కింగ్ కు కొత్త న్యూస్ వినిపించిన మీడియా


ఏదైనా స‌రే స‌ర‌దాగా ఒక‌రు నోరుజారితో చాలు, అది ఇంతింతై వార్త‌గా మారిపోతుంది. అదే మ‌న టాలీవుడ్ లో అయితే కొంచెం ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఏయే సినిమాలు రాబోతున్నాయి, అనే విష‌యంపై రోజుకు చాలానే వార్త‌లు వ‌స్తుంటాయి. అందులో కొన్ని నిజం కాగా, మ‌రి కొన్ని రూమ‌ర్స్ గానే మిగిలిపోతుంటాయి. ఇప్పుడు అలాంటి వార్తే ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌నం లాంటి బ్లాక్ బ్ల‌స్ట‌ర్ లో న‌టించిన నాగార్జున‌- నాగ‌చైత‌న్య‌లు మ‌రోసారి వెండితెర‌ను కలిసి పంచుకోనున్నార‌నే వార్తే అది.శ‌త‌మానం భ‌వ‌తి లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్టయిన‌ర్ ను అందించిన స‌తీశ్ వేగేశ్న ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నుండ‌గా, దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నాడ‌నే వార్త‌లు నిన్నటి వ‌ర‌కు కాస్త గ‌ట్టిగానే వినిపించాయి. అయితే ఇవన్నీ కేవ‌లం పుకార్లే అని నాగార్జున తేల్చేశాడు. నేను, చై ఇద్ద‌రం క‌లిసి ఇంకో సినిమాలో న‌టించ‌బోతున్నామ‌నే వార్త‌లు వింటున్నాను, చ‌దువుతున్నాను. ఇది నాకు కూడా వార్తే అంటూ చేసిన ట్వీట్ తో ఈ వార్త జ‌స్ట్ రూమ‌ర్ మాత్ర‌మే అని తేల‌పోయింది. త‌మ అభిమాన న‌టుల‌ను ఒకే స్క్రీన్ పై మ‌ళ్లీ చూడొచ్చ‌ని ఆశ ప‌డిన అక్కినేని అభిమానుల‌కు మాత్రం నాగ్ చేసిన ఆ ఒక్క ట్వీట్ నిరుత్సాహాన్నే మిగిల్చింది.