Tholi Prema Review


కెరీర్ మొద‌టి నుంచి సెల‌క్టివ్ స‌బ్జెక్ట్స్ ను ఎంచుకుంటూ, సినిమా సినిమాకు న‌టుడిగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న వ‌రుణ్ తేజ్ రీసెంట్ గా ఫిదా సినిమాతో మాంచి హిట్ అందుకుని, ఇప్పుడు వెంకీ అట్లూరి అనే కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేస్తూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. బాబాయ్ సినిమా టైటిల్ 'తొలిప్రేమ' ను సెలెక్ట్ చేసుకుని మరీ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. మ‌రి బాబాయ్ తొలి ప్రేమ కు ఉన్న పేరును వ‌రుణ్ తొలిప్రేమ కూడా సాధిస్తుందా..?  కొత్త ద‌ర్శ‌కుడు వెంకీ ప్ర‌య‌త్నం ఎంతవ‌ర‌కు ఫ‌లించింది అన్న‌ది స‌మీక్ష‌లోక వెళ్లి తెలుసుకుందాం. 


క‌థః 

తొలిప్రేమ‌. టైటిల్ లోనే క‌థ మొత్తం అర్థ‌మ‌వుతుంది క‌దా. దానికి తోడు వెంకీ అట్లూరి టీజ‌ర్, ట్రైల‌ర్ ల‌లో కూడా క‌థ‌ను అర్థ‌మ‌య్యేట్టు చెప్పారు. హీరో హీరోయిన్ ను చూసి తొలిచూపులోనే ప్రేమ‌లో ప‌డ‌టం, కొన్ని కార‌ణాల వ‌ల్ల వాళ్లిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డం, జీవితంలోకి ఎంత‌మంది వ‌చ్చినా మొద‌ట ప్రేమించిన వారి స్థానం ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేరు అని, తొలిప్రేమ ఎప్ప‌టికీ శాశ్వ‌తం అని చెప్ప‌డ‌మే క‌థ‌.


న‌టీన‌టుల ప్ర‌తిభః 

మెగా హీరోగా కెరీర్ స్టార్టింగ్ నుంచే మంచి మంచి క‌థ‌ల‌ను ఎంచుకుంటున్న వ‌రుణ్ తేజ్ లో ఒక ప్ర‌త్యేక‌త ఉంది. త‌న‌ను తాను హీరోగా తెర‌పై ప్ర‌జెంట్ చేసుకోవాలి అనే తాప‌త్ర‌యం లేకుండా, స‌హ‌జంగా పాత్ర‌లో న‌టించేస్తాడు. ఈ సినిమాలోనూ ఆది పాత్ర‌లో త‌న యాటిట్యూట్ తో ప్ర‌తీ సీన్ ను పండించాడు. త‌న గ‌త సినిమాల కంటే చాలా చాలా మెరుగైన న‌ట‌న క‌న‌బరిచాడు. డ్యాన్సులు కూడా చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో ప్రేక్ష‌కులంద‌ర్నీ ఆక‌ట్టుకునే విధంగా క‌నిపించాడు వ‌రుణ్. వ‌ర్ష పాత్ర‌లో రాశీ ఖ‌న్నా చ‌క్క‌గా చేసింది. పాత్ర కోసం స‌న్న‌బ‌డ‌టం.. కొత్త లుక్‌లో క‌న‌ప‌డ‌టం పెద్ద ప్ల‌స్ అనే చెప్పాలి. రాశి త‌న కెరీర్‌లోనే ది బెస్ట్ పెర్ఫామెన్స్ అని చెప్పొచ్చు. త‌న హావ‌భావాలు, న‌ట‌న, ప్ర‌తీదీ ఆక‌ట్టుకునే  విధంగా ఉంటాయి. హీరో ఫ్రెండ్ గా ప్రియ‌ద‌ర్శి కి మంచి రోల్ ద‌క్కింది. విద్యుల్లేఖ ఉన్న సీన్స్ బాగా న‌వ్విస్తాయి. మిగిలిన వారిలో హైప‌ర్ ఆది, స‌ప‌నా ప‌బ్బి, సుహాసిని త‌మ త‌మ పరిధుల్లో చేశారు.


