Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

‘గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి’ సినిమా రివ్యూనందమూరి బాలకృష్ణ‌. ప్ర‌తీ సంక్రాంతికి ఒక రిలీజ్ ఉండేలా చూసుకునే టాలీవుడ్ హీరో. ఈ సంక్రాంతి కి కూడా బాల‌య్య చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ప్రేక్ష‌కుల‌కు ముందుకు వ‌చ్చింది. అయితే ఈ చిత్రం ఎప్ప‌టిలా కాదు. బాల‌య్యకు, ఆయ‌న అభిమానుల‌కు, సినీ అభిమానుల‌కు అంద‌రికీ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌దే. బాలకృష్ణ సినీ ప్ర‌యాణానికి ఓ కీల‌క మైలురాయి ఈ చిత్రం. దీనికంత‌టికీ ఒక కార‌ణం ఇది బాల‌య్యకు 100వ సినిమా కాగా, తెలుగు జాతి వీర‌త్వాన్ని చాటి చెప్పిన శ‌క‌పురుషుడు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్క‌డం మ‌రో కార‌ణం. బాలయ్య 100వ సినిమా కావడం, దానికి తోడు గ‌మ్యం, వేదం, కృష్ణం వందే జ‌గ‌ద్గురం, కంచె వంటి గొప్ప చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు క్రిష్ జాగర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో ఈ సినిమా మీద అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. ఇన్ని అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుందా లేదా చూద్దాం.

ఒకే రాజ్యం.. ఒకే యుద్ధం.. అఖండ భరతజాతి అని కలలుగన్న శాతవాహన చక్రవర్తి శాతకర్ణి. దక్షిణ భారతంలో తిరుగులేని వీరునిగా కుంతల, కల్యాణ దుర్గం రాజ్యాలను హస్తగతం చేసుకుంటారు. సౌరాష్ట్ర రాజ్యానికి చెందిన నహపాణుడి(కబీర్‌బేడీ)ని ఓడించి శకపురుషుడిగా అవతరిస్తారు. ఉత్తరదక్షిణాదిలతో అఖండ భారతాన్ని ఏకఛత్రాధిపత్యం కిందకి తీసుకొస్తారు. అయితే.. అలెగ్జాండర్‌ కలలుగన్న అఖండభారతాన్ని చేజిక్కుంచుకోవాలని గ్రీకు చక్రవర్తి డెమిత్రియస్‌ సింధు నుంచి పోరాటానికి దిగుతాడు. శాతకర్ణిపై విషప్రయోగానికి పూనుకుంటాడు. మరి డెమిత్రయస్‌ని శాతకర్ణి ఎలా ఓడించాడు? తాను కలలుగన్న అఖండభారతావనని ఎలా సృష్టించాడు? అన్నదే మిగిలిన కథ.

సినిమాలో ప్ల‌స్ పాయింట్స్ గురించి చెప్పాలంటే యుద్ధ‌ స‌న్నివేశాల‌న్నీ సినిమాకు మేజ‌ర్ హైలైట్స్. ఈ యుద్ధాల నేప‌థ్యంలోనే క‌థ న‌డుస్తుంది. న‌హ‌పాణుడిని ఓడించే సీన్స్, యుద్ధానికి వెళ్లేట‌ప్పుడు శాత‌క‌ర్ణి త‌న కొడుకు పులోమావిని తీసుకెళ్ల‌డం, శాత‌క‌ర్ణి భార్య వాసిష్టి దేవి దానికి అడ్డుచెప్పే సీన్స్ అన్నీ బాగున్నాయి. రాజ‌సూయ యాగం జ‌రిగేట‌ప్పుడు స్త్రీల గురించి చెప్పే డైలాగులు , స‌న్నివేశాలు మ‌న‌సుని క‌దిలిస్తాయి. శాత‌క‌ర్ణి త‌న పేరును గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిగా మార్చుకునే సీన్ బాగుంది. ఇలాంటి చారిత్రాత్మ‌క సినిమాలలో వినోదాన్ని ఎలాగూ అందించ‌లేం కాబ‌ట్టి, కాస్తంత ఉత్కంఠ‌ను క్రియేట్ చేసుంటే బాగుండేది. సినిమాను చివ‌ర వ‌ర‌కూ సీరియ‌స్ గా చూడాలంటే క‌ష్టం కాబ‌ట్టి కొంచెం స‌స్పెన్స్ ఉంటే బాగుండేది.

