కాష్మోరా రివ్యూః బాణానికి ఇంకాస్త ప‌దును పెట్టాల్సింది..‘యుగానికొక్క‌డు’ సినిమాతో తెలుగు నాట ప‌రిచ‌య‌మైన త‌మిళ హీరో సూర్య సోద‌రువడు ‘కార్తీ’ న‌టించిన తాజా చిత్రం ”కాష్మోరా” భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు మ‌గ‌ధీర సినిమాను ట‌చ్ చేయాల‌ని అలాంటి స్టోరీతో చాలా సినిమాలే వ‌చ్చాయి. అంతే కాదు బాహుబలికి పోటీగా కూడా చాలా సినిమాలొచ్చాయి. ఎన్ని సినిమాలొచ్చినా వాటిలో ఒక్క‌టి కూడా రాజమౌళి రేంజ్ ను బీట్ చేయ‌లేక ఢీలా ప‌డ్డాయి. ఏ ముహుర్తాన కాష్మోరా సినిమాను మొద‌లుపెట్టారో కానీ, ఫ‌స్ట్ లుక్ నుంచి, ట్రైల‌ర్ వ‌ర‌కు అన్నీ అంద‌రి ఆలోచ‌న‌ల‌కు, అంచ‌నాల‌కు అంద‌కుండా అమాంతం సినిమా రేంజ్ ను పెంచేశాయి.
దెయ్యాలు, ప్రేతాత్మ‌ల‌ను వ‌దిలించే శ‌క్తులు ఉన్నాయ‌ని ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర న‌మ్మ‌కాన్ని ఏర్ప‌ర‌చుకున్న కాష్మోరా(కార్తీ) కొన్ని కార‌ణాల వ‌ల్ల ఒక కోట‌లో ఇరుక్కుపోతాడు. ఆ కోట‌లో త‌నే ఇరుక్కుపోయాడా..? లేదా ఎవ‌రైనా ప్లాన్ చేసి కాష్మోరా ను అక్క‌డ ఇరికించారా..?  ఆ కోట‌లో దాగున్న ర‌హ‌స్యాలేంటి..? అస‌లు న‌య‌నతార‌కు, కార్తికి సంబంధం ఏంటి..? లాంటి ప్ర‌శ్న‌లకు స‌మాధాన‌మే కాష్మోరా.
ముందుగా రెండు విభిన్న పాత్ర‌లు ఒప్పుకోవ‌డం, ఆ రెండు పాత్ర‌ల్లో కార్తీ ఒదిగిపోవ‌డాన్ని మెచ్చుకోవాల్సిందే. కాష్మోరా గా త‌న లుక్స్ తో, పురాత‌న క‌థ‌లో చూపించిన రాజ్ నాయ‌క్ గా త‌న నట‌న‌తో అద‌ర‌గొట్టేశాడు. అటు వార్ స‌న్నివేశాల‌తో పాటు, ఇటు కామెడీ సీన్స్ లోనూ కార్తి ఆకట్టుకున్నాడు. సినిమా మొత్తాన్ని కార్తి త‌న భుజాల‌పై వేసుకుని న‌డిపించాడు. రాజు కూతురు ర‌త్న‌మ‌హాదేవిగా న‌య‌న‌తార అందం, అభిన‌యంతో పాటూ రాజ‌సాన్ని కూడా బాగా ప‌లికించ‌గ‌లిగింది. దెయ్యాలున్నాయి, చేతబ‌డులు చేస్తున్నారని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే దొంగ బాబాల గురించి బ‌య‌ట పెట్టే రీసెర్చ్ స్టూడెంట్ గా శ్రీదివ్య బాగా చేసింది. కాష్మోరా తండ్రిగా వివేక్ త‌న కామెడీ టైమింగ్ తో అల‌రించాడు. మిగ‌తా పాత్ర‌ధారులు త‌మ ప‌రిధిలో చేశారు.
