Shailaja Reddy Alludu Movie Review

0
209

ఆల్రెడీ ల‌వ‌ర్ బాయ్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న నాగ‌చైత‌న్య ఈసారి డైర‌క్ట‌ర్ మారుతి తో క‌లిసి, త‌న‌లోని కామెడీ యాంగిల్ ను, మాస్ యాంగిల్ ను ఆడియ‌న్స్ కు ప‌రిచ‌యం చేసి మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నించిన చిత్రం ‘శైల‌జా రెడ్డి అల్లుడు’. ఎప్పుడూ కామెడీ చిత్రాలే తీసే మారుతి.. ఈ సినిమాతో యాక్ష‌న్ సీన్స్ జోలికి కూడా వెళ్లాడు. సితార ఎంట‌ర్‌టైన్మైంట్ బ్యానర్ పై తెర‌కెక్కిన ఈ సినిమా టీజ‌ర్ ద‌గ్గ‌ర నుంచి మంచి అంచనాలే క్రియేట్ చేసింది. మ‌రి ఆ అంచాల‌ను శైల‌జారెడ్డి అల్లుడు అందుకున్నాడా లేదా చూద్దాం.

క‌థః
పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ ఛైర్మ‌న్ రావు (మురళీ శ‌ర్మ‌) ఒక్క‌గానొక్క కొడుకు చైత‌న్య (నాగ‌చైత‌న్య‌) త‌ను చెప్పిందే జ‌ర‌గాల‌నే తండ్రి ఇగోను సంతృప్తి ప‌రుస్తూ రోజులు వెళ్ల‌బుచ్చుతుంటాడు. చైతూ కు అను (అను ఇమ్మాన్యుయేల్) క‌నిపించ‌డం, మొద‌టి చూపులోనే ఆమెతో ప్రేమ‌లో ప‌డటం జ‌రుగుతాయి. తండ్రి లాంటి గుణ‌మే ఉన్న అమ్మాయి కావ‌డంతో చైతూ తండ్రి కూడా వీరి ప్రేమ‌కు అడ్డు చెప్ప‌కుండా వెంట‌నే ఒప్పేసుకుంటాడు. వేర‌కే వ్య‌క్తితో పంతానికి పోయి రావు స‌డ‌న్ గా చైతూ, అనుకు అంద‌రి ముందు ఎంగేజ్మెంట్ చేసేస్తాడు. ఇదిలా ఉంటే ఆడ‌వాళ్ల‌కు అన్యాయం జ‌రిగితే అవ‌త‌లివాడు ఎంత‌టోడైనా తాట‌తీసే శైల‌జా రెడ్డి (రమ్య‌కృష్ణ‌) కూతురే అను. శైల‌జా రెడ్డికి కూడా విప‌రీత‌మైన ఇగో. మ‌రి ఇంత‌టి ఇగో ఉన్న శైల‌జా రెడ్డి కూతురి నిశ్చితార్థం త‌న‌కు తెలీకుండా చేస్తే ఏం చేసింది? అస‌లు చైతూ ను శైల‌జా రెడ్డి అల్లుడిగా ఎలా అంగీక‌రించింద‌న్న‌దే మిగతా సినిమా.

న‌టీన‌టుల ప్ర‌తిభః
న‌టుడుగా నాగ‌చైత‌న్య చాలా మెరుగైన న‌ట‌న క‌నబ‌రిచాడు. అస‌లు ఇది హీరో క‌థ కాక‌పోయినా స‌రే ఒప్పుకున్నందుకు నాగ‌చైత‌న్య ను ముందుగా అభినందించాలి. త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన అన్ని సినిమాల్లో త‌న లుక్స్, స్టైలింగ్ విష‌యంలో ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు. త‌న కామెడీ టైమింగ్, యాక్ష‌న్ సీన్స్ లో బాడీ లాంగ్వేజ్, డ్యాన్సుల ద్వారా కూడా మెప్పించాడు. అను ఇమ్మాన్యుయేల్ ఫ‌ర్వాలేద‌నిపించిది. లుక్స్ ప‌రంగా అనూ కూడా బావుంది. ఇక సినిమాకు కీల‌కమైన ర‌మ్య‌కృష్ణ‌. సినిమాకు పెద్ద బ‌లం అంటే త‌నే. న‌ట‌న ప‌రంగా బాగానే చేసిన‌ప్ప‌టికీ, త‌ను బాహుబ‌లి ఫీవ‌ర్ నుంచి ఇంకా బ‌య‌ట‌కు రాలేదేమో అనిపిస్తుంది. దానికి తోడు ర‌మ్య‌కృష్ణ కు మేక‌ప్ కూడా స‌రిగా వేసిన‌ట్లు లేరు. యాక్టింగ్ బావున్న‌ప్ప‌టికీ, చూడ‌టానికి మాత్రం బాలేదు. వెన్నెల కిషోర్ హీరో పక్క‌నే ఉంటూ సినిమాలో పెద్దపాత్రే పోషించాడు కానీ, స‌రిగ్గా వెన్నెల కిషోర్ ను వాడుకోలేదు. త‌న స్థాయి కామెడీ సినిమాలో లేదు. పృథ్వీ కొన్ని చోట్ల న‌వ్వించాడు. ముర‌ళీ శ‌ర్మ పాత్ర విసుగు తెప్పిస్తుంది. న‌రేష్ పాత్ర సో సో గా అనిపిస్తుంది. మిగిలిన వారు త‌మ త‌మ పాత్ర‌ల ప‌రిధిలో బాగానే చేశారు.

