సుప్రీమ్ హీరోకి మ‌ళ్లీ ఆయ‌నే హిట్ అవ్వాలి..


నిజానికి ఈ ఏడాది పండ‌గ సీజ‌న్ లో వ‌చ్చిన శ‌తమానం భ‌వ‌తి సినిమాలో శ‌ర్వానంద్ స్థానంలో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఉండాల్సింది. కానీ అప్ప‌టికి తేజూకి వేరే సినిమాల‌కు క‌మిట్మెంట్స్ ఇచ్చి ఉండ‌టంతో, ఈ సినిమా చేయ‌లేక‌పోయాడు. అస‌లు తేజూ కొంచెం ఆలోచించి ఉండుంటే, వేరే సినిమాల‌న్నింటినీ ప‌క్క‌న పెట్టి మ‌రీ ఈ సినిమా చేసేవాడు. కానీ అప్పుడు మ‌నోడు తిక్క‌, విన్న‌ర్ మాయ‌లో ప‌డిపోయి, ఇవేమీ ప‌ట్టించుకోలేదు. ఫ‌లితం తేజూ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర ప‌రాజ‌యం పాల‌వ్వ‌గా, శ‌త‌మానం భ‌వ‌తి మాత్రం క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. 

అయితే, శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో వ‌చ్చిన సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్, సుప్రీమ్ రెండు సినిమాలూ తేజూ కెరీర్ లోనే మరిచిపోలేని విజ‌యాలుగా ఉన్నాయి. వీటితో పాటూ సాయి ధ‌ర‌మ్ తేజ్ శ‌త‌మానం భ‌వ‌తి కూడా చేసి ఉంటే తేజూ రేంజ్ ఇప్పుడు మ‌రోలా ఉండేది. ప్ర‌స్తుతం బి.వి.ఎస్.ఎన్ ర‌వి ద‌ర్శ‌క‌త్వంలో జ‌వాన్ అనే సినిమా చేస్తున్న సాయి, త‌న త‌ర్వాతి సినిమా అయినా రాజు గారి బ్యాన‌ర్ లో చేయాల‌ని చూస్తున్నాడ‌ట‌. ఈ సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉన్నా స‌రే, త‌ర్వాతి సినిమాను దిల్ రాజుతోనే ఉండేలా ప్లాన్ చేసుకోనున్నాడు ఈ సుప్రీమ్ హీరో. 

మ‌రోవైపు దిల్ రాజు కూడా తేజూ తో సినిమా చేయ‌డానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. శ‌త‌మానం భ‌వ‌తి డైరక్ట‌ర్ తేజు కోసం ఒక స్టోరీని డెవ‌ల‌ప్ చేస్తున్నాడ‌ని, ఆ సినిమాకు శ్రీనివాస క‌ళ్యాణం అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేయించారంటున్నారు. ప్ర‌స్తుతం ఫ్లాప్స్ లో ఉన్న త‌న‌తో దిల్ రాజు సినిమా చేస్తాడో లేదో అన్న ఆలోచ‌నేమైనా వ‌చ్చిందో ఏమో కానీ, త‌న జ‌వాన్ సినిమా సెట్ కు దిల్ రాజు ను ఆహ్వానించి మ‌రీ, శ‌త‌మానం భ‌వ‌తి సినిమాకు నేష‌నల్ అవార్డు వ‌చ్చినందుకు దిల్ రాజు కు స‌న్మానం చేశాడు తేజూ. దీంతో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో సినిమా రావ‌డం కన్ఫార్మ్ అనే అంటున్నారు.