Trisha Watches U


కెరీర్ స్టార్ట్ చేసిన దశాబ్ద కాలం పూర్తయిన తర్వాత.. ఈ బ్యూటీ తొలిసారిగా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న హారర్ కామెడీ చిత్రంలో త్రిష‌ నటిస్తోందనగానే చాలామందికి ఆశ్చర్యం వేసింది. అయితే.. దీనికంటే ముందే అరణ్మణై2 రిలీజ్ కావడంతో.. ఇది దెయ్యం సినిమానా అనే కామెంట్స్ బాగానే తగ్గాయి. మ‌రోసారి దెయ్యం సినిమాలో న‌టించి ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్ట‌నుంది త్రిష. ఇంత‌కుముందే అరణ్మణై 2లో న‌టించిన‌ప్ప‌టికీ, అది  హిట్ అయిన మూవీకి సీక్వెల్. కానీ నాయకి సంగతి అలా కాదు. మూవీకి సంబంధించిన ప్రతీ విషయాన్ని తనే మోయాల్సి ఉంటుంది త్రిష. దీనికి తోడు సత్యం రాజేష్ తో జంటగా నటించేందుకు ఒప్పుకుని త్రిష సాహసం చేసిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అసలు ఈ మూవీలో త్రిష ఎలా ఉంటుందనే మాటలకు కొన్నాళ్ల క్రితం.. మోషన్ పోస్టర్ తో సమాధానం ఇచ్చాడు దర్శకుడు గోవి. ప్రస్తుతం నాయకికి సంబంధించిన కొన్ని పోస్టర్స్ విడుదలయ్యాయి. త్రిష దెయ్యంగా భయపెట్టేందుకు తెగ ట్రై చేసేస్తోంది. ఒకవైపు ఎక్స్ పోజింగ్ చేస్తూ.. మరోవైపు భయపెట్టేందుకు ప్రయత్నించడం కొంచెం కామెడీగా ఉందనే కామెంట్స్ కూడా అక్క‌డ‌క్క‌డా వినిపిస్తున్నాయి. పైగా త్రిష ఎంత సీరియస్ గా ఉరిమి ఉరిమి చూసినా.. భయపెడుతున్నట్లుగా లేదని అంటున్నారు జనాలు. మరి సినిమాలో అయినా త్రిష ఎంత‌గా భ‌య‌పెడుతుందో చూడాలి.