అభినేత్రి మూవీ రివ్యూ – హర్ర‌ర్ లేని హ‌ర్ర‌ర్ సినిమాఅభినేత్రి.. లేడీ ఓరియెంటెడ్ మూవీ, అందులోనూ త‌మ‌న్నా హీరోయిన్. అన‌గానే అంద‌రికీ ఓ ర‌క‌మైన ఆస‌క్తి క‌లిగింది. త‌మ‌న్నా కు తోడు ఇండియ‌న్ మైకెల్ జాక్స‌న్ ప్ర‌భుదేవా, నిన్నొద‌ల బొమ్మాళీ అంటూ త‌న‌కంటూ ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్న సోనూసూద్ లు కూడా ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషించ‌నున్నార‌న్న విష‌యం తెలియ‌గానే అంచ‌నాలు ఓ స్థాయికి చేరుకున్నాయి. ఈ ముగ్గురుకి తెలుగు, త‌మిళ‌, హిందీ సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో బాగా గుర్తింపు ఉండ‌టంతో, సినిమాను మూడు భాష‌ల్లోనూ తెర‌కెక్కించారు. ఎన్నో అంచనాల మధ్య తమన్న, ప్రభుదేవా, సోనూసూద్ కలిసి నటించిన హారర్ ఎంటర్టైనర్ ‘అభినేత్రి’ దసరా కానుకగా విడుదలైంది. హారర్ జానర్ లో త‌మ‌న్నా ఫస్ట్ టైం చేసిన ఈ సినిమా ఏ రేంజ్ లో అంచనాలు అందుకుందో చూద్దాం.
ముంబైలోని ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేసే కృష్ణ (ప్రభుదేవా)కు పెళ్లి విషయంలో కొన్ని కలలు, లక్ష్యాలూ ఉంటాయి. తనలా చలాకీగా ఉంటూ.. ఇంగ్లీష్ మాట్లాడే మోడ్రన్ అమ్మాయిని పెళ్లి చేసుకొందామనుకొంటాడు. అయితే..ఇంట్లోవాళ్లు ఒత్తిడి చేయడంతో దేవి(తమన్నా)అనే ప‌ల్లెటూరి అమ్మాయిని ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకుంటాడు. కాపురానికి ముంబై తీసుకొచ్చి ఓ అపార్ట్‌మెంట్‌లో మకాం పెడతాడు. తనని ఎలాగైనా సరే సముదాయించి తిరిగి ఊరు పంపించేద్దామన్న ప్రయత్నాల్లో ఉంటాడు కృష్ణ‌. ఆ అపార్ట్‌మెంట్‌లోకి రాగానే దేవి ప్రవర్తనలో మార్పు వస్తుంది. తనలో రూబీ (తమన్నా) ఆత్మ ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి కృష్ణకు కష్టాలు మొదలవుతాయి. సినిమా హీరో రాజ్ (సోనూ సూద్) దేవిని చూసి.. ఆమె అందానికి ముగ్థుడైపోతాడు. తన సినిమలో కథానాయికగా ఆఫర్ ఇస్తాడు. అక్కడి నుంచి రూబీ… రాజ్‌కి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుంటుంది. ఇంతకీ రూబీ ఎవరు? ఎందుకు ఆత్మ రూపంలో దేవిని ఆవహించింది? రాజ్‌ని టార్గెట్ చేయడానికి ప్రత్యేకమైన కారణాలేమైనా ఉన్నాయా? అనేదే ఈ అభినేత్రి కథ.
