సర్వం తాళమయం మూవీ రివ్యూ….

0
3229

కొన్ని సినిమాలు విడుదలకు ముందే ఆకట్టుకుంటాయి. అందులో తారాగణం కావొచ్చు. టెక్నీషియన్స్ వల్ల కావొచ్చు. దర్శకుడే కావొచ్చు. లేదా ట్రైలర్, ఆడియోతో అయినా ఇంప్రెస్ చేయొచ్చు. అయితే ఈ అన్ని అంశాలనూ మిక్స్ చేసి ఆకట్టుకున్న సినిమా సర్వంతాళమయం. చాలా యేళ్ల తర్వాత మోస్ట్ టాలెంటెడ్ టెక్నీషియన్ రాజీవ్ మేనన్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. సంగీత ప్రధానంగా వచ్చిన సినిమా కాబట్టి చాలామంది ‘శంకరాభరణం’ స్థాయి సినిమా అంటూ పొగిడేశారు కూడా. మొత్తంగా లాస్ట్ వీక్ తమిళ్ లో విడుదలైన ఈ మూవీ ఈ రోజు తెలుగులో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

కథ :
పీటర్ జాన్సన్( జివి ప్రకాష్ కుమార్) దళిత యువకుడు. హీరో విజయ్ అంటే అతనికి ప్రాణం. ఎగ్జామ్స్ ఎగ్గొట్టి మరీ అతని సినిమాలు చూస్తుంటాడు. అలాగే కొత్త సినిమా విడుదల టైమ్ లో డ్రమ్స్ కూడా వాయిస్తుంటాడు. అతని తండ్రి మృదంగాలు తయారు చేస్తుంటాడు. పీటర్ డిగ్రీ ఫెయిల్ అవుతాడు. దీంతో తండ్రి తన వద్దే మృదంగం నేర్చుకోమంటాడు. అతని తండ్రి కర్ణాటక శాస్త్రీయ సంగీతం ఔపోసన పట్టిన మృదంగ విద్వాంసుడు.. పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత అయిన పాలకొల్లు రామస్వామి(నెడిముడి వేణు)కి మృదంగాలు అమ్ముతుంటాడు. ఓ సారి తను తయారు చేసిన మృదంగంను ఆయనకివ్వమని పీటర్ ను పంపిస్తాడు తండ్రి. అక్కడికి వెళ్లి ఆయన ప్రదర్శన చూసిన పీటర్ ఒక్కసారిగా మృదంగం పై మనసు పారేసుకుంటాడు. తనూ మృదంగం నేర్చుకోవాలని ఎంతో ప్రయత్నించి రామస్వామి వద్ద శిష్యుడుగా చేరతాడు. కానీ కొన్ని పరిణామాల తర్వాత పీటర్ వల్ల అతని గురువుకు చెడ్డ పేరు వస్తుంది.. మరి ఆ తర్వాత ఏం జరిగింది..? పీటర్ మృదంగంలో సాధించిన విజయాలు ఏంటీ..? అవి నేర్చుకోవడానికి అతను ఏం చేశాడు.. అనేది మిగతా కథ..

