతా..’ అంటూ ఈ సమయంలో వచ్చే మాంటేజ్ సాంగ్ సూప‌ర్బ్. ఫ‌స్టాఫ్ లో అస‌లు క‌థ గురించి చెప్ప‌కుండా, సెకండాఫ్ లో మొద‌టి 20నిమిషాల త‌ర్వాత క‌థే లేక‌పోవ‌డంతో క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ సీన్ పెద్ద‌గా ఎక్క‌వు. సినిమాలో ఇద్ద‌రు టాప్ హీరోయిన్ల‌ను పెట్టుకుని కూడా, వాళ్ల‌ను స‌రిగ్గా వాడుకోలేక‌పోయారు. నిత్య మీన‌న్ క్యారెక్ట‌ర్ ఎందుకుందో అస‌లేమీ అర్థం కాదు. దానికి తోడు సినిమా నిడివి ఎక్కువ ఉండ‌టంతో, ఫ‌స్టాఫ్ అయిపోయే స‌రికే సినిమా అంతా అయిపోయిన ఫీలింగ్ క‌లుగుతుంది.


ర‌చ‌యిత గా కొర‌టాల కు ఉన్న పేరును డైర‌క్ట‌ర్ గా ఈ సినిమాతో నిలుపుకోలేక‌పోయాడు. ఒక మంచి క‌థ‌ను ఎంచుకున్న‌ప్ప‌టికీ, అది తెలియ‌కుండానే ప‌క్క దారి ప‌ట్టించేశాడు. శివ చేసిన చిన్న చిన్న పొర‌పాట్ల‌ను సైతం ఎన్టీఆర్, మోహ‌న్ లాల్ లు ఇద్ద‌రే త‌మ న‌ట‌నతో క‌ప్పి పుచ్చాల్సి వ‌చ్చింది. సినిమాటోగ్రఫీ కి ఎక్క‌డా పేరు పెట్టే పనిలేదు.ఇంకోలా చెప్పాలంటే, ఎన్టీఆర్ సినిమాల్లో ది బెస్ట్ విజువ‌ల్స్ ను ఈ సినిమా లో చూడొచ్చు. దేవీశ్రీ ఎప్ప‌టిలాగే త‌న మ్యూజిక్ తో మ్యాజిక్ చేసేశాడు. రాక్ ఆన్ బ్రో సాంగ్ ఎన్టీఆర్ కెరీర్ లో మంచి సాంగ్ గా నిలుస్తుంది. ఎడిటింగ్ బాగుంది కానీ, ఎడిట‌ర్ త‌న క‌త్తెర కు ప‌దును బాగా పెట్టాల్సింది.నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.


చివ‌ర‌గా, ఒక మంచి క‌థ‌తో మెసేజ్ ఇవ్వాల‌నుకుని ఎన్టీఆర్ చేసిన ప్ర‌య‌త్నం మంచి ఆలోచ‌నే. కానీ, ఎన్టీఆర్ నుంచి అభిమానులు కోరుకునే విధంగా త‌న పాత్ర‌ను డైర‌క్ట‌ర్ తీర్చిదిద్దాలి. అలాంట‌ప్పుడే అభిమానులంద‌రూ ఆనందిస్తారు, తృప్తి ప‌డతారు.


పంచ్ లైన్ః జ‌నతా గ్యారేజ్.. ఇచ్చ‌ట కొన్నిరిపేర్లుంటాయి.


Filmjalsa Rating:2.75/5