Touch Chesi Chudu Review


'రాజా ది గ్రేట్' సినిమాతో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చిన ర‌వితేజ ఇప్పుడు 'ట‌చ్ చేసి చూడు' అంటున్నాడు. విక్ర‌మ్ సిరికొండ అనే కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలో సీర‌త్ క‌పూర్, రాశీ ఖ‌న్నా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఫామ్ లోకి వ‌చ్చిన ర‌వితేజ, ఈ సినిమాతో కూడా త‌న ఫామ్ ను అలాగే నిల‌బెట్టుకున్నాడా లేదా అన్న‌ది మ‌న సమీక్ష‌లో చూద్దాం.


క‌థః 

వృత్తి  ప‌రంగా పోలీస్ అయిన కార్తికేయ‌(ర‌వితేజ‌)కు డ్యూటీ అంటే చాలు.. ఇల్లు, కుటుంబం, బాధ్య‌త‌లు, ఆఖ‌రికి నిశ్చితార్థం రోజు కూడా మ‌ర్చిపోయి డ్యూటీకి వెళ్లే మ‌న‌స్తత్వం ఉన్న‌వాడు. 10మంది అమాయ‌కులు బాధ‌ప‌డినా ఫ‌ర్వాలేదు కానీ ఒక్క క్రిమినల్ కూడా త‌ప్పించుకోకూడదు అనేది కార్తికేయ సిద్ధాంతం. దీనివ‌ల్ల త‌ను ఏం కోల్పోయాడు?  చివ‌ర‌కు అయినా త‌ను మార‌తాడా అదే మ‌న‌స్త‌త్వంతో ఉంటాడా అన్న దానిచుట్టూ క‌థ నడుస్తూ ఉంటుంది.


న‌టీన‌టుల ప్ర‌తిభః 

ఎప్ప‌టిలాగానే త‌నకు కొట్టిన పిండైన ఎనర్జీని ర‌వితేజ బాగా చూపించి ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ ర‌వితేజ లుక్స్, న‌ట‌న మాత్రం రాజా ది గ్రేట్ లుక్ ను పోలి ఉన్న‌ట్లే అనిపిస్తుంది. రాశీ ఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ ఇద్ద‌రూ ఏదో హీరోయిన్స్ ఉండాలి, క‌థ సాగిపోవాలి అని ఉన్నారే త‌ప్పించి వారి వ‌ల్ల సినిమాకు ఒరిగింది కానీ, సినిమా వ‌ల్ల వారికి ఒరిగింది కానీ లేదు. ఉన్నంత‌లో రాశీఖ‌న్నా కాస్త ఫ‌ర్వాలేద‌నిపించింది. తండ్రి పాత్ర‌లో జ‌య‌ప్ర‌కాష్‌, పోలీస్ ఆఫీస‌ర్ గా ముర‌ళీ శ‌ర్మ, వెన్నెల కిషోర్, స‌త్యం రాజేష్ ల పాత్ర‌లు కొత్త‌గా ఏం అనిపించ‌లేదు. స్ట్రాంగ్ సీన్స్ లేక‌పోవ‌డంతో విల‌నిజం లోపించి విల‌న్ కూడా స‌రిగా ఎలివేట్ కాలేదు.  మిగిలిన పాత్ర‌ధారులు త‌మ త‌మ పాత్ర‌ల్లో వారి ప‌రిధి మేర న‌టించారు. 


సాంకేతిక నిపుణులుః 

 ర‌వితేజ ఎప్ప‌టికీ మాస్ హీరోనే అలాంటి హీరోతో నాలుగు యాక్ష‌న్ సీన్స్ పెట్టి ఏ క‌థ‌తో సినిమా తీసినా హిట్ కొట్టేయొచ్చు అనుకున్నట్లున్నాడు కొత్త ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ సిరికొండ‌. వ‌క్కంతం వంశీ లాంటి స్టార్ రైట‌ర్ రాసిన క‌థేనా ఇది అని డౌట్ వ‌చ్చేలా స్టోరీ ఉందంటే ఇక సినిమా ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. క‌థ మొత్తం ఎక్క‌డా కొత్త‌ద‌నం లేకుండా సాగిపోతూ ఉంటుంది. ఎమోష‌న‌ల్ సీన్స్ పెట్టే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ వాటి జోలికి వెళ్ల‌కుండా కేవ‌లం యాక్ష‌న్ సీన్స్ మీద‌నే దృష్టి పెట్టాడు. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు అస‌లు క‌థ‌లోకి వెళ్ల‌ని ద‌ర్శ‌కుడు, కేవ‌లం ఫ‌స్టాఫ్ అంతా రవితేజ‌- రాశీ ఖ‌న్నాల మ‌ధ్య ల‌వ్ ట్రాక్ ను న‌డిపించే ప్ర‌య‌త్నంలో కూడా విఫ‌ల‌మ‌య్యాడు. ఇక సెకండాఫ్ అయినా ఏమైనా ఉంటుందేమో అని ఆశిస్తే మ‌ళ్లీ చుక్కెదురే. విల‌న్ క్యారెక్ట‌ర్ ను చాలా డ‌ల్ గా తీర్చిదిద్దిన డైర‌క్ట‌ర్, సినిమాలో ఏదైనా హీరో వేసిన ప్లాన్ కు ఎదురుండ‌కూడద‌నుకుని మ‌రీ ప్లాన్ చేసిన‌ట్లున్నాడు. జామ్8 గ్రూప్ వారు అందించిన మ్యూజిక్ పెద్ద‌గా చెప్పుకునే రేంజ్ లో లేదు. కానీ మ‌ణి శ‌ర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. ఛోటా కె నాయుడు సినిమాటోగ్ర‌ఫీ ఎప్ప‌టిలాగే ఉంది. ఎడిటింగ్ విష‌యంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. 


ప్ల‌స్ పాయింట్స్ః 

ర‌వితేజ ఎనర్జీ

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్


మైన‌స్ పాయింట్స్ః 

పాట‌లు

హీరోయిన్స్ క్యారెక్ట‌రైజేష‌న్స్

అన‌వ‌స‌ర స‌న్నివేశాలు


పంచ్‌లైన్ః ట‌చ్ చేయొద్దు..

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2.25/5





Follow Us