సాంకేతిక నిపుణులుః
ఏదో ఒక చిన్న డిజార్డ‌ర్ ను అడ్డం పెట్టుకుని దాన్ని వినోదాత్మ‌కంగా తీర్చి దిద్ద‌డంలో దిట్ట అయిన మారుతి, ప్ర‌తీ సినిమాలో హీరోల మీద దృష్టి పెట్టేవాడు. భలే భ‌లే మ‌గాడివోయ్ లో మ‌తిమ‌రుపు, బాబు బంగారంలో జాలి, మ‌హానుభావుడు లో ఓసీడీ అంటూ డిజార్డ‌ర్స్ తో కామెడీ పండించిన మారుతి, ఈసారి హీరోల నుంచి హీరోయిన్ మీద‌కు, హీరోయిన్ త‌ల్లి కు ఇగో ఎక్కువ అనే కాన్సెప్ట్ తో ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి ట్రై చేసినా, అది అనుకున్నంత స్థాయిలో వ‌ర్కవుట్ కాలేదు. ఎంత సేప‌టికీ హీరోయిన్ కు ఇగో ఎక్కువ‌, హీరోయిన్ త‌ల్లికి ఇగో ఎక్కువ అని డైలాగ్స్ అయితే చెప్పిస్తాడు కానీ, వారికి ఇంత ఇగో ఏంట‌బ్బా అనే సీన్ ను ఒక్క‌టి కూడా క్రియేట్ చేయ‌లేక‌పోయాడు. శైల‌జా రెడ్డి గురించి చెప్పేట‌ప్పుడు ఒక రేంజ్ లో బిల్డ‌ప్ ఇచ్చి, ఆకాశానికెత్తేసిన మారుతి.. తర్వాత మెల్లిమెల్లిగా ఆ క్యారెక్ట‌ర్ల‌ను నేల మీద ప‌డేస్తాడు. శైల‌జా రెడ్డి అంటే ఎవ‌రనుకున్నావ్? మీకు క‌మీష‌న‌ర్ తెలుసేమో, ఆమెకు సీఎం చాలా ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తి అని చెప్తాడు. వామ్మో ఆ రేంజ్ అంటే ఇక శైల‌జా రెడ్డి క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుందో అనుకునే లోపే.. భార్య భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లొస్తే పంచాయ‌తీలు పెట్టి, తీర్పులిస్తూ ఉంటుంది శైల‌జా రెడ్డి. హీరోయిన్ కోసం హీరో అబ‌ద్ధం చెప్పి, హీరోయిన్ ఇంట్లో తిష్ట వేయ‌డం ఎప్ప‌టి నుంచో చూస్తూ వ‌స్తున్నాం. ఇప్పుడు మారుతి కూడా అదే ఫాలో అయ్యాడు. హీరోయిన్ ను క‌న్విన్స్ చేయ‌డానికి ఫ‌స్టాఫ్ లో ఒక ఫైట్ ఉంటుంది బానే ఉంది, అత్త ను క‌న్విన్స్ చేయ‌డానికి సెకండాఫ్ లో ఇంకో ఫైట్.. ఏంట్రా బాబు.. హీరో ప‌ని అంద‌రినీ క‌న్విన్స్ చేయ‌డమేనా అనిపించేలా తీర్చిదిద్దాడు మారుతి ఆ క్యారెక్ట‌ర్ ను. మంచి మంచి న‌టులున్న‌ప్ప‌టికీ, మంచి కాన్సెప్ట్ ఉన్న‌ప్ప‌టికీ దాన్ని వాడుకుని ఎంట‌ర్‌టైన్ చేయ‌డంలో మారుతి విఫ‌ల‌మ‌య్యాడు. సెకండాఫ్ లో కాసేపు కామెడీ తో అల‌రించిన‌ప్ప‌టికీ, ఆ ట్రాక్ అయిపోగానే మ‌ళ్లీ సాగ‌దీసిన‌ట్లు అనిపిస్తుంది. ఇక సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు మేజ‌ర్ హైలైట్. ప్ర‌తీ ఫ్రేమ్ లో రిచ్ నెస్ క‌నిపిస్తుంది. గోపీ సుంద‌ర్ సంగీతంలోని పాట‌లు విన‌డానికి, చూడ్డానికి బావున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. నిర్మాణ విలువ‌లు చాలా బావున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
ర‌మ్య కృష్ణ‌, నాగ‌చైత‌న్య‌
కొన్ని కామెడీ సీన్స్

మైన‌స్ పాయింట్స్ః
పాత క‌థ‌
క‌థ‌నం

పంచ్‌లైన్ః శైల‌జా రెడ్డి అల్లుడు అనిపించుకున్నాడు!
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here