మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన "ఇది మా ప్రేమకథ" మోషన్ పోస్టర్!


యాంకర్ రవి హీరోగా పరిచమవుతూ నటిస్తున్న చిత్రం "ఇది మా ప్రేమ కథ". రవి సరసన "శశిరేఖా పరిణయం" సీరియల్ ఫేమ్ మేఘన లోకేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మత్స్య క్రియేషన్స్-పి.ఎల్.కె ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మస్తున్నాయి. యువ ప్రతిభాశాలి అయోధ్య కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతుండగా.. కార్తీక్ కొడకండ్ల సంగీత సారధామ్ వహిస్తున్నారు. ఇటీవల ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాధ్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు విశేషమైన స్పందన లభించింది. నిన్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.   
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "యాంకర్ రవిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ మేం నిర్మిస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ ను డైరెక్టర్ పూరీ జగన్నాధ్ గారు విడుదల చేయడం మాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఇప్పుడు మా సినిమా మోషన్ పోస్టర్ ను ఏకంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా విడుదల చేసి.. అభినందించడంతోపాటు ఆశీర్వాదాలు కూడా అందించడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే మరో స్టార్ హీరోతో ట్రైలర్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి" అన్నారు.
చిత్ర దర్శకుడు అయోధ్య కార్తీక్ మాట్లాడుతూ.. ""మోషన్ పోస్టర్ భలే క్యూట్ గా ఉందయ్యా" అని చిరంజీవిగారు నన్ను ప్రశంసించడం జీవితంలో ఎప్పటికీ మరువలేను. మెగాస్టార్ చిరంజీవిగారు మా మోషన్ పోస్టర్ ను విడుదల చేయడంతో.. మా చిన్న సినిమా కాస్తా ఇప్పుడు పెద్ద చిత్రమైపోయింది. అలాగే మా సినిమా ద్వారా పాపులర్ సీరియల్ ఆర్టిస్ట్ మేఘనా లోకేష్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాం.  త్వరలోనే ట్రైలర్ ను కూడా విడుదల చేసి.. సమ్మర్ కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు. 
చిత్ర కథానాయకుడు రవి మాట్లాడుతూ.. "అడిగిన వెంటనే కాదనకుండా మా చిన్న చిత్రాన్ని ఆశీర్వదించేందుకు ముందుకొచ్చిన మా మెగాస్టార్ చిరంజీవిగారికి జీవితాంతం ఋణపడి ఉంటాను. ప్రేక్షకులు మా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారన్న నమ్మకం ఉంది" అన్నారు. 
చిత్ర కథానాయకి మేఘనా లోకేష్ మాట్లాడుతూ.. "స్వతహా థియేటర్ ఆర్టిస్ట్ ని అయిన నేను "ఇది మా ప్రేమకథ" లాంటి లవ్లీ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా హీరోయిన్ గా వెండితెరకు పరిచయమవుతుండడం, అది కూడా పాపులర్ యాంకర్ రవికి జంటగా నటించడం చాలా సంతోషంగా ఉంది. ఒక ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు అయోధ్య కార్తీక్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. ఇక మనందరి మెగాస్టార్ చిరంజీవిగారు మా సినిమా మోషన్ పోస్టర్ ను విడుదల చేయడం మా సినిమాకి మంచి బూస్ట్ ఇచ్చినట్లయ్యింది" అన్నారు. 
ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైన్స్: రమేష్ కొత్తపల్లి, పాటలు: దినేష్ (నాని), సినిమాటోగ్రఫీ: మోహన్ రెడ్డి, సహనిర్మాత: పి.ఎల్.కె.రెడ్డి, సంగీతం: కార్తీక్ కొడకండ్ల, నిర్మాణం: మత్స్య  క్రియేషన్స్, దర్శకత్వం: అయోధ్య కార్తీక్!!