‘స‌ర్కార్’ మూవీ రివ్యూ

0
185

కోలీవుడ్ లో టాప్ రేంజ్ లో దూసుకుపోతున్న విజ‌య్ టాలీవుడ్ లో మాత్రం అనుకున్న రేంజ్ లో ఆక‌ట్టుకోలేక‌పోతున్నాడు. తుపాకి, అదిరింది సినిమాల‌తో ఫ‌ర్వాలేద‌నిపించినా.. అవి విజ‌య్ స్థాయి స‌క్సెస్ ను మాత్రం సాధించ‌లేక‌పోయాయి. ఇప్పుడు మ‌రోసారి మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ‘స‌ర్కార్’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు విజ‌య్. గ‌తంలో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన తుపాకి, క‌త్తి సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ్ల‌స్ట‌ర్లు గా నిల‌వ‌డంతో ఈ సినిమా మీద కూడా మంచి అంచ‌నాలేర్ప‌డ్డాయి. మ‌రి ఆ అంచ‌నాల‌ను స‌ర్కార్ అందుకుందా? ఈ సినిమాతో అయినా విజ‌య్ తెలుగు మార్కెట్ లో త‌న ముద్ర వేసుకున్నాడా? స‌్పైడ‌ర్ సినిమాతో టాలీవుడ్ కు షాక్ ఇచ్చిన మురుగ‌దాస్ ఈ సినిమా తో అయినా బౌన్స్ బ్యాక్ అయ్యాడా అన్న‌ది స‌మీక్ష లో చూద్దాం.

సంవ‌త్స‌రానికి 1800 కోట్లు సంపాదించే సుంద‌ర్ రామ‌స్వామి(విజయ్) ఏ దేశంలో అడుగుపెట్టినా అక్క‌డి కంపెనీల‌ను దెబ్బ‌తీసి.. వాటిని మూసేయించే కార్పోరేట్ క్రిమిన‌ల్. అలాంటి సుంద‌ర్ ఇండియాకు వ‌స్తున్నాడ‌ని తెలుసుకున్న కార్పోరేట్ కంపెనీల‌న్నీ ఉలిక్కిప‌డ‌తాయి. కానీ సుంద‌ర్ ఇండియా వ‌చ్చింది కేవ‌లం త‌న ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డానికే అని తెలుసుకుని అంద‌రూ కాస్త ఊపిరి పీల్చుకుంటారు. ఓటు వేయ‌డానికి వెళ్లిన సుంద‌ర్ కు త‌న ఓటును ఎవ‌రితోనో దొంగ ఓటు వేయించార‌ని తెలుసుకుని కోర్టుకు వెళ్తాడు. త‌న‌లాగే దాదాపు 3 ల‌క్ష‌ల మందికి పైగా జ‌నం కూడా ఇలా కేసులు వేస్తారు. దీంతో ఎల‌క్ష‌న్ ర‌ద్ద‌యి, తిరిగి 15 రోజుల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కోర్టు తీర్పునిస్తుంది. త‌రువాత అధికార పార్టీ నేత‌ల‌తో గొడ‌వ‌ల కార‌ణంగా సుంద‌ర్ స్వ‌యంగా ఎల‌క్ష‌న్ ల‌లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. కార్పోరేట్ క్రిమినల్ గా పేరు తెచ్చుకున్న సుంద‌ర్ ఇక్కడి కరుడు గ‌ట్టిన రాజ‌కీయ నాయ‌కుల‌తో ఎలా పోరాడాడు? ఈ నేప‌థ్యంలో సుంద‌ర్ కు ఎదురైన స‌మ‌స్య‌లేంటన్న‌దే మిగ‌తా క‌థ‌

విజ‌య్ మ‌రోసారి సూప‌ర్బ్ యాక్టింగ్ తో ఆక‌ట్టుకున్నాడు. గ‌తంలో ఎన్న‌డూ క‌నిపించ‌నంత స్టైలిష్ లుక్ లో క‌నిపించిన విజ‌య్, త‌న ఫ్యాన్స్ త‌న నుంచి ఏదైతే ఆశిస్తారో.. తెర‌పై అలానే క‌నిపించాడు. ముఖ్యంగా యాక్ష‌న్ సీన్స్ లో విజ‌య్ న‌ట‌న అదుర్స్. మ‌హాన‌టిగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ కు ఈ సినిమాలో ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర‌లో క‌నిపించింది. ఫ‌స్టాఫ్ లో ఒక‌టి రెండు సీన్స్ లో త‌ప్ప కీర్తి ఎక్క‌డా పెద్ద‌గా క‌నిపించ‌దు. వ‌ర‌ల‌క్ష్మిశ‌రత్ కుమార్ పాత్ర కూడా చిన్న‌దే. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ల‌లో త‌న న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. రాధార‌వి రాజకీయ నాయ‌కుడి పాత్ర‌లో మ‌రోసారి త‌న అనుభ‌వాన్ని క‌న‌బ‌రిచాడు. ఇత‌ర పాత్ర‌ల్లో క‌నిపించిన వారంతా తమిళ వారు కావ‌డంతో తెలుగు ఆడియ‌న్స్ క‌నెక్ట్ కావ‌డం కాస్త క‌ష్ట‌మే.

ఆల్రెడీ క‌త్తి, తుపాకి లాంటి బ్లాక్ బ్ల‌స్ట‌ర్స్ సినిమాల త‌ర్వాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో స‌ర్కార్ పై మంచి అంచ‌నాలేర్ప‌డ్డాయి కానీ ఈ సారి మురుగ‌దాస్- విజ‌య్ లు ఆ స్థాయి లో ఆక‌ట్టుకోలేక‌పోయారు. విజయ్ ఎంత బాగా చేసిన‌ప్ప‌టికీ, మురుగుదాస్ గ‌త చిత్రాల్లో ఉన్నక‌థా వేగం ఈ సినిమాలో లోపించిన‌ట్ల‌నిపిస్తుంది. మంచి స్టోరీ లైన్ ను అయితే సెలెక్ట్ చేసుకున్నాడు కానీ దాన్ని ప్రెజెంట్ చేయ‌డంలో డ‌ల్ అయ్యాడు మురుగ‌దాస్. ఫస్టాఫ్ ను ఇంట్రెస్టింగ్ గా నడిపించిన మురుగ‌దాస్, సెకండాఫ్ ను ఆ స్థాయిలో చూపించ‌లేక‌పోయాడు. అస‌లేమాత్రం థ్రిల్ లేకుండా, లాజిక్స్ లేకుండా సిల్లీగా సినిమాను తెర‌కెక్కించినట్ల‌నిపిస్తుంది. ఆర్ట్ వ‌ర్క్, సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు రిచ్ లుక్ ను తీసుకొచ్చాయి. రెహ‌మాన్ సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేక‌పోగా.. పాట‌లు సంద‌ర్భానికి అడ్డుగా స్పీడ్ బ్రేక‌ర్లుగా మారాయి. రీరికార్డింగ్ మాత్రం బావుంది. ఎడిటింగ్ విష‌యంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. చాలా సీన్స్ స్లో గా సాగుతూ ప్రేక్ష‌కుడి స‌హ‌నానికి పరీక్ష పెట్టాయి. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

పంచ్‌లైన్ః స‌త్తా లేని స‌ర్కార్ 
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here