దేవీశ్రీ ప్లేస్‌ను రీప్లేస్ చేసిన థ‌మ‌న్


మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ మిస్ట‌ర్ మ‌రో నాల్రోజుల్లో విడుద‌ల కానుంది. శ్రీను వైట్ల డైర‌క్ష‌న్ లో తెర‌కెక్కిన మిస్ట‌ర్ తో పాటూ, వ‌రుణ్, శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఫిదా అనే చిత్రాన్ని కూడా చేస్తున్నాడు. సాయి ప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్ర యూనిట్ త‌మ త‌దుపరి షెడ్యూల్ కోసం త్వ‌ర‌లోనే అమెరికా వెళ్ల‌నున్నారు. అయ‌తే శేఖ‌ర్ క‌మ్ముల సినిమా త‌ర్వాత వ‌రుణ్ తర్వాతి సినిమా కూడా ఆల్రెడీ లైన్ లో ప‌ట్టేశాడు. వెంకీ అట్లూరి అనే కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేస్తూ, తన సినిమాను ప్లాన్ చేసుకున్నాడు వ‌రుణ్. అయితే ఇప్పుడీ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతుంది. 

ఈ సినిమాకు దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నాడ‌న్న విష‌యం తెలిసిందే. మొట్ట‌మొద‌టి సారి, వ‌రుణ్-దేవీ కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుంద‌ని తెలియగానే అంద‌రికీ ఈ సినిమాపై ఆస‌క్తి నెల‌కొంది. అయితే ఇప్పుడు దేవీ ప్లేస్ ని థ‌మ‌న్ రీప్లేస్ చేసిన‌ట్లు తెలుస్తుంది. వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న దేవీ శ్రీ ప్ర‌సాద్ కు వేరే ప్రాజెక్టులు కొన్ని డిస్ట్ర‌బ్ కావ‌డంతో, వ‌రుణ్ సినిమాకు బాణీలు ఇవ్వ‌డానికి టైమ్ ప‌డుతుంద‌ని చెప్పాడ‌ట‌. దీంతో షూటింగ్ లేట్ అవుతుంద‌ని భావించిన సినిమా యూనిట్ దేవీ శ్రీ తో చ‌ర్చ‌లు జ‌రిపి ప‌ర‌స్పర అంగీకారంతోనే ప్రాజెక్టు నుంచి త‌ప్పించార‌ట‌. ఇప్ప‌టికే మెగా స్టార్ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ కొట్టేసిన థ‌మ‌న్ మ‌రో మెగా ప్రాజెక్టును బాగానే ప‌ట్టాడే..