చుట్టాల‌బ్బాయి రివ్యూమొద‌టి సినిమాతోనే మంచి హిట్స్ అందుకున్న హీరో, డైర‌క్ట‌ర్. కానీ ప్ర‌స్తుతానికి మాత్రం ఇద్ద‌రూ ఫ్లాప్ ల్లోనే ఉన్నారు. గ‌త కొంత కాలంగా స‌రైన హిట్ కోసం ఎదురు చూస్తున్నఆది, ఎలాగైనా ఈ సినిమాతోనైనా త‌న‌ను తాను నిరూపించుకోవాలని ప‌ట్టుద‌ల‌తో ఉన్న డైర‌క్ట‌ర్ వీర‌భ‌ద్ర‌మ్. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో రూపొందిన చుట్టాల‌బ్బాయి. మ‌రి ఆది, వీర‌భ‌ద్ర‌మ్ ల కోరిక‌ల‌ను ఈ చుట్టాల‌బ్బాయి తీరుస్తాడా లేదా అన్న‌ది చూద్దాం.


హైద‌రాబాద్ లో రిక‌వ‌రీ ఏజెంట్ గా ప‌నిచేసే ఆది, అనుకోని స‌న్నివేశాల్లో న‌మితా ప్ర‌మోద్ ను క‌లుస్తాడు. అది చూసిన న‌మితా ప్ర‌మోద్ అన్న‌య్య వీళ్ల‌ద్ద‌రూ ల‌వ‌ర్స్ ఏమో అనుకుని పొరబ‌డి, ఆదికి వార్నింగ్ కూడా ఇస్తారు. దాంతో ఆది ఆ అమ్మాయికి, త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, నిరూపించ‌డానికి వ‌చ్చే స‌మ‌యంలోనే, త‌న‌కు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నార‌ని, ఇంట్లో నుంచి పారిపోతున్న న‌మిత తార‌స‌ప‌డుతుంది. ఈ స‌మ‌యంలోనే వాళ్ల‌ను ఒక గ్యాంగ్ ఫాలో చేస్తుంది. ఆ గ్యాంగ్ ఎవ‌రు, అస‌లు వీళ్ల‌ను ఎందుకు ఫాలో చేస్తున్నారు, వాళ్ల బారి నుంచి హీరో హీరోయిన్లు ఎలా త‌ప్పించుకుని,  ఎలా ఒక‌ట‌య్యారు అన్న‌దే క‌థ‌..


అహనా పెళ్లంట, పూలరంగడు లాంటి హిట్టు సినిమాలతో దర్శకుడిగా కెరీర్ ఆరంభించిన‌ వీరభద్రం చౌదరి, మూడో సినిమాకే ఏకంగా నాగార్జున లాంటి స్టార్ హీరోతో పనిచేసే అవకాశం లభించింది. కానీ అనుకున్న అంచనాలు త‌ప్పాయి. నాగార్జున కెరీర్ లోనే డిజాస్ట‌ర్ గా భాయ్ నిలిచిపోయింది. దీంతో దాదాపు మూడేళ్ల గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు ఆది హీరోగా ‘చుట్టాలబ్బాయి’తో వస్తున్న వీరభద్రమ్.. ఈ సినిమాతో మళ్లీ తనేంటో రుజువు చేసుకోవాల‌ని బాగానే తాప‌త్ర‌య ప‌డ్డాడు. అస‌లు అహ‌న పెళ్లంట‌, పూల రంగ‌డు లాంటి సినిమాలు చూశాక, వీర‌భ‌ద్ర‌మ్ కేవ‌లం కామెడీ జోన‌ర్ లోనే సినిమాలు తీస్తాడేమో అని ప్రేక్ష‌కులు అనుకుంటారు అనుకున్నాడో ఏమో, భాయ్ లాంటి సినిమా తీసి దెబ్బ‌తిన్నాడు. భాయ్ సినిమాలో కూడా అలాంటి కామెడీనే ఆశించిన ప్రేక్ష‌కుల ఆశ‌ల మీద వీర‌భ‌ద్ర‌మ్ నీళ్లు చ‌ల్లి, ఏదో తీశాడు.


తీసిన సినిమాలన్నీ విజ‌య‌వంతం కావాల‌ని లేదు. ఫ్లాప్ లు ఎవ‌రికైనా ఎదుర‌వుతాయి. కానీ త‌న త‌ప్పు, ప్రేక్ష‌కుల అభిరుచి తెలుసుకున్న వీర‌భ‌ద్ర‌మ్ మాత్రం ఈ సారి ఆ త‌ప్పు చేయ‌లేదు. ప్రేక్ష‌కులకు కావాల‌నుకున్న వినోదాన్ని, ఎంట‌ర్ టైన్ మెంట్ ను వాళ్ల‌కు అందించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. కానీ క‌థ, క‌థ‌నాన్ని డిఫ‌రెంట్ గా మ‌ల‌చ‌టంలో మాత్రం విఫ‌ల‌మ‌య్యాడు. ప్ర‌తి సారీ త‌ర్వాత వ‌చ్చే స‌న్నివేశాన్ని ప్రేక్ష‌కుడు సులువుగా అంచ‌నా వేయ‌గ‌లుగుతున్నాడు. ప్రేక్ష‌కుడే సినిమా క‌థ‌ను అంచ‌నా వేస్తే, అందులో ద‌ర్శకుడి ప్ర‌తిభ ఏముంది.


