Khakee Review


అటు త‌మిళంలో పాటూ, తెలుగులో కూడా అంతే ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్న కార్తీ, త‌న ప్ర‌తీ సినిమాను తెలుగు తమిళ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. అంతే కాదు తాను న‌టించే ప్ర‌తీ సినిమా కొత్త‌గా ట్రై చేస్తూ, ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందుతున్నాడు. అదే బాట‌లో తాజాగా 'ధీర‌న్ అధిగారం ఒండ్రు' అనే చిత్రాన్ని తెలుగులో ''ఖాకీ'' గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. పూర్తి స్థాయి క్రైమ్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుందా లేదా అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం. 


క‌థః 

ధీరజ్ (కార్తీ)1999 బ్యాచ్ లో ట్రైన్ అయిన డీఎస్పీ. ట్రైనింగ్ లో ఉండగానే ఇంటి ఎదురుగా అద్దెకు వచ్చిన వాళ్ల అమ్మాయి ప్రియ(రకుల్ ప్రీత్ సింగ్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు.  నిజాయితీగా ఉద్యోగం చేసుకుంటూ భార్యను ప్రేమగా చూసుకునే ధీరజ్ జీవితాన్ని ఓ కేసు మలుపు తిప్పుతుంది. చెన్నై హైవే పై ఉన్న ఇంట్లోకి చోరబడిన కొందరు దొంగలు అతి కిరాతకంగా ఇంట్లో వాళ్లను చంపి వారిని దోచుకెళుతుంటారు. ఈ కేసుని పరిష్కరించాలని సొంతంగా నిర్ణయించుకుంటాడు ధీరజ్. వేలిముద్రల సహాయంతో వాళ్లను పట్టుకోవాలనుకుంటాడు. కానీ అతడికి ఒక్క క్లూ కూడా దొరకదు. మరి ధీర‌జ్ అనుకున్నట్లుగా క్రిమినల్స్‌ను పట్టుకోగలిగాడా..? ఈ కేసు కారణంగా ధీరజ్ ఎలాంటి ఇబ్బందులను ఎదురుకున్నాడు..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే! 


న‌టీన‌టులుః 

తెలుగు ప్రేక్ష‌కుల‌కు కేవ‌లం ల‌వ‌ర్ బాయ్ గానే ప‌రిచ‌యం ఉన్న కార్తీ, ఈ సినిమాతో యాక్ష‌న్ వైపుగా అడుగులేసి మంచి ప్ర‌య‌త్న‌మే చేశాడు. అటు డ్యూటీలో భాగంగా సిన్సియ‌ర్ పోలీసాఫీస‌ర్ యాక్ష‌న్ సీన్స్ లోనూ, ఇటు ప్రియురాలితో రొమాంటిక్ సీన్స్ లోనూ, ఎమోష‌నల్ సీన్స్ లో కార్తీ న‌ట‌న ప్రేక్ష‌కుల్ని క‌ట్టి ప‌డేస్తుంది. అంతేకాదు త‌నలోని కామెడీ టైమింగ్ ఈ సినిమాతో మ‌రోసారి ఋజువు చేసుకున్నాడు. డ‌బ్బింగ్ లో కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. సినిమా కోసం త‌ను ప‌డిన శ్ర‌మ న‌టుడిగా త‌న స్థాయిని మ‌రింత పెంచుతుంది. హీరోయిన్ పాత్ర‌కు పెద్ద‌గా ప్రాముఖ్య‌త లేక‌పోవ‌టంతో, ర‌కుల్ గ్లామర్ సీన్స్ కే ప‌రిమిత‌మైంది. కానీ తాను స్క్రీన్ పై ఉన్నంత సేపు త‌న న‌ట‌న‌తో, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. ఇక హీరోకు ప్ర‌తీ ఆప‌రేర‌ష‌న్ లో సాయం చేసే ఆఫీస‌ర్ స‌త్య పాత్ర‌లో బోస్ వెంక‌ట్ మెప్పిస్తాడు. త‌న కుటుంబాన్ని కోల్పోయిన బాధ‌లో కూడా పోలీస్ గా త‌న విధి నిర్వ‌హ‌ణ ను, బాధ్య‌త‌ను నెర‌వెర్చే పాత్ర‌లో బోస్ వెంక‌ట్ న‌ట‌న ఆక‌ట్ట‌కుంటుంది. విల‌న్ గా అభిమ‌న్యు సింగ్ త‌న మార్క్ చూపించాడు. కిరాత‌కంగా హ‌త్య‌లు చేసే రాజ‌స్థాన్ దొంగ‌లముఠాకు లీడ‌ర్ పాత్ర‌లో ఒదిగిపోయాడు. క్లైమాక్స్ ఫైట్ లో అభిమ‌న్యు సింగ్ న‌ట‌న త‌న‌లోని న‌టుడిని బాగా ఎలివేట్ చేస్తుంది. మిగ‌తా వారిలో ఎవ‌రి పాత్ర‌లో వారు త‌మ ప‌రిధి మేర చేశారు. 


