ఓం న‌మో వెంక‌టేశాయ మూవీ రివ్యూఅన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిరిడి సాయి’ వంటి భక్తి రసా చిత్రాలతో అద్భుత విజయాలను అందుకున్న రాఘవేంద్రరావు , నాగార్జున కలయికలో తెరకెక్కిన మరో భక్తిరసా చిత్రం ”ఓం నమో వెంకటేశాయ”. ఎన్నో అంచనాల మధ్య ఈ వారం ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా.. ముందు చిత్రాలలానే ప్రేక్షకులను భక్తి భావంలో ముంచెత్తిందా లేదా అన్న విషయాలు తెలియాలంటే ఈ రివ్యూ వాచ్ చేయాల్సిందే.

క‌థ‌లోకి వెళితే..
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే .. చిన్నతనం నుంచే దేవుడిని చూడాలన్న కోరికతో ఉంటాడు రాము. అందుకోసం ఏ విద్యలు నేర్చుకోవాలని తన గురువుని ఉపాయం అడుగుతాడు. అయితే దేవుడిని చూడటానికి ఎలాంటి విద్య అవసరం లేదు, కేవలం జ్ఞానం ఉంటే సరిపోతుంది అని, అందుకోసం ధ్యానం చేయమని సలహా ఇస్తాడు. అలా చిన్న తనంలోనే రాము, దేవుని కోసం ధ్యానంలో కూర్చుంటాడు. అలా సంవత్సరాలు గడిచిపోతాయి. అయితే ఒక చిన్న పిల్లవాడి కారణంగా రాము ధ్యానం చెడుతుంది. అక్కడి నుంచి రాము కి ధ్యాన భంగం చేసిన ఆ పిల్లవాడు ఎవరు? రాము తరువాత ఆ వేంకటేశ్వరుని నిజ దర్శనాన్ని ఎలా పొందాడు? మామూలు రాముగా ఉన్న భక్తుడు హథీరామ్ బాబా గా ఎలా మారాడు, ఆ శ్రీనివాసునితో కలసి పాచికలు ఆడేంత అదృష్టాన్ని ఎలా దక్కించుకున్నాడు, అన్నదే మిగతా క‌థ‌.

నటీ నటుల ప్రతిభ..
నటీ నటుల నటన విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది నాగార్జున నటన గురించే. గతంలో అన్నమయ్య , శ్రీరామదాసు , షిరిడి సాయి వంటి చిత్రాల్లో నటించి భక్తి రసాన్ని పలికించడంలో రాటు దేలిపోయిన నాగార్జున ఈ సినిమాలో తన నట విశ్వ రూపాన్నే ప్రదర్శించాడు అని చెప్పుకోవాలి. సినిమాలో చాలా సన్నివేశాల్లో కేవలం నాగ్ యాక్టింగ్ ఆయా సన్నివేశాలని తారా స్థాయిలో నిలబెట్టడానికి కారణం అయ్యింది అంటే నాగ్ నటన ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు . ఇక పరమ భక్తురాలు కృష్ణమ్మ పాత్రలో అనుష్క ఒదిగిపోయింది అనే చెప్పుకోవాలి. అనుష్క నుండి ఇంత అద్భుతమైన నటన రాబట్టుకున్న క్రెడిట్ దర్శకుడికే దక్కుతుంది. ఇక ఆ వేంకటేశ్వరుని పాత్రలో సౌరభ్ జైన్ క‌రెక్ట్ గా స‌రిపోయాడు. రావు రమేష్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ప్ర‌గ్యా జైస్వాల్ త‌న పాత్ర‌కు న్యాయం చేయ‌గ‌లిగింది.మిగతా నటీ నటులు తమ తమ పాత్రల పరిధి మేర బాగానే నటించారు .

సాంకేతిక వర్గం పనితీరు..
టెక్నీకల్ విభాగంలో ముందుగా గోపాల్ రెడ్డి గారి పని తనం గురించి చెప్పుకోవాలి. సినిమాలో ప్రతి సన్నివేశం అంత రిచ్ గా వచ్చింది అంటే అందుకు కారణం ఆయనే . కీరవాణి స్వరాలు కొంత వరకే ఆకట్టుకుంటాయి. ఆర్ ఆర్ విషయంలో మాత్రం కీరవాణికి ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సిందే. గౌతమ్ రాజు ఎడిటింగ్ విషయంలో నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తన దర్శకత్వ ప్రతిభని మరోసారి నిరూపించుకున్నాడు. అయితే దర్శకుడు ఎంచుకున్న క‌థ గొప్పదే అయినా, కథ‌నం విషయంలో దర్శకేంద్రుడు మరింత జాగ్ర‌త్త‌ వహించి ఉంటే బాగుండేది. పాటల చిత్రీకరణలో మాత్రం దర్శకేంద్రుడు తనలో పదును ఇంకా తగ్గలేదు అని నిరూపించుకున్నాడు.

ప్లస్ పాయింట్స్ :

మంచి కధ

నాగార్జున నటన

అనుష్క నటన

గోపాల్ రెడ్డి కెమెరా వర్క్

మైనస్ పాయింట్స్ :

బలమైన కధనం లేకపోవడం

డ్రామా లేకపోవడం

క్లయిమ్యాక్స్

విశ్లేషణ..
నిజానికి రాఘవేంద్ర రావు లాంటి దర్శకుడికి ఒక సినిమాని హిట్ చేయడానికి అద్భుతమైన కథ‌లు అవసరం లేదు. ఆయన సినిమాల్లో ప్రతి సన్నివేశానికి ముందు ఆ సన్నివేశానికి ప్రేక్షకుడిని కనెక్ట్ చేసే విధంగా ఒక ఎస్టాబ్లిష్ మెంట్ షాట్స్ ఉంటాయి. దానికి తోడు ఒక బ్రహాండమైన డ్రామా కొనసాగుతూ ఉంటుంది. ఆ రెండే ఈ సినిమాలో మిస్ అయ్యాయి. అయితే దర్శకేంద్రుడు తన ప్రతిభతో ఆ లోపలన్నిటినీ కవర్ చేసేశాడు . ఇక ఈ సినిమాకి కీరవాణి ఇంతకు 10 ఇంతలు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి ఉన్నా ప్రేక్షకులు తృప్తి చెందరు. ఎందుకంటే అన్నమయ్య కి ఇంతకీ 100 రెట్లు సంగీతాన్ని అందించాడు కాబట్టి .

పంచ్ లైన్ : నమో వెంకటేశాయ గొప్ప భక్తుడు, రాఘవేంద్ర రావు దాన్ని మంచి సినిమాగా మలిచారు కూడా, కానీ అన్నమయ్య సినిమాని మైండ్ లో నుంచి తీసేసి చూస్తేనే ఈ సినిమా ప్రేక్షకులకి నచ్చుతుంది.

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ : 3/5