రిసెప్ష‌న్ కు గాలి ఎక్కువ‌గానే వీచేట్లుందే..


అంగ‌రంగ వైభ‌వంగా గాలి జ‌నార్థ‌న రెడ్డి కూతురు పెళ్లి బెంగుళూరు లో జ‌రిగిన విష‌యం తెలిసిందే. కానీ తెలుగు రాష్ట్రాల నుంచి పెళ్లికి వెళ్లిన వారిని వేళ్ల‌పై లెక్క పెట్టుకోవ‌చ్చు. తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర రెడ్డి, అనంత‌పురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాపు రామ‌చంద్రారెడ్డి మాత్ర‌మే ఈ పెళ్లికి హాజ‌రయ్యారు. ఉమ్మ‌డి రాష్ట్ర సీఎంగా కొన‌సాగిన రోశ‌య్య కూడా ఈ పెళ్లికి వెళ్లి కొత్త దంపతుల‌ను ఆశీర్వ‌దించారు. ఇక టాలీవుడ్ నుంచి మోహ‌న్ బాబు, బ్ర‌హ్మానందం, శ‌ర‌త్ బాబు, సుద్దాల అశోక్ తేజ‌, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి లు గాలి పెళ్లి వేడుక‌లో మెరిసారు. అయితే నెల 20న హైదరాబాదులో జరగనున్న గాలి వారి విందు భోజనానికి తెలుగు నేలకు చెందిన వారు ఎవరెవరు హాజరవుతారన్నది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నుంచి భారీ సంఖ్యలోనే నేతలు ఈ విందుకు వెళతారన్న వాదన వినిపిస్తోంది. అయితే జగన్ కు వెళ్లాలని ఉన్నా... వైరి వర్గం విమర్శలు ఎక్కుపెట్టేందుకు కాచుక్కూర్చున్న నేపథ్యంలో ఆయన రిసెప్షన్ వైపు కన్నెత్తి చూడరన్న వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా... హైదరాబాదులో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్న గాలి... ఆసక్తికర చర్చకే తెర లేపారని చెప్పక తప్పదు.