‘స‌మ్మోహ‌నం’ మూవీ రివ్యూ

0
155

‘అష్టా చెమ్మా’, ‘జెంటిల్ మెన్’, ‘అంతకు ముందు ఆ తరువాత’, అమీ.. తుమీ’ లాంటి భిన్నమైన కథలతో ప్రేక్షకుల్లో తనదైన ముద్రను వేసుకున్న ఇంద్రగంటి మరోసారి ‘సమ్మోహనం’ అనే చిత్రంతో సినిమా, సాహిత్యంపై ఆయనకు ఉన్న ప్యాష‌న్ ను తెలియజెప్పే ప్రయత్నం చేశారు. మెగా స్టార్ చిరంజీవి సినిమా టీజ‌ర్ ను లాంఛ్ చేయ‌డం, సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వ‌చ్చి సినిమాను ప్ర‌మోట్ చేయ‌డంతో సినిమా మీద మంచి అంచ‌నాలే ఏర్ప‌డ్డాయి. ఒక మామూలు కుర్రాడికి, స్టార్ హీరోయిన్ కు మ‌ధ్య జ‌రిగే ప్రేమ కథే ఈ సినిమా అని అర్థ‌మ‌వుతుంది. మ‌రి ఆ ప్రేమ‌క‌థ‌ను ఎంత అందంగా.. అద్భుతంగా తీసి ప్రేక్ష‌కుల‌ను ‘స‌మ్మోహ‌నం’ చేశాడ‌నేది రివ్యూలో చూద్దాం.

