‘‘జయమ్ము నిశ్చయమ్మురా’’ అని ఆశీర్వదించిన సెన్సార్ బోర్డ్


తెలుగులో పల్లెవాసన ఉన్న సినిమాలు తగ్గాయి. తెలుగుదనం.. తెలుగు నేటివిటీ ఉన్న సినిమాలు అత్యంత అరుదుగా తప్ప రావడం లేదు. ఈ నేపథ్యంలో శివరాజ్ కనుమూరి అనే కొత్త దర్శకుడు దేశీయ వినోదం అందిస్తానంటూ జంధ్యాల పాత సినిమా టైటిల్ తో ‘‘జయమ్ము నిశ్చయమ్మురా’’ అంటూ రాబోతున్నాడు. ఇక ఈసినిమాలో శ్రీనివాసరెడ్డి హీరో అనగానే కామెడీగా ఉంటుందనుకున్నవారికి ఆ మధ్య రిలీజ్ చేసిన పాటతో సర్ ప్రైజ్ చేశారు. ఓ సాధారణ పాత్రలా ఆ పాటలో కనిపించి శ్రీనివాసరెడ్డి ఆకట్టుకున్నాడు. ఇక ఈనెల 13న ఆడియో విడుదల కాబోతోంది. అయితే ఆడియో కంటే ముందే ఈ సోమవారం సినిమా సెన్సార్ కావడం విశేషం. మూవీకి సెన్సార్ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ తో అద్భుతమైన ఫీల్ గుడ్ మూవీ చూశామనే కాంప్లిమెంట్ కూడా వచ్చింది. ఇక ఆడియోతో పాటు సినిమాకూ ప్రిపేర్ చేస్తున్నారా అన్నట్టుగా సినిమాలోని ఇంపార్టెంట్ పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ సరికొత్త ప్రమోషన్స్ కు టీజర్స్ లేపిందీ టీమ్. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటతో ఎంటైర్ ఇండస్ట్రీని ఆకట్టుకున్న ఈమూవీ.. రీసెంట్ గా తత్కాల్ ప్రవీణ్ అంటూ కమెడియన్ ప్రవీణ్ పై రిలీజ్ చేసిన టీజర్ సూపర్ అనిపించుకుంది. ఇక ఇప్పుడు కృష్ణభగవాన్ చేస్తోన్న అడపా ప్రసాద్ అనే పాత్రను పరిచయం చేశారు. అడపా ప్రసాద్ గా కృష్ణ భగవాన్ పాత్ర కూడా అద్భుతంగా ఉండబోతోంది.. అదిరిపోయే కామెడీ పంచబోతోంది అన్నట్టుగా ఉంది. ఎవరైనా పచ్చగా ఉంటే ఓర్వలేని పాత్రగా అడపా ప్రసాద్ సింగిల్ సీన్ తోనే కడుపుబ్బా నవ్వించారు. ఈ పాత్రలు చూస్తోంటే.. ఒకప్పుడు వంశీ, భారతీరాజా, జంధ్యాల తరహా రియలిస్టిక్ క్యారెక్టర్స్ గా అనిపిస్తున్నాయి. ఏదేమైనా అంచనాలు పెంచుతూనే.. బిజినెస్ నూ పెంచుతోన్న ఈ మూవీ మంచి విజయం సాధిస్తే..మరిన్ని తెలుగుదనం ఉన్న సినిమాలు వస్తాయనడంలో ఏ డౌట్ లేదు.