విశ్లేషణ :
సర్వంతాళమయం.. నిజమే.. హృదయ స్పందన నుంచి తాళం మొదలవుతుంది. కానీ అది సంగీతంలోకి చేరాక ఆ సంగీత ఒక వర్గానికో లేక కులానికో మాత్రమే సొంతం అనేది శతాబ్ధాలుగా మనదేశంలో కనిపిస్తున్నదే. సరిగ్గా ఇదే పాయింట్ నుంచి కథ మొదలుపెడతాడు దర్శకుడు. మృదంగం తయారు చేసేవాడు దాన్ని ఎందుకు నేర్చుకోడు అనే ప్రశ్న నుంచి మొదలైన కథనం.. ఆద్యంతం హృద్యంగా సాగుతుంది. పీటర్ పాత్రకు మృదంగం నేర్చుకోవాలన్న తపన మొదలైన దగ్గర్నుంచీ ఏ మాత్రం బోర్ కొట్టకుండా బిగి సడలని స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఈ కథలో దర్శకుడు చాలా పాయింట్సే టచ్ చేశాడు. అంటరాని తనం నుంచి.. సంగీతం ఒక కులానికే ఎందుకు పరిమితం అయింది.. సంగీతం వంశపారంపర్యం కాదు.. మారుతున్న కాలానికి అనుగుణంగా కర్ణాటక శాస్త్రీయ సంగీతం ఎలా మార్పులు చెందుతోంది.. ప్రతిభను తొక్కేయడం కులం పాత్ర ఎలా ఉంటుంది.. అంటూ.. ఎన్నో విషయాలు టచ్ చేస్తూ.. ఎవరినీ నొప్పించకుండానే.. కఠిన సత్యాలను ఆవిష్కరించాడు. కులం వికృతరూపాలను కూడా క్షణ్నంగా అధ్యయనం చేసినట్టు కనిపిస్తుంది. అయితే ఇదే సమయంలో అదే అగ్ర కులానికి చెందిన గురువు పాత్రను మాత్రం అద్భుతంగా, హుందాగా, పెద్దరికంతో మలిచిన విధానమూ ఆకట్టుకుంటుంది. ఆ పాత్రలో నెడిముడి వేణు అత్యంత సహజంగా ఒదిగిపోయాడు. ఇవాళ సంగీతం టివి వేదికలనెక్కి ప్రతిభకు ఎంత పాతర వేస్తున్నారు. స్వచ్ఛమైన సంగీతం ఎంత భ్రష్టుపట్టిపోతుంది…. ‘‘తమవాడే’’ అంటూ కొందరు రియాలిటీ షోస్ గెస్ట్ లు ఎంత కౄరంగా ప్రవర్తిస్తారు అనేదానిపై అర్థవంతమైన సెటైర్ వేశాడు దర్శకుడు. ఇవన్నీ ఆయన గాలివాటంగా చెప్పలేదు. ప్రతిదానికి అధ్యయనం ఉన్నట్టే కనిపిస్తుంది. ముఖ్యంగా పీటర్ తన తండ్రితో కలిసి సొంత ఊరికి వెళ్లినప్పుడు వారికి ప్లాస్టిక్ గ్లాస్ లో టీ పోసి ఇవ్వడం నేటికీ కొనసాగుతోన్న కులవికృత రూపం. అలాగే పీటర్ వాళ్ల ఊరిలో అన్నంలో వేసిన కూరతో సహా ఏదీ దాచలేదు దర్శకుడు.

ఇక టివి యాంకర్ తన అన్న కోసం వేసిన స్కెచ్ లో మరో పిరికివాడైన మితృడి వల్ల కేస్ లో ఇరుక్కున్న పీటర్ చివరికి గురువుతోనూ అసహ్యించుకోబడతాడు.. తండ్రీ తిడతాడు. ఆ టైమ్ లో తను మొదట్లో విజయ్ ఫ్యాన్స్ గా వేరేవారితో గొడవపడితే తలపగిలినప్పుడు తనకు కట్టు కట్టిన నర్స్ తో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ అతన్ని మళ్లీ కార్యోన్ముముఖున్ని చేస్తుంది. ఇందుకోసం దర్శకుడు చొప్పించిన ఇంటిమేట్ సీన్ సైతం ఏ మాత్రం ఇబ్బంది పెట్టదు. అలాగే అతనికి సంగీతం నేర్పడానికి ప్రకృతే ఎదురు చూస్తోందంటూ దర్శకుడు క్రియేట్ చేసిన వాన కూడా భలే అనిపిస్తుంది. మొత్తంగా దేశమంతా తిరిగిన పీటర్.. ప్రతి చోటా సంప్రదాయ సంగీతమే నేర్చుకుంటాడు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆయా తెగలు వాడే ‘‘తోలువాయిద్యాలకే’’ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం దర్శకుడు వేసిన బిగ్గెస్ట్ సెటైర్.. మొత్తంగా సినిమా చూస్తున్నంత సేపూ ఖచ్చితంగా మరేదీ గుర్తుకు రాదు. కేవలం పది నిమిషాల్లోనే కథలోకి వెళ్లిన దర్శకుడు ప్రతి సీన్ నూ నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళుతూ ఎక్కడా గ్రాఫ్ పడిపోకుండా చూస్తాడు.

