‘Sita’ Movie Review

0
983

‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం విజ‌యం త‌ర్వాత ద‌ర్శ‌కుడు తేజ కూడా క‌మ‌ర్షియ‌ల్ దారిలోనే వెళ్లాల‌ని నిర్ణ‌యించుకుని కాజ‌ల్ అగ‌ర్వాల్, బెల్లం కొండ సాయి శ్రీనివాస్ ల‌తో క‌లిసి చేసిన ప్ర‌య‌త్న‌మే ‘సీత‌’. ఎప్పుడూ మాస్ చిత్రాలే చేసే బెల్లంకొండ శ్రీనివాస్ త‌న పంథా మార్చుకుని ఈ చిత్రం ద్వారా విజ‌యాన్ని అందుకోవాల‌నుకుంటున్నాడు. మ‌రి తేజ వ‌రుస‌గా త‌న స‌క్సెస్ ను నిల‌బెట్టుకుంటాడా? బెల్లంకొండ కు ఈ సినిమా అయినా త‌ను అనుకున్న స్థాయి విజ‌యాన్ని ఇచ్చిందా లేదా స‌మీక్ష‌లో చూద్దాం.

5 వేల కోట్ల ఆస్తికి వారసురాలైన సీత (కాజ‌ల్ అగ‌ర్వాల్) కు డ‌బ్బు త‌ప్ప ప్ర‌పంచంలో ఇంకేమీ ముఖ్యం కాద‌నుకుంటుంది. త‌న తొంద‌ర‌పాటు వ‌ల‌న ఎమ్మెల్యే బ‌స‌వ‌రాజు (సోనూ సూద్) ఉచ్చులో చిక్కుకోవ‌డంతో చేసేదేమీ లేక ఇక తండ్రిని డ‌బ్బు అడ‌గాల‌నుకునే టైమ్ కు తండ్రి చ‌నిపోతాడు. అప్పుడే సీత‌కు నిజం తెలుస్తుంది. త‌న ఆస్తి మొత్తాన్ని తండ్రి త‌న బావ ర‌ఘురామ్ (బెల్లంకొండ శ్రీనివాస్) పేరిట రాసి చ‌నిపోవ‌డంతో త‌న‌ను పెళ్లి చేసుకుంటే త‌ప్ప డ‌బ్బు త‌న చేతికి రాని త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో రామ్ ను ఇష్టం లేక‌పోయినా పెళ్లి చేసుకుంటుంది. కానీ రామ్ ని మోసం చేసి త‌న డ‌బ్బులు రాబ‌ట్టుకోవాల‌ని చూసిన సీత‌కు ప‌రిస్థితులేమీ క‌లిసి రావు. మ‌రి ఈ ప‌రిస్థితుల‌న్నింటినీ సీత ఎలా ఎదుర్కొంది? సీత‌కు రామ్ ఏ విధంగా హెల్ప్ చేశాడ‌న్న‌ది మిగ‌తా క‌థ‌.

ఇప్పటివ‌ర‌కు మాస్‌ యాక్షన్‌ హీరోగా కనిపించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో కొత్తగా కనిపించే ప్రయత్నం చేశాడు. తనకు ఏ మాత్రం సెట్ అవని అమాయకుడి పాత్రలో పూర్తిగా నిరాశపరిచాడు. సినిమా చూశాక అసలు ఈ సినిమాకు బెల్లంకొండ‌ శ్రీనివాస్‌ ఎలా ఓకె చెప్పాడా అన్న అనుమానం రాక మానదు. హీరోయిన్‌గా సీత పాత్రకు కాజల్‌ అగర్వాల్ పూర్తి న్యాయం చేసింది. తల పొగరు ప్రదర్శించే సన్నివేశాలతో పాటు సెంటిమెంట్‌ సీన్స్‌లోనూ మెప్పించింది. విలన్‌గా సోనూసూద్‌ ఆకట్టుకున్నాడు. బసవ క్యారెక్టర్‌లో తేజ గత చిత్రాల పాత్రల ఛాయలు కనిపించినా.. సోనూ తనదైన మేనరిజమ్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇతర పాత్రల్లో మన్నార చోప్రా, భాగ్యరాజ, తనికెళ్ల భరణి లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సినిమా మొదలైన పది నిమిషాల్లోనే కథ మొత్తం చెప్పేసిన దర్శకుడికి తరువాత కథనాన్ని ముం‍దుకు ఎలా న‌డిపించాల‌న్న దాని మీద అవ‌గాహ‌న పోయింది. తన గత చిత్రాల్లోని క్యారెక్ట‌ర్లు, సీన్లు చాలా రిపీట్ అయిన ఫీలింగ్ వ‌స్తుంది. స్టోరీలో పెద్దగా మలుపులు లేకపోయినా కథనంలో ట్విస్ట్‌లను ఇరికించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌ నుంచి క్లైమాక్స్‌ వరకు ఇక సినిమా అయిపోయిందని ప్రేక్షకుడు అనుకున్న ప్రతీ సారి కొత్త ట్విస్ట్‌తో షాక్‌ ఇచ్చాడు. సినిమాటోగ్ర‌ఫీ చాలా రిచ్ గా బావుంది. చాలా రోజుల తరువాత సంగీత దర్శకత్వం చేసిన అనూప్‌ రుబెన్స్‌ పరవాలేదనిపించాడు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గటుగా ఉన్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
కాజ‌ల్ అగ‌ర్వాల్
సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్ః
బెల్లంకొండ శ్రీనివాస్
క్లైమాక్స్
స్క్రీన్ ప్లే

పంచ్‌లైన్ః సీత కు గీత గీశారు
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here