ఎన్టీఆర్ బయోపిక్ స్టోరీ ఇదేనా ...!


సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాను అని, అందులో తానే హీరోగా నటించబోతున్నాను అని ప్రకటించగానే బయోపిక్ స్టోరీ ఎలా ఉండాలో ఎవరి వర్షన్ లో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కొంత మంది ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా ఎంత వరకు వచ్చిందో తెలియకుండానే జైలు కి వెళ్తాను అని స్టేట్మెంట్స్ ఇచ్చేశారు . అయితే ఇవన్నీ పక్కన పెడితే ఎన్టీఆర్ బయోపిక్ లో కధ ఎలా ఉండబోతుంది, ఎన్టీఆర్ జీవితాన్ని ఎంత వరకు చూపించి ఎండ్ కార్డు వేయబోతున్నారు అన్న విషయాలు లీక్ అయ్యాయి . అందులో భాగంగానే ఈ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ విషయాలు ఫిలింనగర్ లో లీక్ అవుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ జీవితం పై నిర్మించే ఈసినిమా నిమ్మకూరులో మొదలవుతుంది. నిమ్మకూరు నుండి చెన్నై వెళ్ళే వరకు ఎన్టీఆర్ జీవితంలో ఎదుర్కున్న ఎన్నో ఎత్తుపల్లాలతో పాటు చెన్నైలో టాప్ హీరోగా మారి ఆంధ్రుల ఆరాధ్య దైవంగా ఎదిగిన సందర్భాలను వివరంగా చూపెడతారట. ఆతరువాత 1982 లో తాను స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో అప్పటి రాజకీయ మహోన్నత శక్తి ఇందిరాగాంధీని ఓడించి అధికారంలోకి రావడంతో ఈసినిమాకు శుభం కార్డు పడేలా స్క్రిప్ట్ ను రూపొందిస్తున్నట్లు సమాచారం. దీనితో ఎన్టీఆర్ జీవితంలో వివాదాస్పద సంఘటనలకు చిరునామాగా మారిన లక్ష్మీపార్వతి – నాదెండ్ల భాస్కర రావుల ప్రస్తావన లేకుండా ఈసినిమాకు శుభం కార్డు పడేలా ఆలోచనలు బాలకృష్ణ చేస్తున్నట్లు టాక్. మరి ఈ విధంగా ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కిస్తే అభిమానులు ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి.