ఖైదీ నెం.150 రివ్యూ – క‌త్తికి త‌లొంచిన ఖైదీపండుగ‌కు ఏవైనా సినిమాలు వ‌స్తున్నాయంటే చాలు.. ఆ హడావిడే వేరు. ఆ సినిమాలు పెద్ద హీరోల‌వైతే ఆ హ‌డావిడి దానికి రెట్టింపు అవుతుంది. అదే ఒక స్టార్ హీరో సినిమా అయితే, అదికూడా తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం త‌ర్వాత మ‌ళ్లీ ఆయ‌న సినిమా వ‌స్తుంటే ఆ హంగామా ఎలా ఉంటుందో చెప్ప‌న‌క్క‌ర్లేదు. దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి కు అది ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌ 150వ చిత్రం కావ‌డం, అది త‌మిళ్ లో పెద్ద విజ‌యం సాధించిన క‌త్తి సినిమాకు రీమేక్ కావ‌డం, దానిని రీమేక్స్ చేయ‌డంలో దిట్ట అయిన వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం, రామ్ చ‌ర‌ణ్ త‌న సొంత బ్యాన‌ర్ పై ఆ సినిమాను ప్రొడ్యూస్ చేయ‌డంతో సినిమా మీద అంచ‌నాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇన్ని అంచ‌నాల మ‌ధ్య ఇవాళ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఖైదీ నెం.150 ప్రేక్ష‌కుల అంచ‌నాలను అందుకుందా లేదా చూద్దాం.

జైలు నుంచి త‌ప్పించుకున్న క‌త్తిశీను(చిరంజీవి) త‌న ఫ్రెండ్ (అలీ) స‌హాయంతో బ్యాంకాక్ వెళ్లాల‌నుకుంటాడు. అక్క‌డ ఎయిర్ పోర్ట్ లో ల‌క్ష్మి (కాజ‌ల్) ను చూసి మొదటిచూపులోనే ప్రేమ‌లో ప‌డి, త‌న బ్యాంకాక్ ప్ర‌యాణాన్ని కూడా వాయిదా వేసుకుంటాడు. అదే స‌మ‌యంలో ఒక అనుకోని ప్ర‌మాదంలో శీను, శంక‌ర్(మరో చిరంజీవి) అనే వ్య‌క్తిని కాపాడాల్సి వ‌స్తుంది. శంక‌ర్ కూడా త‌న‌లా ఉండ‌టం, హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ శీనుకు పాతిక ల‌క్ష‌లు ఇవ్వ‌డంతో అతను ఏం జరుగుతుందో తెలియక ఆశ్చర్యపోతాడు. అలా శంక‌ర్ స్థానంలోకి శీను, శీను స్థానంలోకి శంక‌ర్ వ‌చ్చేస్తారు.కానీ శంక‌ర్ జీవితం మీద ఒక ఊరి రైతుల జీవితాలు,వారి ఆశ‌లు, ఆశ‌యాలు ఉన్నాయని తెలుసుకున్న శంక‌ర్ త‌న జీవితం గురించి ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడు..? అస‌లు శంక‌ర్ కు ఆ క‌లెక్ట‌ర్ డ‌బ్బులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది..? శంక‌ర్ గ‌త‌మేంటి..? శీను అస‌లు ఆ ఊరి రైతులకు న్యాయం చేయ‌గ‌లిగాడా..? అనేదే క‌థ‌.

సినిమాలో ప్ల‌స్ అంటే ముందుగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ గురించే. ఆ స్ట‌యిల్, ఆ యాక్టింగ్, త‌న ఎనర్జీ, కామెడీ.. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఇది చిరంజీవి వ‌న్ మ్యాన్ షో అనే చెప్పాలి. క‌థ రీమేక్ అయిన‌ప్ప‌టికీ, దానిని చిరు కు త‌గ్గ‌ట్టుగా, చిరు నుంచి ఫ్యాన్స్ ఏమి ఆశిస్తారో అది ఉండేట్లు స్క్రిప్ట్ ను మ‌ల‌చ‌డంలో ద‌ర్శ‌కుడు వినాయ‌క్ స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పాలి. ఫ‌స్టాఫ్ మొత్తం ఒక వైపు చిరు ఎన‌ర్జిటిక్ పెర్ఫామెన్స్ తో, కామెడీ తో సాగుతూనే, రైతుల స‌మ‌స్య‌ను కూడా స‌మానంగా బ్యాలెన్స్ చేస్తూ సూప‌ర్బ్ ఇంట‌ర్వెల్ సీన్ తో సినిమాను న‌డిపించిన వినాయ‌క్, సెకండాఫ్ లో కాస్త త‌డ‌బడ్డాడు. ఫ‌స్టాఫ్ లో ఒక యుద్దాన్ని త‌ల‌పించేలా ఎలివేట్ చేసిన రైతుల స‌మ‌స్య ను సెకండాఫ్ లోకి వ‌చ్చేసరికి డ‌ల్ చేశాడు. దీంతో సెకండాఫ్, క్లైమాక్స్ కాస్త నిరుత్సాహ ప‌రుస్తాయి.

దాదాపు తొమ్మిదేళ్ల త‌ర్వాత రీఎంట్రీ కాబట్టి, చిరు ని ఇంత‌కుముందు చిరు లా చూడ‌గ‌ల‌మా అని చాలా మందికి వ‌చ్చిన అనుమానాల‌కు చిరు త‌నదైన శైలిలో చెక్ పెట్టాడు. త‌న‌లోని ఎన‌ర్జీ లెవ‌ల్స్, యాక్టింగ్ స్కిల్స్, డ్యాన్సింగ్ స్కిల్స్, కామెడీ టైమింగ్ ఏ మాత్రం త‌గ్గలేద‌ని ప్రూవ్ చేసుకున్నాడు. ఆరు ప‌దుల వ‌య‌సులో కూడా ఇలాంటి డ్యాన్సుల‌ను చిరంజీవి నుంచి ఆశించొచ్చ‌ని నిరూపించాడు. అటు యాక్ష‌న్ సీన్స్ లోనూ, ఇటు ఎమోష‌నల్ సీన్స్ లోనూ చిరు న‌ట‌న‌ను మెచ్చుకోవాల్సిందే. ‘అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడుస పాట‌లో రామ్ చ‌ర‌ణ్, చిరు క‌లిసి వేసిన స్టెప్పులు ఫ్యాన్స్ ను ‘చిరు’కానుక అనే చెప్పాలి. కాజ‌ల్ పాత్ర చిన్న‌దే అయినా ఉన్నంత‌లో త‌న అందంతో బాగానే మెప్పించింది. త‌రుణ్ అరోరా, త‌న వ‌య‌సు కంటే పెద్ద‌గా కనిపించే పాత్ర‌లో స‌రిపోక‌పోగా, చిరంజీవి ముందు తేలిపోయాడు. అస‌లు చిరంజీవి లాంటి హీరోకి, విల‌న్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత బాగుంటుంది. అలాంటిది చిరంజీవి ముందు త‌రుణ్ అరోరా ని విల‌న్ గా మ‌నం రిసీవ్ చేసుకోలేం. ఎక్క‌డా బ‌ల‌మైన విల‌నిజం అనేది ఎలివేట్ కాక‌పోవడంతో, విల‌న్ క్యారెక్ట‌ర్ ఢీలా ప‌డిపోయింది. బ్ర‌హ్మానందం కామెడీ ఎప్పటిలాగే బోర్ కొట్టేస్తుంది. బ్ర‌హ్మానందం క్యారెక్ట‌ర్ ను ఏదో బ‌లంగా ఇరికించేసిన‌ట్లు ఉంది. అలీ, ర‌ఘుబాబు కామెడీ ట్రాక్ ఫ‌ర్వాలేద‌న‌పిస్తుంది. మిగ‌తా పాత్ర‌ల్లో నాజ‌ర్, నాగ‌బాబు, పోసాని, జ‌య‌ప్రకాష్ రెడ్డి, పోసాని త‌మ త‌మ ప‌రిధిలో బాగా చేశారు.