త్రిష చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ నాయ‌కి సినిమా చూడని వాళ్ల‌కి ఈ సినిమా క‌థ కొత్త‌గా ఉంది అనుకుంటారు. కానీ చూసిన‌వాళ్లు మాత్రం అదే సినిమాను కొంచెం మార్చి తీసిన‌ట్లున్నాడు అని మొద‌ట్లోనే అర్థం అవుతుంది. అయితే ఈ సినిమాలో కామెడీని ద‌ర్శ‌కుడు విజ‌య్ బాగా బ్యాలెన్స్ చేశాడు. స‌ప్త‌గిరి కామెడీ కొన్ని చోట్ల బాగున్న‌ప్ప‌టికీ, చివ‌ర‌కు విసుగు క‌లిగిస్తుంది. మొద‌ట్లో అస‌లు దెయ్యం అంటేనే భ‌య‌ప‌డే ప్ర‌భుదేవా త‌ర్వాతర్వాత ఆ దెయ్యాన్నే బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి వెళ్ల‌డం క‌న్విన్సింగ్ గా అనిపించ‌దు. ఎప్పుడైతే క‌థలో ఇంటర్వెల్ బ్యాంగ్ లో ట్విస్ట్ రివీల్ అవుతుందో, అప్పటి నుంచి ఒక్క స‌న్నివేశం కూడా ఆస‌క్తిక‌రంగా ఉండ‌దు. మొద‌టి నుంచి హార‌ర్ సినిమాగా చెప్పుకొచ్చిన ఈ సినిమాలో ఒక్క‌చోట కూడా ఆ యాంగిల్ క‌న‌ప‌డ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం. సినిమా ముందు ముందు ఏం జ‌రగ‌బోతుంది అని ఇట్టే గ్ర‌హించ‌వ‌చ్చు. క‌థ‌, క‌థ‌నం మీద ద‌ర్శ‌కుడు ఇంకాస్త దృష్టి పెట్టుంటే బాగుండేద‌నిపిస్తుంది.
న‌టీన‌టుల విష‌యానికొస్తే అటు మోడ‌ల్ గా, ఇటు ప‌ల్లెటూరి అమ్మాయిగా త‌మ‌న్నా త‌న న‌ట‌న‌తో మెప్పించింది. ప్ర‌భుదేవా చాలా కాలం త‌ర్వాత వెండితెర మీద మ‌ళ్లీ క‌నిపించి, త‌న కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. కొన్ని కొన్ని స‌న్నివేశాల్లో ప్ర‌భుదేవా న‌ట‌న చాలా బాగుంది. సోనూసూద్ సినిమా హీరో గా, ఒక విధంగా చెప్పాలంటే త‌న రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్ ని పోషించాడ‌నే చెప్పాలి. ఈ ముగ్గురు త‌మ న‌ట‌న‌తో సినిమాకు బాగా ప్ల‌స్ అయ్యారు. స‌ప్త‌గిరి,ముర‌ళీ శ‌ర్మ‌ కామెడీ కొన్ని సార్లు థియేట‌ర్లో న‌వ్వులు పూయించింది. మిగ‌తా పాత్ర‌లు త‌మ పాత్ర‌ల ప‌రిధిలో బాగానే చేశారు.
టెక్నీషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది కెమెరామన్ గురించే. తన కెమెరా వర్క్ తో సినిమాకు ఎక్స్ ట్రా కళ తీసుకొచ్చాడు. ముఖ్యంగా పాటల చిత్రీకరణ ఆకట్టుకుంది. మ్యూజిక్ ప‌ర్లేదు. రీ రికార్డింగ్ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. మాటలు బాగానే అలరించాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో ‘నీ తల రాత బాగోలేదని మరొకరి తల రాత మార్చే హక్కు నీకు లేదు’, వంటి మాటలు ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి.
పైన‌ల్ గా త‌మ‌న్నా, ప్ర‌భుదేవా, సోనూసూద్ లాంటి స్టార్ కాస్ట్ ఉంది కాబ‌ట్టి సినిమాను ఖ‌చ్చితంగా చూడాలి అనుకునే వాళ్లు మాత్రం ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. ఏ దిక్కు లేక ఈ సినిమాకు వ‌చ్చిన వాళ్లు మాత్రం థియేట‌ర్ల నుంచి అసంతృప్తిగానే బ‌య‌ట‌కు వ‌స్తారు.

పంచ్ లైన్ః అభినేత్రి – హర్ర‌ర్ లేని హ‌ర్ర‌ర్ సినిమా

Filmjalsa Rating : 2.25/5