త‌న 100వ చిత్రంగా గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిని ఎంచుకున్న‌ప్పుడే బాల‌కృష్ణ స‌గం విజయం సాధించాడు. సినిమా అంతా బాల‌య్య వ‌న్ మ్యాన్ షో అనే చెప్పాలి. శాత‌కర్ణిగా అత‌ని న‌ట‌న ఎన్టీఆర్ పౌరాణిక సినిమాలను గుర్తు చేస్తుంది. యుద్ధ స‌న్నివేశాల్లోనూ, డైలాగ్స్ డెలివ‌రీ లోనూ, ఇలాంటి సినిమాలు చేయడంలోనూ త‌న త‌ర్వాతే ఎవ‌రైనా అనే రేంజ్ లో బాల‌కృష్ణ ఆకట్టుకున్నాడు. త‌న ఆహార్యంలోనూ, రాజ‌సంలోనూ బాల‌య్య క‌నిపించిన తీరును మెచ్చుకోవాల్సిందే. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే, శాత‌క‌ర్ణి గా బాల‌కృష్ణ స్థానంలో మ‌రొక‌రిని ఊహించుకోవ‌డం కూడా క‌ష్టమే అన్నంత బాగా చేశాడు. యుద్ధ స‌న్నివేశాల్లో బాల‌కృష్ణ చెప్పే డైలాగులు ఫ్యాన్స్ తో విజిల్స్ వేయిస్తాయి. చారిత్రాత్మక చిత్ర‌మే అయినా అభిమానులు త‌న నుంచి ఏదైతే ఆశిస్తారో అవ‌న్నీ ఉండేట్లు బాగానే జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు బాల‌కృష్ణ‌. శాత‌క‌ర్ణి త‌ల్లిగా, మ‌హారాణి గౌత‌మి పాత్ర‌లో హేమ‌మాలిని ఒదిగిపోయింది. వాసిష్ఠిదేవిగా, శాత‌క‌ర్ణి భార్య‌గా, ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లిగా త‌న పాత్ర‌కు బాగా న్యాయం చేసింది శ్రియ‌. న‌హ‌పాణుడిగా క‌బీర్‌బేడి ఆక‌ట్టుకున్నాడు. మిగ‌తా పాత్ర‌లు శివ‌కృష్ణ‌, శుభ‌లేఖ సుధాక‌ర్, త‌నికెళ్ల భ‌ర‌ణి త‌మ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

సినిమా గురించి చెప్పాలంటే మొద‌టిగా చెప్పాల్సింది ద‌ర్శ‌కుడు క్రిష్ గురించే. అఖండ భార‌తావ‌ని కోసం ఎన్నో యుద్ధాలు చేసిన ఓ చ‌క్ర‌వ‌ర్తి క‌థ‌ను కేవ‌లం 79 రోజుల్లో తెర‌కెక్కించిన క్రిష్ కు ద‌ర్శ‌క‌త్వంలో ఎంత ప‌ట్టు ఉందో ఈ చిత్రం నిరూపించింది. అంత త‌క్కువ స‌మ‌యంలో సినిమాను తెర‌కెక్కించినా, ఎక్క‌డా రాజీప‌డకుండా, హ‌డావిడి లేకుండా, ఎంతో రిచ్ గా వ‌చ్చేలా బాగా కేర్ తీసుకున్నాడు. ఇలాంటి చారిత్ర‌క క‌థ‌కు, బాల‌య్య లాంటి హీరోను డైర‌క్ట్ చేసేట‌ప్పుడు ఏయే జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో తెలిసిన క్రిష్ కొన్ని మాస్ సీన్స్ ను జోడించి చెప్పిన విధానం క్రిష్ తెలివితేట‌ల‌కు అద్దం ప‌డుతుంది. ముఖ్యంగా ఎక్క‌డా విజువ‌ల్ ఎఫెక్ట్స్ జోలికి వెళ్ల‌కుండా వీలైనంత వ‌ర‌కు ఒరిజిన‌ల్ లొకేష‌న్స్ లోనే షూట్ చేసి ఆక‌ట్టుకున్నాడు. అయితే ఇక్క‌డ క్రిష్ ఎంచుకున్న లొకేష‌న్లకు, అత‌ని ఊహ‌ల‌కు రూప‌మివ్వ‌డంలో సినిమాటోగ్ర‌ఫ‌ర్ జ్క్షాన‌శేఖ‌ర్ విజ‌యం సాధించాడు. ప్ర‌తి ఫ్రేమ్ ఎంతో నీట్ గా, శాత‌వాహ‌నుల రాజ‌సం క‌నిపించేలా తెర‌కెక్కించాడు. చిరంత‌న్ భ‌ట్ అందించిన సంగీతంలో పాట‌లు అంతంత మాత్రంగానే ఉన్నా రీరికార్డిండ్ చాలా బాగుంది. ముఖ్యంగా యుద్ధ స‌న్నివేశాల నేప‌థ్యంలో వ‌చ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి. సాయి మాధ‌వ్ బుర్రా రాసిన మాట‌లు యుద్ధ స‌న్నివేశాల‌కు ధీటుగా ఒక్కొక్క మాట ఒక్కొక్క తూటాలా పేలింది. ఆయ‌న రాసిన మాట‌లు సినిమా స్థాయిని మ‌రింత పెంచాయి.

