Hello Review


అక్కినేని అఖిల్. అఖిల్ సినిమాతో ఇండ‌స్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ దాని ప‌రాజ‌యం అఖిల్ ను స్టార్ గా నిల‌బెట్ట‌లేక‌పోయింది. దీంతో రెండేళ్ల త‌ర్వాత.. ఇష్క్, మ‌నం, 24 వంటి బ్లాక్ బ్ల‌స్ట‌ర్స్ ను తెర‌కెక్కించిన విక్ర‌మ్ కె కుమార్ తో, స్వ‌యంగా నాగార్జునే త‌న స్వీయ నిర్మాణంలో హ‌లో అంటూ ప‌ల‌క‌రించారు. అస‌లు టైటిల్ తోనే ఫుల్ ప్ర‌మోష‌న్ స్టార్ట్ చేసిన నాగార్జున, టీజ‌ర్, ట్రైల‌ర్, ఇవికాక సినిమాను ఫుల్ ప్ర‌మోట్ చేసేసి హ‌లో పై మాంచి హైప్ క్రియేట్ చేశాడు. మ‌రి ఇంత హైప్ తో రిలీజ్ అయిన హ‌లో ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకుందా..? ఎప్పుడూ త‌న సినిమాల‌తో ఏదొక మ్యాజిక్ చేసే విక్ర‌మ్ కుమార్ ఈ సినిమాతో ఏం మ్యాజిక్ చేశాడు..? అఖిల్ ఈ సినిమాతో అయినా త‌న‌ని తాను ప్రూవ్ చేసుకున్నాడా..? అన్న‌ది మ‌న సమీక్ష‌లో చూద్దాం.


క‌థః 

అన‌గ‌న‌గా హైద‌రాబాద్. అందులో శీను(అఖిల్), జున్ను(క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్) అనే చిన్న‌పిల్లలకు అనుకోకుండా స్నేహం ఏర్ప‌డ‌టం, త‌ర్వాత జున్ను వాళ్ల నాన్న‌కు ట్రాన్స‌ఫ‌ర్ మీద వేరే చోటుకు వెళ్ల‌డం, అనాధ అయిన శీను ను పెద్దింటి వాళ్లు ద‌త్త‌త తీసుకోవ‌డం, ఆ త‌ర్వాత శీను అవినాష్ గా మార‌డం, జున్ను ఒక ప‌నిమీద మ‌ళ్లీ హైద‌రాబాద్ రావ‌డం, వారిద్ద‌రూ అనుకోకుండా క‌లుసుకోవ‌డం, శీను వాళ్ల ఫ్యామిలీ వారిద్ద‌రికే పెళ్లి చేయ‌డాల‌నుకోవ‌డం, వీరిద్ద‌రూ దానికి అంగీక‌రించ‌క‌పోవ‌డం, ఎవరి సోల్‌మేట్ కోసం వాళ్లు వెయిట్ చేసి చివ‌ర‌కు వాళ్ల‌ను క‌లుసుకోవ‌డం ఇదే క‌థ.


న‌టీన‌టుల ప్ర‌తిభః 

శ్ర‌మ ఎప్ప‌టికైనా మంచి ఫ‌లితాన్నిస్తుందంటారు. అది ముమ్మాటికీ నిజ‌మే. ఈ సినిమా కోసం అఖిల్ ప‌డిన త‌ప‌న‌, శ్ర‌మ అంతాఇంతా కాదు. న‌టుడిగా అఖిల్ ముందు సినిమా కంటే చాలా ప‌రిణితి చెందాడు. డ్యాన్సులు చ‌క్క‌గా కుదిరాయి. అవ‌స‌రం ఉన్న దగ్గ‌ర త‌ప్పించి, డ్యాన్స్ వ‌చ్చు క‌దా అఖిల్ డ్యాన్సులు వాడ‌కుండా మంచి ప‌ని చేశారు. యాక్ష‌న్ సీక్వెన్స్ లో కూడా ఎంతో దుడుకుగా న‌టించాడు. ఇక‌పోతే క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ తెలుగు సినీ ప‌రిశ్ర‌మకు మ‌రొక మంచి న‌టి దొరికింద‌నుకోవ‌చ్చు. త‌న క్యూట్‌నెస్ తో, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆక‌ట్టుకుంది. మొదటి సినిమా అయిన‌ప్ప‌టికీ ఎంతో కాన్ఫిడెన్స్ గా చేసింది. అఖిల్ త‌ల్లిదండ్రులుగా ర‌మ్య‌కృష్ణ‌, జ‌గ‌ప‌తి బాబు చాలా బాగా న‌టించారు. ఫ్యామిలీ సీన్స్ అన్నింటికీ ప్రేక్ష‌కులు బాగా క‌నెక్ట్ అవుతారు. ర‌మ్య‌కృష్ణ‌- అఖిల్ ల మ‌ధ్య వ‌చ్చే ఎమోష‌న‌ల్ సీన్ ప్రేక్ష‌కుల‌కు కంట‌త‌డి పెట్టిస్తుంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చిన్న‌పిల్ల‌ల గురించి. శీను, జున్నుల పాత్ర‌ల్లో ఎంతో బాగా చేసి, సినిమాకు ప్రాణం పోసిన ఆ ఎపిసోడ్  ను నిల‌బెట్టారు. అజ‌య్ త‌న పాత్రకు త‌గ్గట్టు న‌టించాడు. అంత‌కంటే ఎక్కువ న‌టించ‌డానికి ఎక్క‌డా త‌న‌కు స్కోప్ లేదు. మిగ‌తా పాత్ర‌ధారులు ఎవ‌రి ప‌రిధిమేర వారు బాగానే చేశారు. 


