నెగిటివ్ క్యారెక్ట‌ర్ చేస్తున్న హైప‌ర్ హీరోయిన్


బెల్లం శ్రీదేవిగా సుప్రీమ్ మూవీలో పోలీస్ పాత్ర చేసి నవ్వులు పంచిన రాశి ఖన్నాను  తెలుగు సినీ ప్రేక్షకులు ఇప్పటిలో మర్చిపోవడం కష్టం. క్రేజీ ప్రాజెక్టులు పట్టుకోవడంలో ఈ మధ్య బాగానే సక్సెస్ అవుతున్న ఈ భామ.. మలయాళీ సినీ పరిశ్రమలో కూడా అరంగేట్రం చేసేస్తోంది.

బి. ఉన్నికృష్ణన్ దర్శకుడుగా.. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న ఓ మూవీలో రాశిఖన్నాను ఒక కీలక పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు. కొన్ని వారాల క్రితమే రాశి ఖన్నా షూటింగ్ కూడా మొదలైపోగా.. మరి కొన్ని రోజుల్లోనే రాశి ఖన్నా పాత్రకు సంబంధించిన పార్ట్ పూర్తయిపోనుందట. ఇప్పుడీ సినిమా గురించి.. రాశి ఖన్నా రోల్ గురించి కొత్త అప్ డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే.. ఈమె చేస్తున్నది ఓ నెగిటివ్ రోల్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో తన పాత్ర గురించి వినగానే విపరీతమైన ఎగ్జైట్మెంట్ కు గురైన రాశి.. నెగిటివ్ రోల్ కావడంతోనే ఏమాత్రం సందేహించకుండా  సైన్ చేసిందని అంటున్నారు. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో విశాల్, హన్సికలు కూడా నటిస్తుండడం విశేషం.