మొటిమ‌లు, మ‌చ్చ‌లు పోవాలంటే ఇలా చేయండి..


అమ్మాయిల‌ను మ‌రియు మహిళలను ఎక్కువ‌గా ఇబ్బంది పెట్టే స‌మ‌స్యల్లో మొటిమ‌ల స‌మస్య ఒక‌టి. కేవ‌లం ఆడ‌వారికి మాత్ర‌మే కాదు, ఎంతోమంది అబ్బాయిలు సైతం వీటితో ఇబ్బంది ప‌డుతున్నారు.వీటి ద్వారా వ‌చ్చే మచ్చ‌ల‌ను, స్కార్స్ ను త‌గ్గించుకోవ‌డానికి కొన్ని రోజులైనా ప‌ట్ట‌వ‌చ్చు, కొన్ని నెల‌లైనా ప‌ట్ట‌వ‌చ్చు. ఆయిల్ ఫేస్ ఉన్న వారికి ఈ మొటిమ‌లు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. ముఖంలో ఎక్కువ ఆయిల్స్ ఉండ‌టంతో, అవి చర్మ రంధ్రాల‌ను మూసేస్తుంది. దీంతో ఆ రంధ్రాల్లో ఆయిల్స్ చేరి నిల్వ ఉంటాయి. త‌ద్వారా స్కిన్ ఇన్ఫెక్ష‌న్ మ‌రియు మొటిమ‌ల‌కు దారి తీస్తుంది.
ఇలా మొటిమలు, మచ్చలున్న ముఖంతో నలుగురిలోకి పోవడానికి అమ్మాయిలు ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా ఏదైనా స్పెషల్ కార్యక్రమాలు, ఫంక్షన్స్, పార్టీలు ఉన్నప్పడు ఆ మొటిమ‌ల‌తో న‌లుగురికి ముఖాన్ని చూపించ‌డానికి మ‌రింత బాధపడుతుంటారు. అయితే ఈ మొటిమలను నివారించుకోవడానికి స‌హ‌జ మార్గాలు చాలానే ఉన్నాయి.
మొటిమలు మరియు మచ్చలతో బాధపడే వారు వంటగదిలోని వస్తువులతోనే చాలా త్వరగా, వేగంగా మొటిమల‌ను తగ్గించుకోవచ్చు . మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..
* ఓ టొమాటో తీసుకుని గుజ్జులా చేసుకోవాలి. టేబుల్‌స్పూను నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి మర్దన చేయాలి. పూర్తిగా ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. * కలబంద గుజ్జును తీసుకుని ఓ ఐదునిమిషాలు ఎండలో ఉంచాలి. అందులో కొన్నిచుక్కల నిమ్మరసం కలిపి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. పదిహేను నిమిషాల తరవాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. * రెండు పెద్ద చెంచాల గంధంపొడిలో కొన్నిచుక్కల గులాబీనీరు కలిపి మచ్చలున్న చోట రాయండి. పూర్తిగా ఆరిపోయాక కడిగేయాలి. మచ్చల ప్రభావం తగ్గడమే కాదు.. ముఖం కూడా మృదువుగా మారుతుంది. * చిన్న బంగాళాదుంప ముక్కను తీసుకుని తురమాలి. అందులో కొద్దిగా తేనె కలిపి మచ్చలపై రాయాలి. ఇరవై నిమిషాల తరవాత కడిగేసుకుంటే సరిపోతుంది. బంగాళాదుంప తురమడం కష్టం అనుకుంటే.. ఆ ముక్కలు రెండు తీసుకుని మచ్చలున్న చోట నెమ్మదిగా రుద్దాలి. * నిమ్మలో విటమిన్‌ ‘సి’తోపాటూ ఆస్ట్రింజెంట్‌ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మాన్ని శుభ్రపరచడమే కాదు.. మచ్చల్నీ నివారిస్తాయి. కాబట్టి నిమ్మకాయ ముక్కను తీసుకుని ముఖంపై రుద్దుకోవాలి. నిమ్మరసంలో దూదిని ముంచి.. ముఖంపై రాసుకున్నా సరిపోతుంది. * కీరదోస తురుములో కాసిని పాలూ, నిమ్మరసం కలిపి ముద్దలా చేసుకోవాలి. మచ్చలున్న చోట రాయాలి. కొంతసేపయ్యాక కడిగేస్తే మచ్చలు తగ్గుతాయి.