న‌ట‌న ప‌రంగా చెప్పాలంటే, ఆది త‌న గ‌త సినిమాల కంటే న‌ట‌నలో మెచ్యూరిటీ క‌న‌బ‌రిచాడు. అన్ని యాంగిల్స్ లోనూ త‌నదైన న‌ట‌న క‌న‌ప‌రిచాడు. హీరోయిన్ న‌మిత ప్ర‌మోద్ చెప్పుకోద‌గినంత‌గా ఏమీ లేదు, ఇంకా బెట‌ర్ పెర్ఫామెన్స్ చేసి ఉండొచ్చు. సాయి కుమార్ న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా మ‌నం చెప్పుకోవాల్సిందేమీ లేదు.కానీ అంద‌రూ ఊహించిన‌ట్లు సాయి కుమార్ సినిమాలో ఉన్నాడు అంటే, ఈ సారి సాయి కుమార్ ఎంత పెద్ద క్యారెక్ట‌ర్ చేస్తున్నాడో అనుకున్నంద‌రికీ నిరాశే క‌లుగుతుంది. సాయి కుమార్ స్క్రీన్ మీద క‌నిపించాడు అంటే, ఆయ‌న నుంచి పెద్ద పెద్ద డైలాగ్స్ ను ఆశిస్తారు ఆడియ‌న్స్. అలాంటివి ఇందులో అస‌లు లేవు. కానీ, కుటుంబ ప‌రంగా సాగే కొన్ని స‌న్నివేశాలు బాగున్నాయి. ఇక థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీ ఇగో ఉన్న రౌడీ క్యారెక్ట‌ర్ లో త‌న కామెడీ టైమింగ్ తో అద‌ర‌గొట్టాడు. ఆది ఫ్రెండ్స్ గా ష‌కల‌క శంక‌ర్, సుద‌ర్శ‌న్ పంచ్ లు అక్క‌డ‌క్క‌డా న‌వ్వించాయి. ఇక అలీ, కిడ్నాప‌ర్ క్రిష్ గా వ‌స్తాడు, హీరోయిన్ ని కిడ్నాప్ చేస్తాడు, నాలుగు త‌న్నులు తింటాడు వెళ్లిపోతాడు అంతే. మిగిలిన పోసాని, అన్న‌పూర్ణ‌మ్మ‌, ర‌ఘుబాబు మిగ‌తా వాళ్లు త‌మ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ప్ర‌థ‌మార్థం అంతా కామెడీ నేప‌థ్యంతో సాగిన సినిమా ఇంట‌ర్వెల్ వ‌ర‌కూ అంద‌రినీ ఎంట‌ర్ టైన్ చేసే విధంగా ఉంటుంది.


కానీ సినిమా మొద‌లు పెట్టిన ద‌గ్గ‌ర‌నుంచి, ఎక్క‌డా ఇంట్రెస్టింగ్ గా అనిపించ‌దు. దానికి తోడు క‌థ‌, క‌థ‌నంలో ఎటువంటి ఆస‌క్తి లేదు.ఈ స్టోరీ తో ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో సినిమాలొచ్చాయి. అలాంటప్పుడు ఏదైనా కొత్త‌గా చూపిస్తేనే ప్రేక్ష‌కుడు సినిమాను ఎంజాయ్ చేయ‌గ‌లుగుతారు. కానీ అలాంటి ప్ర‌య‌త్నాలు డైర‌క్ట‌ర్ చేయ‌లేదు. హీరోయిన్ న‌మితా ప్ర‌మోద్ న‌ట‌నను మెరుగు ప‌రచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.


సాంకేతిక ప‌రంగా చెప్పుకోవాలంటే, సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగుంది. సెకండాఫ్ లో ప‌ల్లెటూరి అందాల‌ను చాలా బాగా చిత్రీక‌రించారు. థ‌మ‌న్ సంగీతం ఒక‌టి రెండు, మిన‌హా సో.. సో గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు పెట్టింది పేరుగా చెప్పుకునే థ‌మ‌న్ ఈసారి నేప‌థ్య సంగీతం విష‌యంలో కేర్ తీసుకున్న‌ట్లు లేడు. సినిమాకు నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి. ప్ర‌తీ ఫ్రేమ్ లోనూ రిచ్ నెస్ క‌నిపిస్తుంది.డైర‌క్ట‌ర్ పంచ్ డైలాగ్ ల మీద ఈసారి బాగానే శ్ర‌ద్ధ పెట్టిన‌ట్లున్నాడు. పృథ్వీ, ఆది, ష‌కల‌క శంక‌ర్ ల‌కు రాసుకున్న పంచ్ డైలాగ్ లు బాగా పేలాయి. ఎడిటింగ్ ఫ‌ర్వాలేదు. ఫైట్స్ మాత్రం ప్ర‌తీ ఫైట్ ఏదో సినిమాలో చూసిన‌ట్ల‌న్పిస్తుంది. ప్రీ ఇంట‌ర్వెల్ సీన్ లో వ‌చ్చే ఫైట్ సీన్, బృందావ‌నం సినిమాను త‌లపిస్తుంది.


చివ‌ర‌గా, త‌న రొటీన్ జోనర్ అయిన యాక్ష‌న్ సినిమాల‌ను కాద‌ని, ఈసారి కామెడీ సినిమాకు ఓటేసిన ఆది కోసం, కొత్త కామెడీ పంచ్ ల కోసం, స‌ర‌దాగా ఎంట‌ర్ టైన్ మెంట్ కావాల‌నుకునే వారికి ఈ చుట్టాల‌బ్బాయి న‌చ్చుతాడు.


పంచ్ లైన్ః చుట్టాలొస్తున్నారు జ‌ర‌’భ‌ద్ర‌మ్’


Filmjalsa Rating: 2.75/5