సినిమాలో కాదంబ‌రి కిరణ్  ఎవ్వ‌రిని క‌లిసినా, ప్ర‌తీసారీ ‘గ్లాడ్ టూ మీట్ యూ..’ అంటూ ఉంటాడు. అలాగే ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ను ఎన్నిసార్లు క‌లిసినా, ఎప్పుడూ గుర్తొచ్చినా ఈ సినిమా త‌ర్వాత‌ ‘గ్లాడ్ టూ హావ్ హిమ్ ఇన్ టాలీవుడ్’ అనుకుంటూనే ఉంటాం. ఒక డైర‌క్ట‌ర్ కు త‌న క‌థ మీద ఎంత న‌మ్మ‌కం లేక‌పోతే, చిన్న చిన్న సీన్స్ ను కూడా మెయిన్ సీన్స్ గా మార్చుకుంటాడ‌నేది ఇక్క‌డ మ‌నం అర్థం చేసుకోవాలి. ద‌ర్శ‌కుడు అనే వాడు సినిమాను ప్రేమించి చేస్తే ఎంత మంచి ఫ‌లితం ఉంటుందో తెలియంది కాదు. అలాంటిది సినిమాకు ప‌నిచేసిన ప్ర‌తీ ఒక్క‌రూ సినిమాను అమితంగా ప్రేమించి ప‌నిచేస్తే.. సినిమా ఫ‌లితం ‘సమ్మోహ‌నం’ లానే ఉంటుంది. స‌మ్మోహ‌నం సినిమాకు టీమ్ ను ఫైన‌ల్ చేసిన‌ప్పుడే సినిమా స‌గం విజ‌యం సాధించింద‌ని చెప్పాలి. ”ఓ అందమైన ప్రపంచం.. ఆ అందమైన ప్రపంచంలో హీరోయిన్‌గా రాణించాలంటే ఎక్కడో ఒకచోట కాంప్రమైజ్ కావడం తప్పనిసరి..” అని భావించే ప్ర‌తీ ఒక్క‌రికీ స‌మాధానంగా ఒక‌ సీన్ ను క్రియేట్ చేసి.. ప్ర‌స్తుతం సినీ పరిశ్ర‌మ మీద ఉన్న చెడు అభిప్రాయాన్ని సెటైరిక‌ల్ గా ఎంత బాగా హ్యాండిల్ చేశాడంటే, ”సినీ ఇండ‌స్ట్రీ అంతా చెత్తే” అని హీరో అంటే.. ”బ‌య‌ట మిగిలిందంతా బాగానే ఉందా..? ఇక్క‌డొక్క‌టే ఇలా ఉందా..?” అని హీరోయిన్ తో చెప్పించ‌డం అనేది ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌కు అద్దం ప‌డుతుంది. ఇక హీరో హీరోయిన్ల మ‌ధ్య వ‌చ్చే టెర్ర‌స్ సీన్ అయితే అప్ప‌టి వ‌ర‌కు ఉన్న‌ సినిమాను త‌ర్వాతి స్థాయికి తీసుకెళ్తుంది. ”అందం అంతా గ్రాడ్యుయ‌ల్ గా పోతుంది. చ‌ర్మం ముడ‌త‌లు ప‌డి, ప‌ళ్లు ఊడిపోయి.. కాళ్లు ఒంగిపోయి.. జుట్టు రాలిపోయి. ఈ ముఖం వెన‌కాల వేరే ఒక‌ళ్లుంటారు. అది నిజ‌మైన ఒరా. నాకు ఆ నిజ‌మైన మ‌నిషి కావాల‌ని హీరో కోరుకుంటే దానికి చిన్న చిరున‌వ్వుతో హీరోయిన్ థ్యాంక్యూ ఫ‌ర్ ద కాంప్లిమెంట్ ” అని ఆన్స‌ర్ ఇవ్వ‌డం లాంటి సీన్ చూస్తేనే అర్థ‌మవుతుంది ద‌ర్శ‌కుడు క‌థ‌ను ఎంత సున్నితంగా డీల్ చేశాడ‌న్న‌ది. అయితే మ‌ధ్య మ‌ధ్య‌లో సినిమా కాస్త నెమ్మ‌దించిన‌ప్ప‌టికీ, త‌న‌కు అల‌వాటైన రీతిలో కామెడీ సీన్స్ రాసుకుని బోర్ రాకుండా చూశాడు. సినిమా స్లో గా ఉండి బోర్ కొడితే ద‌ర్శ‌కుడు ఫెయిల్ అయిన‌ట్లే. కానీ ఈ విష‌యంలో కూడా ఇంద్ర‌గంటి స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పాలి. ఇక సినిమాలో అంద‌రికీ గొప్ప‌గా అనిపించే స‌న్నివేశం త‌ల్లీ కొడుకుల మ‌ధ్య వ‌చ్చే సీన్. ‘జీవితంలో నిన్ను ఒక‌రు రిజెక్ట్ చేశార‌ని ఎప్పుడూ బాధ ప‌డ‌కు’ అంటూ త‌ల్లి, కొడుకు కు ధైర్యం చెప్పే సీన్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. డైలాగుల ప‌రంగా కూడా ఇంద్ర‌గంటి త‌న మార్క్ చూపించాడు. ఏదో సినిమా కోసం రాసుకున్న‌ట్లు కాకుండా మ‌న జీవితంలో నుంచి తీసుకొచ్చి సినిమాలో పెట్టిన‌ట్లు అనిపిస్తుంది. అయితే ద‌ర్శ‌కుడు ఎంత చెప్పినా, న‌టీన‌టులు ఎవ‌రికి వారు బాగా చేసినా కూడా హీరో హీరోయిన్ల మ‌ధ్య ఆ కెమిస్ట్రీ అనేది వ‌ర్క‌వుట్ అవ‌క‌పోతే వృథాయే. స‌మ్మోహ‌నం సినిమాకు హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ కూడా బాగా ప్ల‌స్ అయింది. అది ఎంత‌లా అంటే వారిద్ద‌రూ విడిపోయిన‌ప్పుడు ఫ్రేమ్ లో హీరోనో, హీరోయిన్ మాత్ర‌మేనో క‌నిపిస్తారు. వారిద్ద‌రి జంటను మళ్లీ ఇంకోసారి చూడ‌టానికైనా వాళ్లు త్వ‌ర‌గా క‌లిస్తే బావుండ‌నిపిస్తుంది. ఇక చివ‌ర‌గా క్లైమాక్స్ అయితే ఒక కొత్త అనుభూతిని క‌లిగిస్తుంది. విడిపోయిన ఇద్ద‌రూ అనుకోని సంఘ‌ట‌న‌లో క‌ల‌వ‌డం, అక్క‌డ హీరోయిన్.. హీరో రాసిన బుక్ గురించి చెప్తూ త‌న ప్రేమ‌ను బ‌య‌ట పెట్ట‌డం, త‌ర్వాత హీరో.. హీరోయిన్ కు ఫోన్ చేసి మ‌ళ్లీ మా టెర్ర‌స్ మీదకు ఎప్పుడొస్తావ్ అంటూ అడ‌గడం… అస‌లు చూస్తున్నంత సేపూ ఒక అద్భుతంలానే అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు రావాలే కానీ ప్రేక్ష‌కులంతా ఒక్క‌సారి ‘ఇలా..’ చూస్తారు.

