లేట్ కు కార‌ణం ఆమే..


వెంక‌టేష్ హీరోగా బాబు బంగారం సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. మొద‌టి నుంచి ఈ సినిమా విడుద‌ల విష‌యంలో జాప్యం జ‌రుగుతూనే వ‌చ్చింది. కానీ చివ‌ర‌కు మాత్రం జులై 29 న సినిమా ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యానికొచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌లు, మ‌రోసారి చేతులెత్తేశారు. దీనికి కార‌ణం ర‌జ‌నీకాంత్ క‌బాలి సినిమాయేన‌ని, అంద‌రూ ఆ సినిమాను ఆడిపోసుకున్నారు. కానీ బాబు బంగారం డిలే లో క‌బాలి త‌ప్పు ఏ మాత్రం లేద‌ని తేలిపోయింది. ముందు క‌బాలి డేట్ ఖ‌రారు కానందుకే బాబు సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాల‌నేది తేల్చుకోలేక యూనిట్ స‌త‌మ‌త‌మ‌య్యార‌నేది బాబు బంగారం టీమ్ వ‌దిలిన ఫీల‌ర్. అంద‌రూ అదే నిజ‌మ‌నుకుని పాపం ఫ్రీ గా జాలి కూడా చూపించేశారు. కానీ బాబు బంగారం ఆల‌స్యానికి అస‌లు నిజం బ‌య‌ట‌ప‌డింది.
బంగారం ఆల‌స్యానికి అస‌లు కార‌ణం హీరోయిన్ న‌య‌న‌తార అని. ఈ సినిమా కు సంబంధించి ఇంకో ప‌దిరోజుల షెడ్యూల్ పెండింగ్ ఉండ‌గా, ఆ షెడ్యూల్ మొత్తం న‌య‌న్ కు సంబంధించిన సీన్స్ యేన‌ని చెప్తున్నారు. దీని కోస‌మే మారుతి ఎలాగైనా ఒక్క ప‌దిరోజుల కాల్షీట్లు ఇవ్వ‌మ‌ని న‌యన్ వెంట‌ప‌డుతున్నాడ‌ట‌. కానీ న‌య‌న్ ఇప్ప‌టికే పీక‌ల్లోతు బిజీ షెడ్యూల్స్ తో ఏమాటా చెప్పకుండా త‌ప్పించుకుని తిరుగుతోంద‌ట‌. దీంతో విసుగు చెందిన టీమ్ రిలీజ్ ను ఏకంగా ఆగ‌స్టు చివ‌రి వారానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌.
ఒక అగ్ర‌హీరో వెంక‌టేష్ సినిమా విష‌యంలోనే ఇలా చేయ‌టం స‌రికాద‌ని వెంకీ ఫ్యాన్స్ న‌య‌న్ మీద క‌స్సుబుస్సులాడుతున్నారు. కానీ న‌య‌న్ వెర్ష‌న్ ఇంకోలా ఉంది. తాను ఇచ్చిన కాల్షీట్స్ లో షూటింగ్ పూర్తి చేయ‌కుండా, ఇప్పుడు ఎక్స్‌ట్రా డేట్స్ అడిగితే తానేం చేయ‌లేన‌నీ, వీలైనంత త్వ‌ర‌లో డేట్స్ ఇవ్వ‌డానికి ట్రై చేస్తా అని హామీ ఇచ్చింద‌ట న‌య‌న్. ఇదంతా వ‌దిలేసి జ‌నాలంతా పాపం అన్యాయంగా క‌బాలిని తిట్టుకున్నారు.