ఒక పురాత‌న క‌థ‌ను తీసుకొచ్చి ప్ర‌స్తుతం జ‌రుగుతున్న క‌థ‌కు లింక్ చేయ‌డం బాగుంది. సినిమా మొత్తంలో మేజ‌ర్ హైలైట్ అంటే కార్తి. త‌న బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివ‌రీ, త‌న‌లోని కామెడీ టైమింగ్ ఇలా అన్నింటితో కార్తీ ఒక్క‌డే సినిమాను దున్నేశాడు. ఫ‌స్టాఫ్ లో కాష్మోరాగా న‌వ్వించి, సెకండాఫ్ లో ఎవ్వ‌రూ ఊహించని లుక్స్ తో న‌ట‌న‌తో మెప్పించాడు. వార్ సీన్స్ తో పాటూ, సెకండాఫ్ లో కార్తీ, న‌య‌న‌తార మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు బాగున్నాయి. కాక‌పోతే సినిమా నిడివి ఎక్కువ‌గా అనిపించ‌డం, కొన్ని అన‌వ‌స‌రమైన సీన్స్ ను ఉంచ‌కుండా ఉండాల్సింది. రాజ్ నాయ‌క్ చనిపోయిన విధానంలో జ‌రిగిన ప్రాసెస్ లో న‌య‌న‌తార కు ఏమీ కాకుండా కార్తీకి మాత్ర‌మే మ‌త్తు ఎలా ఎక్కుతుంది అనేది మాత్రం అదెలా అని ప్ర‌శ్న‌లానే మిగిలిపోతుంది. సినిమాలోని పాట‌ల గురించి ఎంత త‌క్కువ‌గా మాట్లాడుకుంటే అంత మంచింది.
ద‌ర్శ‌కుడిగా గోకుల్ ఒక మంచి కాన్సెప్ట్ ని సినిమాగా మ‌లిచి, దానిలోనే ఎంట‌ర్ టైన్ మెంట్ ను అందించ‌గ‌ల‌గ‌డంలో సక్సెస్ అయ్యాడు. కాక‌పోతే సెకండాఫ్ మీద ఇంకొంచెం దృష్టి పెట్టుంటే కాష్మోరా ఫ‌లితం వేరే స్థాయిలో ఉండేది. సినిమాకు విజువ‌ల్ ఎఫెక్ట్స్ సినిమాను ప‌తాక స్థాయికి చేర్చాయి. కాష్మోరా అని పేరు విన‌గానే ఎలా భ‌య‌ప‌డ‌తారో, ఈ సినిమాలో ఉన్న పాట‌ల‌కు కూడా అలానే భ‌య‌ప‌డాలి. అంత ఘోరంగా ఉన్నాయి. పోనీ నేప‌థ్య సంగీతం అయినా, చెప్పుకునే స్థాయిలో ఉందా అంటే అది కూడా జ‌స్ట్ ఓకే. ఇలాంటి సినిమాల‌కు మంచి మ్యూజిక్ ఉంటే ప్రేక్ష‌కుల‌ను మ్యాజిక్ చేసేయొచ్చు కానీ అక్క‌డ అంత సీన్ లేన‌ప్పుడు మాట్లాడుకోవ‌డం కూడా వృధా. ఎడిటింగ్ ఫ‌ర్వాలేదు. ఎడిట‌ర్ త‌న క‌త్తెర‌కు ఇంకొంచెం ప‌దును పెట్టాల్సింది. కార్తీ క్యారెక్ట‌ర్స్ ను తీర్చి దిద్దిన విధానం బాగుంది…. ఆర్ట్ డైర‌క్ట‌ర్ పనితీరు ను కూడా మెచ్చుకోవాల్సిందే. పివివి సంస్థ వారి నిర్మాణ విలువ‌లు వారి రేంజ్ ను మ‌రో సారి చూపించాయి.
చివ‌ర‌గా..
ప్ర‌స్తుతం వ‌స్తున్న రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు భిన్నంగా కామెడీ హ‌ర్ర‌ర్ తో తెర‌కెక్కిన కాష్మోరా ను, ఎక్కువ స‌మ‌యం అనుకోకుండా ఓపిక ప‌ట్ట‌గ‌లిగితే ఈ దీపావ‌ళి ని కాష్మోరాతో స‌రిపెట్టేసుకోవచ్చు.

పంచ్ లైన్ః కాష్మోరా- బాణానికి ఇంకాస్త ప‌దును పెట్టాల్సింది.

Filmjalsa Rating: 3/5