న‌టీన‌టుల ప్ర‌తిభః
సినిమా, సినిమాకు త‌నను తాను ఇంప్రూవ్ చేసుకుంటున్న సుధీర్ ఈ సినిమాతో త‌న కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ గా నిలిచిపోయే క్యారెక్ట‌ర్ లో న‌టించాడు. ఎమోష‌న్ సీన్స్ లో చాలా మంచి న‌ట‌న క‌న‌బరిచాడు. లుక్స్ ప‌రంగా కూడా చాలా ఫ్రెష్ గా క‌నిపించిన సుధీర్, విజ‌య్ పాత్ర ద్వారా ఏ అంశంతో అయితే ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకోవ‌చ్చో, ప్ర‌తీ ఒక్క అవ‌కాశాన్ని తీసుకుని దాన్ని స‌ద్వినియోగం చేసుకుని త‌న కెరీర్ లోనే గుర్తిండిపోయే పాత్ర చేశాడు. ఒక సినిమా లో హీరోయిన్ గా చేసే స‌మీరా గా అదితిరావు హైదారీ త‌న న‌ట‌న‌తో అంద‌రినీ మైమ‌రింప‌చేసింది. కొన్ని స‌న్నివేశాల్లో అయితే కేవ‌లం త‌న క‌ళ్లతోనే ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చి ‘వాహ్వా’ అనిపించింది. ఆల్రెడీ బాలీవుడ్ లో, త‌మిళంలో త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల మ‌న‌సు కొల్ల‌గొట్టిన అదితి టాలీవుడ్ లో చేసిన మొద‌టి సినిమా తోనే తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో నిలిచిపోతుందని చెప్పొచ్చు. ఇక హీరో తండ్రిగా సీనియ‌ర్ యాక్ట‌ర్ న‌రేష్ త‌న న‌ట విశ్వ‌రూపం చూపించాడు. సినిమాలో న‌టించాల‌ని బ‌ల‌మైన కోరిక ఉన్న స‌ర్వేష్ పాత్ర‌లో ప్ర‌తీ సీన్ లోనూ ఎంతో బాగా క‌నిపించి, త‌న‌కు వ‌చ్చిన తొలి సినీ అవ‌కాశం సంద‌ర్భంగా వ‌చ్చే సీన్ లో క‌డుపుబ్బా న‌వ్విస్తాడు. ఇక సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ లో డ్రామా సీన్ అయితే పీక్స్ అంతే. సుధీర్ కు తల్లిగా ప‌విత్రా లోకేష్ ఎంతో హుందాగా క‌నిపించింది. మిగిలిన వారిలో రాహుల్ రామ‌కృష్ణ‌, అభ‌య్ వారి శైలిలో హాస్యాన్ని పండించారు. త‌నికెళ్ల భ‌ర‌ణి, నందూ, హ‌ర్షిణి, హ‌రితేజ‌ ఇలా త‌మ త‌మ ప‌రిధి మేర బాగా చేశారు.

సాంకేతిక వ‌ర్గంః
క‌థ ప‌రంగా ఉన్న‌తంగా ఉన్న స‌మ్మోహ‌నం.. సాంకేతికంగానూ రిచ్ గానే ఉంది. పి.జి విందా సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగుంది. కులు మ‌నాలి సీన్స్, టెర్ర‌స్ సీన్స్ లో కెమెరా ప‌నిత‌నం అయితే మ‌రీ బావుంటుంది. వివేక్ సాగ‌ర్ సంగీతం సినిమాకు ఆత్మ లాంటిదని చెప్పాలి. సంద‌ర్భానుసారంగా క‌థ‌లో భాగంగా వ‌చ్చే పాట‌లు, మ‌న‌సును హ‌త్తుకునే విధంగా ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స‌గ‌టు ప్రేక్ష‌కుణ్ని క‌థ‌తో పాటూ ట్రావెల్ అయ్యేలా చేస్తాయి. ఎడిటింగ్ బావుంది. శ్రీదేవి మూవీస్ సంస్థ మంచి నిర్మాణ విలువ‌లు పాటించింది.

ప్ల‌స్ పాయింట్స్ః
ముఖ్య న‌టుల న‌టన
సంగీతం
సినిమాటోగ్ర‌ఫీ
కామెడీ

మైన‌స్ పాయింట్స్ః
సెకండాఫ్
కాస్త స్లో గా సాగడం

పంచ్‌లైన్ః ప్రేక్ష‌కుల‌ను స‌మ్మోహితుల‌ను చేసిన అదితి
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here