సాంకేతిక నిపుణులుః 

క‌థ ప‌రంగా చాలా పాత క‌థ‌నే తీసుకున్న విక్ర‌మ్ కుమార్, దాన్ని ఆస‌క్తిక‌రంగా మార్చ‌డంలో, త‌న‌దైన క‌థ‌నాన్ని రాసుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పాలి. ముఖ్యంగా ఆ ఛేజ్ సీన్స్, చిన్న పిల్ల‌ల స‌న్నివేశాలు, ఫ్యామిలీతో వ‌చ్చే ఎమోష‌న‌ల్ సీన్స్ ను చాలా బాగా తీశాడు. మ‌నం ఒక సినిమా చూస్తున్న‌ప్పుడు చాలా సినిమాలు గుర్తుకురావ‌చ్చు కానీ అలా గుర్తు వ‌చ్చాయంటే ఆ సినిమా డైర‌క్ట‌ర్ త‌ప్ప‌ని చెప్ప‌లేం. బాహుబ‌లి చూస్తున్న‌ప్పుడు కూడా ఏదొక సినిమా షాట్స్ గుర్తుకురావ‌చ్చు. ఒక్కొక్క‌రికి ఒక్కో డిఫ‌రెంట్ స్టైల్ ఉంటుంది. విక్ర‌మ్ ది కూడా అదే స్టైల్. ఎన్ని పాత సినిమాలు గుర్తొచ్చిన‌ప్ప‌టికీ, క‌థ ముందే తెలిసిన‌ప్ప‌టికీ, సినిమా చివ‌ర వ‌ర‌కు ప్రేక్ష‌కుడిని అంతే ఆతృత‌తో సీట్ల‌లో కూర్చోబెట్ట‌డం అంటే మామూలు విష‌యం కాదుగా. కాక‌పోతే ఇంకాస్త జాగ్ర‌త్త తీసుకుని ఉండుంటే ఇంకా మంచి ఫలితం ఉండేది. టెక్నిక‌ల్ ప‌రంగా కూడా హ‌లో చాలా బాగా కుదిరింది. పిఎస్ వినోద్ సినిమాటోగ్ర‌ఫీ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ప్ర‌తీ సీన్ లోనూ అత‌ని ప‌నిత‌నం చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. యాక్ష‌న్ సీన్స్ బాగా వ‌ర్క‌వుట్ అయ్యాయి. రోమాలు నిక్క‌పొడుచుకునేలా యాక్ష‌న్ సీన్స్ ను చాలా రియ‌లిస్టిక్ గా తెర‌కెక్కించారు. మ‌నం సినిమా త‌ర్వాత  అక్కినేని ఫ్యామిలీకి ఆస్థాన సంగీత ద‌ర్శ‌కుడైన అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. దీనికి తోడు ఈ సినిమా అత‌నికి 50వ సినిమా కావ‌డం, ద‌ర్శ‌కుడు కూడా విక్ర‌మ్ కుమార్, ఆ సినిమా అక్కినేని నాగార్జునే నిర్మించ‌డంతో ప్రాణం పెట్టి సంగీత‌మిచ్చాడు అనూప్. రీరికార్డింగ్ సినిమా స్థాయిని మ‌రింత పెంచింది. ఎడిటింగ్ బావుంది. నాగార్జున నిర్మాణ విలువ‌లు ఎప్పుడూ బాగానే ఉంటాయి. దానికితోడు త‌న సొంత కొడుకు సినిమా కావ‌డంతో ఎక్క‌డా వెనుకాడ‌కుండా ఖ‌ర్చు పెట్టాడు. ఆ ఖ‌ర్చు ప్ర‌తీ సీన్ లోనూ స్ప‌ష్టంగా క‌నిపిస్తూనే ఉంది. 


ప్ల‌స్ పాయింట్స్ః 

యాక్ష‌న్ సీక్వెన్స్

ఎమోష‌న‌ల్ సీన్స్

చిన్న‌పిల్ల‌ల ఫ్లాష్ బ్యాక్

అనూప్ సంగీతం


మైన‌స్ పాయింట్స్ః 

అదే పాత క‌థ‌

క్లైమాక్స్


పంచ్‌లైన్ః హ‌లో! వి హేట్ యూ

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.25/5Follow Us