చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆది


రవిరాజా పినిశెట్టికి చిరంజీవి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇప్పుడది ఆయన తనయుడు ఆది పినిశెట్టిని టాలీవుడ్‌లో బిజీ యాక్టర్‌ని చేస్తోంది. 'ఒక విచిత్రం' సినిమాతో హీరోగా మారిన ఆది ఆ తర్వాత తమిళనాడుకి షిఫ్ట్‌ అయి అక్కడ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తమిళంలో స్టార్‌ స్టేటస్‌ రాకపోవడంతో అరకొర అవకాశాలతోనే కాలం గడిపాడు.

అనుకోకుండా అతడికి సరైనోడు చిత్రంలో విలన్‌గా నటించే అవకాశం దక్కింది. అంతే... ఆది స్టార్‌ తిరిగిపోయింది. ఇప్పుడు తెలుగులో అతనికి చాలా అవకాశాలొస్తున్నాయి. వీటిలో ఎక్కువ భాగం మెగా ఫ్యామిలీ చిత్రాలే కావడం గమనార్హం. చరణ్‌, సుకుమార్‌ల చిత్రంతో పాటు పవన్‌, త్రివిక్రమ్‌ చిత్రంలోను ఆది కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇవి కాక నాని సినిమా 'నిన్ను కోరి'లో కూడా ఆది పినిశెట్టి ముఖ్య పాత్ర చేస్తున్నాడు.

మెగా ఫ్యామిలీ అండదండలతో ఆది పినిశెట్టి ఇప్పుడు టాలీవుడ్‌ ఫాస్టెస్ట్‌ రైజింగ్‌ యాక్టర్‌ అయ్యాడు. ఇలా విలన్‌, సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌ చేస్తూ ఫాలోయింగ్‌ పెంచుకుంటే తర్వాత తీరిగ్గా హీరో పాత్రల వైపు వెళ్లి తను కోరుకున్న విధంగా సెటిల్‌ అయిపోవచ్చు ఆది పినిశెట్టి.