సాంకేతిక నిపుణులుః 

య‌దార్థ ఘ‌ట‌న‌ల‌తో సినిమాలు తెర‌కెక్కించ‌డం అంటే ఆషామాషీ కాదు. ఒక‌వేళ తీసినా ఆ సినిమాలు ప్రేక్ష‌కుల‌కు ఎక్కుతాయా లేదా అన్న‌దీ అనుమాన‌మే. మామూలుగా జ‌నాల‌కు తెలీని విష‌యాల‌ను చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి అది ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారా లేదా అని. కానీ ఈ సినిమా క‌థ‌ను ద‌ర్శ‌కుడు ఎందుకు ఎంచుకున్నాడో తెలీదు కానీ ఈ సినిమా కోసం అత‌ను చేసిన ప‌రిశోధ‌న అంతా ఇంతా కాదు అని తెరపై ప్ర‌తీ సీన్ లోనూ స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. ఆయ‌న ఎక్క‌డ రీసెర్చ్ చేశాడు ఎలా రీసెర్చ్ చేశాడు అన్న‌ది ముఖ్యం కాదు సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డాడు అన్న‌ది ముఖ్యం. ప్రతీ సన్నివేశాన్ని చాలా స‌హ‌జంగా, ఎంతో ఇంటెన్స్ తో తెర‌కెక్కించాడు. సెకండాఫ్ లో వ‌చ్చే బ‌స్ ఫైట్ సీక్వెల్స్ కానీ, ప్రీ ఇంట‌ర్వెల్ సీన్ కానీ ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌తిభ‌ను చూపిస్తుంది. పోలీస్‌లు టీమ్ వ‌ర్క్ చేస్తే ఫ‌లితం ఎలా ఉంటుందో అన్న‌ది ఈ సినిమాతో స్ప‌ష్టం చేశాడు. ఎంత క్రూర‌మైన వ్య‌క్తులనైనా హింస తెర‌పై చూపించ‌కుండా విల‌న్స్ గా చూపించొచ్చు కానీ వినోద్ ఆ ప‌నిచేయ‌కుండా హింస మొత్తాన్నీ చూపించి, కొంచెం వ‌య‌లెన్స్ ఎక్కువ చేశాడు. సినిమాటోగ్ర‌ఫీ బావుంది. జిబ్రాన్ సంగీతంలో పాట‌లు మాంటేజ్ సాంగ్స్ లా వ‌చ్చి వెళ్తాయి త‌ప్పించి, అంత‌లా కిక్ అనిపించ‌వు. కానీ నేప‌థ్య సంగీతం మాత్రం సినిమాను త‌ర్వాతి స్థాయికి తీసుకెళ్లింది. ఎడిటింగ్ బావుంది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.


ప్ల‌స్ పాయింట్స్ః 

కార్తీ న‌ట‌న‌

ద‌ర్శ‌క‌త్వం

రీరికార్డింగ్


మైన‌స్ పాయింట్స్ః 

క‌థ‌ను సాగ‌దీయడం

హింస‌ను ఎక్కువ‌గా చూపించ‌డం


పంచ్‌లైన్ః ఖాకీల‌కు సెల్యూట్

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.25/5

 


Follow Us