సాంకేతిక ప‌రంగా.. వినాయ‌క్ త‌న మీద ఉన్న బాధ్య‌త‌కు బాగానే న్యాయం చేశాడు. త‌న‌దైన కోణంలో మెగాస్టార్ ను మ‌రో రేంజ్ లో చూపించాడు. చిరంజీవి మాస్ కోణాన్ని వినాయ‌క్ తెర‌కెక్కించిన తీరు, తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్టు క‌థ‌ను మ‌లిచిన తీరుతోనే త‌న లోని టాలెంట్ ను చూపించాడు వివి వినాయ‌క్. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం గురించి. ఆల్రెడీ సూప‌ర్బ్ ట్యూన్స్ ను ఇచ్చిన డీఎస్పీ తన రీరికార్డింగ్ తో సినిమాను మ‌రోస్థాయికి తీసుకెళ్లాడు. పాట‌ల‌కు, విజువ‌ల్స్ కూడా తోడ‌వ్వ‌డంతో పాట‌ల‌న్నీ చాలా బాగున్నాయి. ఇక సినిమాటోగ్ర‌ఫీ ర‌త్న‌వేలు ప్ర‌తీ ఫ్రేమ్ ను అందంగా చూపించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. ముఖ్యంగా చిరంజీవి ని చూపించిన తీరు బాగా ఆకట్టుకుంది. ఎడిటింగ్ బాగున్న‌ప్ప‌టికీ, కొన్ని కొన్ని స‌న్నివేశాలకు క‌త్తెర ప‌డితే బాగుండేది.రామ్ చ‌ర‌ణ్ నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి. సాయి మాధ‌వ్ బుర్రా రాసిన మాట‌లు ఎంతో అర్థ‌వంతంగా, ఆలోచ‌నా ర‌హితంగా ఉన్నాయి.

”మ‌ట్టి త‌డ‌వ‌డం మాన‌కూడ‌దు.. నీళ్ల‌తో అయినా, క‌న్నీళ్ల‌తో అయినా, మట్టి త‌డవాలి”
”గల్లీ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వ‌ర‌కు త‌ట్టుకున్న గుండెరా ఇది.”
”సముద్రం ఒడ్డున నిల‌బ‌డి, స‌ముద్రం వెన‌క్కి వెళ్లింది క‌దా అని న‌వ్వితే, అదే స‌ముద్రం సునామీతో ముంచేస్తుంది. న‌వ్వుకునే వాడు ఓరోజు ఏడ్చే రోజు వ‌స్తుంది.” ”అభిమానాన్ని అమ్ముకునేంత అవినీతిప‌రుడుని కాను.” వంటి డైలాగ్స్ మాస్ ఆడియెన్స్‌ను, మెగాభిమానుల‌ను అల‌రిస్తాయి.

చివ‌రగా, ఫ‌స్టాఫ్ అంతా మెగాస్టార్ డ్యాన్సులు, కామెడీ, ఫంటాస్టిక్ ఇంట‌ర్వెల్ తో సాగిన ఖైదీ నెం.150, డ‌ల్ సెకండాఫ్, వీక్ క్లైమాక్స్ తో ముగిసిన‌ప్ప‌టికీ, ఇలాంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాతో చిరు రీ ఎంట్రీ ఇవ్వ‌డం బాగుంది.

పంచ్ లైన్ః క‌త్తి కి త‌లొంచిన ఖైదీ నెం.150

Filmjalsa Rating: 3.25/5