‘స‌వ్య‌సాచి’ మూవీ రివ్యూ

0
224

రారండోయ్ వేడుక చూద్దాం త‌ర్వాత మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగ‌చైత‌న్య‌కు శైల‌జా రెడ్డి అల్లుడు రూపంలో హిట్ కొడ‌దామ‌ని ఎంత ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిల‌దొక్కుకోలేకపోయింది. శైల‌జా రెడ్డి అల్లుడు తర్వాత నాగ‌చైత‌న్య త‌న‌కు ప్రేమ‌మ్ లాంటి క్లాసిక్ ను ఇచ్చిన చందూ మొండేటితో మ‌రొక‌సారి ‘స‌వ్య‌సాచి’ కోసం జ‌త‌క‌ట్టాడు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను తెర‌కెక్కించ‌డంతో సినిమా మీద మొద‌టి నుంచి మంచి అంచ‌నాలే ఉన్నాయి. మ‌రి ఈ సినిమా తో అయినా నాగ‌చైత‌న్య తిరిగి విజ‌యం అందుకున్నాడా? ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ మ‌రొక మంచి సినిమాతో విజ‌యాన్ని అందుకుందా అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.

క‌వ‌ల‌లుగా పుట్టాల్సిన ఇద్ద‌రు పిల్ల‌లు ఒకే వ్య‌క్తిగా జ‌న్మించి, ఆ ఎడ‌మ‌చేయి త‌న లోప‌ల ఉన్న రెండో వ్య‌క్తి ఆధీనంలో ఉండ‌టం వ‌ల్ల తను ఎదుర్కొనే స‌మ‌స్య‌లేంటి? త‌న‌కు అది లోపం అవుతుందా లేక ఆ లోప‌మే వ‌ర‌మ‌వుతుందా అన్న‌దాని చుట్టూ క‌థ న‌డుస్తుంది.

నాగ‌చైత‌న్య సినిమా సినిమాకు త‌న‌కు తానే పెట్టుకుంటున్న ప‌రీక్ష‌లో ఫ‌స్ట్ క్లాస్ లో పాస‌వుతున్నాడు. త‌న న‌ట‌న‌లో ఇంత‌కుముందు కంటే మెచ్యూరిటీ క‌నిపిస్తుంది. బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్, యాక్ష‌న్ సీక్వెన్స్ మ‌రోవైపు సెంటిమెంట‌ల్ సీన్స్ లోనూ నాగ‌చైత‌న్య బాగా ఆక‌ట్టుకుంటాడు. నిధి అగ‌ర్వాల్ అందంతో పాటూ, న‌ట‌న కూడా బావుంది. డ్యాన్సులు బాగా చేసింది. భూమిక త‌నదైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. విల‌న్ గా మాధ‌వన్ త‌న ప‌రిధిని దాటి చేసిన‌ప్ప‌టికీ, ఆ పాత్ర‌ను క్రియేట్ చేసిన విధానం గొప్ప‌గా ఏమీ లేదు. హీరో తల్లి పాత్ర చేసిన కౌస‌ల్య న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. వెన్నెల కిషోర్, ష‌క ల‌క శంక‌ర్, స‌త్య న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. మిగిలిన వారిలో విద్యుల్లేఖా రామ‌న్, రావు ర‌మేష్, బ్ర‌హ్మాజీ వారి వారి ప‌రిధుల్లో బాగా చేశారు.

కార్తికేయ‌, ప్రేమ‌మ్ లాంటి సినిమాలు చేసిన చందూ మొండేటి నుంచి సినిమా అన‌గానే ఎవ‌రికైనా అంచ‌నాలు ఉండ‌టం స‌హ‌జం. అయితే సినిమా ఆ రేంజ్ లో లేక‌పోయిన‌ప్ప‌టికీ మ‌రీ తేలి పోయేలా.. అస‌లు త‌ను అనుకున్న పాయింట్ కు, జ‌రుగుతున్న క‌థ‌కు ఎక్క‌డో చాలా సిల్లీ రీజ‌న్స్ తో క‌థ‌కు క‌నెక్ట్ చేసిన‌ట్లుంటుంది. మాధ‌వ‌న్ లాంటి గొప్ప న‌టుడుని విల‌న్ గా పెట్టుకుని, ఆ విల‌న్ క్యారెక్ట‌ర్ ను అంత డ‌ల్ గా ఎలా రాసుకున్నాడో అర్థం కాదు. అక్క‌డ‌క్క‌డా మెప్పించే సన్నివేశాలు, న‌వ్వించే సీన్స్ ఉన్న‌ప్ప‌టికీ, సినిమాలో అవి హైలైట్ అవ్వలేదు. యువ‌రాజ్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు ప్ల‌స్. ప్ర‌తీ ఫ్రేమ్ లోనూ రిచ్‌నెస్ క‌నిపిస్తుంది. కీర‌వాణి సంగీతంలో వ‌చ్చిన పాట‌లు రెండు మూడు మిన‌హా పెద్ద‌గా ఆక‌ట్టుకున్న‌వేమీ లేవు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాలోని ప్ర‌తీ సీన్ ను ఎలివేట్ అయ్యేలా చేసింది. ఎడిటర్ త‌న క‌త్తెర‌కు ఇంకాస్త ప‌దును పెట్టుండాల్సింది.

పంచ్‌లైన్ః స‌వ్య‌సాచి నిల‌బ‌డ‌గ‌ల‌డా..?
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here