* తండ్రిని మించిన కొడుకుంటాడు కానీ, త‌ల్లిని మించిన కొడుకుంటాడా..?
* ప్రసవ వేదనలో తల్లి ఏడుపు వినం.. కానీ బిడ్డ ఏడుపు వింటాం..
* సింహం, చీమ యుద్ధంలో వెనుదిరగవు.. సింహం చచ్చేవరకు పట్టి పట్టి చంపుతుంది, చీమ అది చచ్చే వరకు కుట్టి కుట్టి చంపుతుంది..
* పాలించటానికి కాదు, ఈ గడ్డ మీద యాచించడానికి కూడా గ్రీసస్థులకి అర్హత లేదని చెప్పు..
* క‌థ‌లు మ‌నం చెప్ప‌కూడ‌దు, మ‌న క‌థ‌లు జ‌నం చెప్పుకోవాలి..
* స‌మ‌యం లేదు మిత్ర‌మా, శ‌ర‌ణ‌మా, ర‌ణ‌మా.. శ‌ర‌ణం అంటే ర‌క్ష‌, రణం అంటే మ‌ర‌ణశిక్ష ఏది కావాలి..?
* ఇప్ప‌టికి ఉనికిని నిలుపుకున్నాం, ఇక ఉనికిని చాటుదాం. నూత‌న నిర్మాణ‌మైన భార‌త రాజ్యాన్ని ప‌ర‌దేశ‌పు నెత్తురితో ప్ర‌క్షాళ‌న చేద్దాం.. దొరికిన వాణ్ణి తురుముదాం, దొర‌క‌ని వాణ్ణి త‌రుముదాం. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం..
* మ‌మ‌కారం, అహంకారం రెండూ లేనివాడే నాయ‌కుడు అవుతాడు.
* ఆడ‌దాని క‌డుపులో న‌లిగి న‌లిగి వెలుగు చూసిన ర‌క్త‌పు ముద్ద‌వి.
* శాత‌క‌ర్ణి ఒక్క‌డు మిగిలి ఉంటే చాలు, మ‌న‌లో ఒక్కడు కూడా మిగ‌లడు.
* నేను బొట్టు పెట్టింది నా భ‌ర్త‌కు కాదు, ఓ చ‌రిత్ర‌కు..
* మారావు అనుకున్నా ,గెలిచిన రాజ్యాలు మార్చ‌లేదు, వ‌లచిన ఇల్లాలు మార్చ‌లేదు..
* నా బిడ్డ కోస‌మో, నీ గడ్డ కోస‌మో కాదు నేను పోరాడుతున్న‌ది, ఈ దేశం అంత‌టినీ ఏక‌ఖండంగా క‌ల‌ప‌డానికి..
* మీరు క‌డుపున మోసింది మ‌నిషిని కాదు, మార‌ణహోమాన్ని, మ‌హా యుద్ధాన్ని..
* త‌ల వంచ‌కు.. అది నేను గెలిచిన త‌ల .. ఇలాంటి డైలాగులు సినిమాలో చాలానే ఉన్నాయి.

చివ‌ర‌గా, దేశ ఉనికిని చాటిచెప్పిన‌ శాత‌వాహ‌న చ‌క్రవ‌ర్తి క‌థ‌ను తెలుగు జాతికి తెలియ‌చెప్ప‌డానికి క్రిష్‌-బాల‌కృష్ణ లు చేసిన ప్ర‌య‌త్నం చాలా బాగుంది. తెలుగు సినిమా మీసం తిప్పే సినిమా గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి.

పంచ్ లైన్ః సాహో.. శాత‌క‌ర్ణి

Filmjalsa Rating: 3.5/5