సాంకేతిక నిపుణులుః 

హీరో-  హీరోయిన్లు గొడ‌వ ప‌డ‌టం, వారిద్ద‌రూ చివ‌ర‌కు క‌లుసుకోవ‌డం ఈ స్టోరీ మీద చాలానే సినిమాలొచ్చాయి. ఆల్రెడీ తెలిసిన క‌థ‌ను అంటే.. క్లైమాక్స్ లో ఎలాగూ హీరో హీరోయిన్ క‌లుస్తారు అని తెలిసిన ప్రేక్ష‌కుడిని రెండు గంట‌ల పాటూ థియేట‌ర్ లో కూర్చోబెట్ట‌డం అంటే మాటలు కాదు. క‌థ పాతదే అయినా, క‌థ‌నం కొత్త‌గా ఉంటే అది పెద్ద ప‌నేం కాదు అని చాలా సింపుల్ గా నిరూపించాడు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి. సినిమా మొత్తం మంచి ఫీల్ తో, ఎమోష‌న్ ను క్యారీ అయ్యేలా తెర‌కెక్కించాడు. తెలిసిన క‌థ‌ను అర్థ‌మ‌య్యేట్లు చెప్ప‌డంలో ఒక మెచ్చూరిటీ క‌నిపిస్తుంది. దర్శకుడు ఎంచుకున్న ప్లాట్ సింపుల్ గా ఉన్నా పాత్రలు బలంగా ఉంటే ఆ స్టోరీతో ఎంతగా మెప్పించవచ్చనేది చూపించాడు. వ‌రుణ్- రాశీ ల మ‌ధ్య ఎక్కువ సీన్ల‌ను రాసిన డైర‌క్ట‌ర్ వెంకీ, వారిద్ద‌రి మ‌ధ్య సన్నివేశాల‌తో మెప్పించాడు. ప్ర‌తీ క్యారెక్ట‌రైజేష‌న్ ను చాలా బాగా సృష్టించాడు ద‌ర్శ‌కుడు. ఫ‌స్టాఫ్ అంతా మంచి ఫీల్ తో ర‌న్ చేసిన ద‌ర్శ‌కుడు సెకండాఫ్ కు వ‌చ్చేసరికి కొంచెం డ‌ల్ అయి, స్లో నెరేష‌న్ తో కాస్త త‌డ‌బ‌డిన‌ట్లు అనిపించిన‌ప్ప‌టికీ, బోర్ కొట్టించ‌కుండా మేనేజ్ చేశాడు. టెక్నిక‌ల్ గా కూడా తొలిప్రేమ చాలా స‌క్సెస్ అయింది. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. కాలేజ్ సీన్స్, రైల్వే స్టేష‌న్స్ సీన్స్, లండ‌న్ లొకేష‌న్స్ ప్ర‌తీదీ త‌న కెమెరా క‌న్నుతో చాలా అందంగా తెర‌కెక్కించాడు. సినిమాకు మేజ‌ర్ హైలైట్ థ‌మ‌న్ సంగీతం. థ‌మ‌న్ మ్యూజిక్ లేకుండా తొలిప్రేమ ను ఊహించుకోవ‌డం కూడా క‌ష్ట‌మే అనేంత మంచి సంగీతంతో ఈ సినిమాకు థ‌మ‌న్ ప‌ని చేశాడు. ప్రాణం పెట్టి సినిమా చేస్తే అవుట్ పుట్ ఎలా ఉంటుంద‌నేది ఈ సినిమాలో థ‌మ‌న్ ప‌నిత‌నాన్ని చూస్తే అర్థ‌మ‌వుతుంది. పాట‌ల‌న్నీ విన‌డానికి మాత్ర‌మే కాదు, తెర‌పై అవి మ‌రింత బాగా అనిపిస్తాయి. త‌న రీరికార్డింగ్ తో కూడా సన్నివేశాల‌ను, సినిమాను తర్వాతి స్థాయికి తీసుకెళ్లాడు. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.


ప్ల‌స్ పాయింట్స్ః 

న‌టీన‌టుల న‌ట‌న‌

ద‌ర్శ‌క‌త్వం

థ‌మ‌న్ సంగీతం


మైన‌స్ పాయింట్స్ః 

సెకండాఫ్ స్లో నెరేష‌న్

హైప‌ర్ ఆది న‌ట‌న‌


పంచ్‌లైన్ః తొలిప్రేమ.. ఓ తియ్యని జ్ఞాప‌కం

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.5/5


Follow Us