మాటల్లోనూ అద్భుతాలే ఉన్నాయి. ఘంటసాల రత్నకుమార చాలాకాలం తర్వాత చేసిన అనువాదం ఆకట్టుకుంటుంది. గురువుతో ఫోన్ లో మాట్లాడుతూ పీటర్ ఓ మాట అంటాడు.. ‘‘నాకు సంగీతమే రాదు అన్నారుగా’’ అని.. అప్పుడు గురువు అంటాడు.. ‘అది నా నమ్మకం.. మరి నీ నమ్మకం ఏంటీ’’ అని ప్రశ్నిస్తాడు. రెండు మాటలే కావొచ్చు. కానీ ప్రతి మనిషి హృదయాన్నీ మేల్కొలిపే మాటిది. ఎక్కడా డబ్బింగ్ సినిమా చూస్తున్నామన్న అనుభూతి రాదంటేనే తెలుస్తుంది దర్శకుడి ప్రతిభ ఏంటనేది..ఆర్టిస్టుల పరంగా హీరోగా నటించిన జీవి ప్రకాష్ కుమార్ గొప్ప నటుడు కాకపోవచ్చు. కానీ ఈ పాత్రలో ఒదిగిపోయాడు. ఆ తర్వాత ప్రధాన పాత్ర నెడిముడి వేణుదే. మృదంగా విద్వాంసుడు రామస్వామిగా ఆయన నటన సినిమాకే హైలెట్ అయితే. కొన్ని పాత్రలు ఎలా అభినయించాలనే విషయంలో అదో పాఠ్యాంశం అవుతుంది. హీరోయిన్ అపర్ణ బాలమురళి టాలెంటెడ్ యాక్ట్రెస్. కానీ ఇందులో తన పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. తర్వాత ప్రకాష్ కుమార్ తండ్రి పాత్రలో నటించిన కుమార్ వేల్ నటన సహజంగా ఉంది. మనకు లవర్ బాయ్ గా బాగా తెలిసిన వినీత్ నెగెటివ్ రోల్ ఆశ్చర్యపరుస్తుంది..బాగా చేశాడు కూడా.

ఇక ఈ సినిమాకు ప్రధాన బలం టెక్నికల్ సపోర్ట్. సినిమాటోగ్రఫీ బ్రలియంట్ గా ఉంది. ఇక ఏఆర్ రహమాన్ పూర్తిగా ప్రాణం పెట్టి సంగీతం అందించినట్టుగా ఉంది. పాటలే కాదు.. నేపథ్య సంగీతం సైతం కదిలిస్తుంది.. అలాగే పాటలకు కుదిరిన సాహిత్యం కూడా సూపర్బ్. ఎప్పుడెప్పుడో మాకై కాలం ఎప్పుడొచ్చునో అనే పాట సినారే స్థాయిలో వినిపిస్తుంది.. రాసింది రాకేందు మౌళి. దళితుల ఆత్మఘోషకు అద్దం పట్టే పాట ఇది. ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్. దర్శకుడు గురించి ఎంత చెప్పుకున్నా అంతే తక్కువగా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్బ్.
మరి ఇన్ని ప్లస్ లు చెప్పిన ఈ సినిమాలో మైనస్ లే లేవా అంటే ఉన్నాయి. కానీ అవేవీ కథనాన్ని ఇబ్బంది పెట్టవు. చూస్తోన్న వారి అనుభూతిని చెడగొట్టవు. కాకపోతే బిసి సెంటర్స్ లో ఈ సినిమా ఏ మేరకు ఎక్కుతుంది అనేది ఓ డౌట్ అయితే.. క్లాస్ ఆడియన్స్ కూడా కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారా అనేదీ ప్రశ్నే. బట్.. సంగీతానికి కదలని హృదయం ఉండదు. ఆ హృదయం ప్రతి ఒక్కరి మదినీ తడుతుందీ సినిమా..

ఫైనల్ గా : సర్వం తాళమయం.. ఏ మస్ట్ వాచ్ మూవీ

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ : 3.75/5

రివ్యూ : సర్వం తాళమయం
తారాగణం : జివి. ప్రకాష్ కుమార్, అపర్ణ బాలమురళి, నెడిముడి వేణు, వినీత్, ఇళంగో కుమారవేల్
ఎడిటింగ్ : ఆంటోనీ
సినిమాటోగ్రఫీ : రవి యాదవ్
మ్యూజిక్ : ఏఆర్ రహమాన్
నిర్మాత : లతా మేనన్
దర్శకత్వం : రాజీవ్ మేనన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here