Gayatri Review


దాదాపు మూడేళ్ల‌ కాలం త‌ర్వాత  సీనియర్‌ నటుడు మోహన్ బాబు లీడ్ రోల్‌లో నటించిన సినిమా గాయత్రి. తన సొంత బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్‌ బాబు ద్విపాత్రాభినయం చేయగా, యంగ్ మోహన్‌ బాబుగా అతిథి పాత్రలో మంచు విష్ణు నటించాడు. ఆ నలుగురు, పెళ్లైన కొత్తలో చిత్రాలను తెరకెక్కించిన మదన్‌ తొలిసారిగా తన స్టైల్‌ మార్చి థ్రిల్లర్ జానర్‌ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ ప్రయత్నం మదన్‌కు మరో విజయాన్ని అందించిందా..?  నిర్మాత‌గా మోహ‌న్ బాబు ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందా అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.


క‌థః 

దాసరి శివాజీ (మోహన్‌ బాబు) రంగస్థల నటుడు. దూరమైన కూతురి కోసం ఎదురుచూస్తూ కొంత మంది అనాథలను చేరదీసి శారదా సదనం అనే అనాథాశ్రమాన్ని నిర్వహిస్తుంటాడు. తన కూతురు ఏదో ఒక అనాథాశ్రమంలో ఉండే ఉంటుందన్న నమ్మకంతో అన్ని అనాథాశ్రమాలకు డబ్బు సాయం చేస్తుంటాడు. ఆ డబ్బు కోసం నేరస్థులలా మేకప్ వేసుకొని వారి బదులు జైలు శిక్ష కూడా అనుభవిస్తుంటాడు. శివాజీ మీద అనుమానం వచ్చిన జర్నలిస్ట్‌ శ్రేష్ఠ (అనసూయ) అతడు చేసే పని ఎలాగైన బయటపెట్టాలని ప్రయత్నిస్తుంటుంది. ఓ గొడవ కారణంగా శివాజీకి తన కూతురు ఎవరో తెలుస్తుంది. కూతుర్ని కలుసుకునే సమయానికి గాయత్రి పటేల్‌ (మోహన్‌ బాబు), శివాజీని కిడ్నాప్ చేస్తాడు. తన బదులుగా శివాజీని ఉరికంభం ఎక్కించాలని ప్లాన్ చేస్తాడు గాయత్రి పటేల్‌. తనకు బదులుగా శిక్ష అనుభవించడానికి గాయత్రి పటేల్‌.. శివాజీనే ఎందుకు ఎంచుకున్నాడు..? శివాజీ కూతురు గాయత్రికి, గాయత్రి పటేల్‌కు సంబంధం ఏంటి..? ఈ సమస్యల నుంచి శివాజీ ఎలా బయటపడ్డాడు..? చివరకు గాయత్రి పటేల్‌ ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ.


న‌టీన‌టుల ప్ర‌తిభః 

మోహ‌న్ బాబు మ‌రోసారి త‌న న‌ట విశ్వ‌రూపం చూపించాడు. ఒక‌వైపు సాఫ్ట్ క్యారెక్ట‌ర్ లోనూ, మ‌రోవైపు విల‌న్ రోల్ లోనూ అద‌ర‌గొట్టేశాడు. ముఖ్యంగా సెంటిమెంట్ స‌న్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫామెన్స్ తో మోహ‌న్ బాబు మెప్పించాడు. విష్ణు క్యారెక్ట‌ర్ లో స‌రిగ్గా స‌రిపోయాడు. శ్రియ పాత్ర ఉన్నంత‌లో బాగుంది. మోహ‌న్ బాబు కూతురు క్యారెక్ట‌ర్ చేసిన నిఖిలా విమ‌ల్ త‌న స‌హ‌జ న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. జ‌ర్న‌లిస్ట్ గా అన‌సూయ మంచి పాత్ర పోషించింది. మిగిలిన‌ వారిలో శివ ప్ర‌సాద్, రాజా ర‌వీంద్ర, పోసాని త‌మ త‌మ పాత్ర‌ల ప‌రిధిలో బాగా చేశారు.


సాంకేతిక నిపుణులుః 

మోహ‌న్ బాబు లాంటి విల‌క్ష‌ణ న‌టుడుకి త‌గ్గ క‌థ క‌థ‌నాల‌తో డైర‌క్ట‌ర్ మ‌దన్ బాగా ఆక‌ట్టుకున్నాడు. చాలా కాలం త‌ర్వాత మోహ‌న్ బాబు ను పూర్తి నెగిటివ్ రోల్ లో చూపించిన మ‌ద‌న్ అభిమానుల‌ను బాగానే మెప్పించాడు. ఫ‌స్ట్ హాఫ్ లో ఫాస్ట్ గా సాగిన క‌థ, సెకండాఫ్ కు వ‌చ్చే స‌రికి కాస్త డ‌ల్ అయింది. అయిన‌ప్ప‌టికీ సెకండాఫ్ ను గ్రిప్పింగ్ గా రాసుకున్నాడు. సెకండాఫ్ లో ఎమోష‌న‌ల్ సీన్స్ ఆక‌ట్టుకున్న‌ప్ప‌టికీ, అన‌వ‌స‌రంగా వ‌చ్చే ఐటెమ్ సాంగ్ చికాకు తెప్పిస్తుంది. డైమండ్ ర‌త్న‌బాబు డైలాగ్స్ బాగున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే సినిమాకు డైలాగ్స్ హైలైట్ అని చెప్పొచ్చు. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. థ‌మ‌న్ పాట‌ల్లో రెండు పాట‌లు బాగున్నాయి. మిగిలిన పాట‌ల‌కు కూడా సాహిత్యం బాగున్న‌ప్ప‌టికీ ట్యూన్స్ క్యాచీగా లేవు. రీరికార్డింగ్ తో థ‌మ‌న్ మ‌రోసారి మ్యాజిక్ చేశాడు. ఎడిటింగ్ ఫ‌ర్వాలేదు. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయిగా త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి.   


ప్ల‌స్ పాయింట్స్ః 

మోహ‌న్ బాబు న‌ట‌న‌

డైలాగులు


మైన‌స్ పాయింట్స్ః 

పాట‌లు

స్లో నెరేష‌న్

కామెడీ లేక‌పోవ‌డం


పంచ్‌లైన్ః అనుకున్న‌ది చేసేశారు.. త‌ర్వాత సంగ‌తి త‌ర్వాత‌

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5


Follow Us