లండన్‌ పార్లమెంట్‌లో 'లోకరక్షకుడు' లోగో విడుదల


చంద్రాస్‌ ఆర్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై చంద్ర పర్వతమ్మ సమర్పణలో చంద్రశేఖర్‌ చంద్ర నిర్మిస్తున్న 'లోకరక్షకుడు' చిత్రం మార్చి 29న లండన్‌ పార్లమెంట్‌లో లోగో విడుదల జరుపుకుంది. బ్రహ్మం సి.హెచ్‌. ఈ చిత్రానికి దర్శకుడు. పలు భాషల్లోనూ, పలు దేశాల నటీనటులతో తెరకెక్కుతున్న ఈ చిత్ర లోగోని లండన్‌ పార్లమెంట్‌లో ఎమ్‌.పి. బాబ్‌ బ్లాక్‌మెన్‌ ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏషియన్‌ లైట్‌ న్యూస్‌ ఎమ్‌.డి. అజిజ్‌, యుకె తెలుగు ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌ సంస్థకు చెందిన డా|| శేఖర్‌ వేమూరి, డా|| సూర్యదేవర ప్రసాదరావు, లండన్‌ జియ్యర్‌ ట్రస్ట్‌కి చెందిన వింజమూరి రాగసుధ మరియు ఇతర అన్యమత పెద్దలు పాల్గొని..చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. . 
ఈ సందర్భంగా నిర్మాత చంద్రశేఖర్‌ చంద్ర మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు జీవిత చరిత్రని అత్యద్భుతంగా, క్రొత్త అంశాలతో తెరకెక్కిస్తున్నాము. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్‌ పూర్తయ్యాయి. మొదటి షెడ్యూల్‌ ఇండియాలోనూ, రెండవ షెడ్యూల్‌ ఇంగ్లండులోని పలు ప్రదేశాలలో చిత్రీకరించడం జరిగింది. 2017 క్రిస్టమస్‌ కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాము. ప్రపంచపటంలో అనాదిగా భారతదేశం శాంతి చిహ్నాము. గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీ తదితర మహానుభావులు ప్రపంచశాంతికి మార్గ దిశని చూపారు. అలాగే ఏసుక్రీస్తు జీవితం, మార్గం, సందేశం పలు వర్గాలలో, ప్రదేశాలలో శాంతి నింపే విధంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము..అని అన్నారు. 
ఎమ్‌.పి. బాబ్‌ బ్లాక్‌మెన్‌ మాట్లాడుతూ..భారతదేశం చాలా గొప్ప దేశం. శాంతికి చిహ్నం. ఇటువంటి చిత్రం భారతదేశంలో నిర్మించడం చాలా గర్వకారణం. ఇప్పుడు లోగో విడుదల చేయడమే కాదు..ఈ చిత్ర ప్రారంభానికి కూడా ఇండియా వస్తాను..అని అన్నారు. 
ఈ చిత్రానికి సంగీతం: ఎ.కె. రిసాల్‌ సాయి, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: జి. క్రిష్‌, రైటర్‌: డి. కృపాకర్‌, సమర్పణ: చంద్ర పర్వతమ్మ, నిర్మాత: చంద్రశేఖర్‌ చంద్ర, దర్శకత్వం: సి.హెచ్‌. బ్రహ్మం.