Bhaagamathie Review


అరుంధ‌తి, పంచాక్ష‌రి, రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లి లాంటి సినిమాల‌తో స్టార్ హీరోల‌కు ధీటుగా క్రేజ్ సంపాదించిన అనుష్క‌.. ఇప్పుడు భాగ‌మ‌తిగా మ‌రోసారి  భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంది. పిల్ల జ‌మీందార్ డైర‌క్ట‌ర్ అశోక్ ద‌ర్శ‌క‌త్వంలో.. యువీ క్రియేష‌న్స్ నిర్మించిన ఈ చిత్రం ఎన్నో అంచ‌నాల మ‌ధ్య లెక్క‌లు తేల్చ‌డానికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. 2018 మొద‌లై ఒక నెల పూర్తి అవుతున్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టికీ టాలీవుడ్ లో చెప్పుకోద‌గ్గ హిట్ రాలేదు. మ‌రి భాగ‌మ‌తి ఆ లెక్క‌లు కూడా తేల్చేసిందా అన్న‌ది సమీక్ష‌లో చూద్దాం.


క‌థః 

 నిజాయితీ గ‌ల ఎంపీ ఈశ్వ‌ర్ ప్ర‌సాద్ (జ‌య‌రామ్)ను ఆయ‌న‌కున్న పాజిటివ్ ఇమేజ్ ను చూసి క‌ట్ట‌డి చేయాల‌ని భావించి, ఎలాగైనా అత‌ణ్ని అవినీతిప‌రుడ‌ని నిరూపించడానికి కంక‌ణం క‌ట్టుకుంటారు ప్ర‌త్య‌ర్థులు. ఆ బాధ్య‌త‌ను సీబీఐ జాయింట్ క‌లెక్ట‌ర్ వైష్ణ‌వి(ఆశా శ‌ర‌త్)కు అప్ప‌గిస్తారు. దీంతో ఈశ్వ‌ర్ ప్ర‌సాద్ ద‌గ్గ‌ర రెండు సార్లు సెక్ర‌ట‌రీగా ప‌నిచేసిన చంచ‌ల ఐఏఎస్ (అనుష్క‌)ను విచారించి, త‌న ద్వారా సాక్ష్యాలు చెప్పించి, ఈశ్వ‌ర్ ప్ర‌సాద్ ను ఇరికించాల‌ని చూస్తుంది. త‌న ప్రియుడ్ని చంపిన కేసులో ఆల్రెడీ జైల్లో ఉన్న చంచ‌ల ను ప్ర‌జ‌ల మ‌ధ్య విచారించ‌డం క‌రెక్ట్ కాద‌ని భావించిన సీబీఐ, చంచ‌ల‌ను ఊరికి దూరంగా అడ‌విలో ఉన్న భాగ‌మ‌తి బంగ్లాకు పంపిస్తారు. ఆ బంగ్లాలోకి వెళ్లాక చంచ‌ల ప్ర‌వ‌ర్త‌న‌లో తేడా వ‌స్తుంది. త‌న‌ను ఎవ‌రో కొడుతున్న‌ట్లు, అరుస్తూ, అర‌బిక్ భాష‌లో మాట్లాడుతూ పోలీసుల‌ను కూడా భ‌య‌పెడుతుంది. అస‌లు చంచ‌ల అలా ప్ర‌వ‌ర్తించడానికి కార‌ణం ఏంటి? ఎంపీ మీద కుట్ర వేయాల‌ని ఎందుకు ప్ర‌య‌త్నించారు? త‌న ప్రియుడ్ని చంచ‌ల ఎందుకు చంపింది?  చివ‌ర‌కు ఈ స‌మ‌స్య‌ల నుంచి చంచ‌ల ఎలా బ‌య‌టప‌డింద‌న్న‌దే అసలు క‌థ‌.


న‌టీన‌టుల ప్ర‌తిభః 

అరుంధ‌తిగా, రుద్ర‌మ‌దేవిగా, దేవ‌సేన‌గా హిస్ట‌రీ క్రియేట్ చేసిన అనుష్క‌, భాగ‌మ‌తిగానూ గుర్తుండిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది. చంచ‌ల ఐఏఎస్ గా హుందాగా క‌నిపించిన స్వీటీ, భాగ‌మ‌తిగా రౌద్రాన్ని, రాజ‌సాన్ని కూడా ప‌లికించింది. భాగ‌మతి పాత్ర‌లో అనుష్క న‌ట‌న అరుంధ‌తి పాత్ర‌ను గుర్తు చేస్తుంది. ప్రీ ఇంట‌ర్వెల్ లో వ‌చ్చే 15 నిమిషాల సీన్ లో అనుష్క న‌ట‌న చూస్తే అర్థ‌మ‌వుతుంది త‌ను ఎంత‌టి న‌టి అన్న విష‌యం. హీరోగా న‌టించిన ఉన్ని ముకుంద‌న్ పాత్ర చిన్న‌దే అయినా మంచి హావ‌భావాల‌ను పలికించాడు. ఎంపీగా జ‌య‌రామ్ బాగా చేశాడు. ముర‌ళీశ‌ర్మ కు మ‌రోసారి మంచి పాత్ర ద‌క్కింది. ఆశాశ‌ర‌త్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. మిగిలిన వారిలో ప్ర‌భాస్ శీను, ధ‌న‌రాజ్, విద్యుల్లేఖ త‌మ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. 


సాంకేతిక నిపుణులుః 

అనుష్క లీడ్ రోల్ లో సినిమా వ‌స్తుందన‌గానే ఎన్ని అంచ‌నాలైతే ఏర్ప‌డ్డాయో, ఆ అంచ‌నాలు అందుకునే రేంజ్ లోనే భాగ‌మ‌తిని తీర్చి దిద్దాడు ద‌ర్శ‌కుడు అశోక్. క‌థ గొప్ప‌గా లేక‌పోయినా ఆ విజువ‌ల్స్, టేకింగ్ తో సినిమాను నిల‌బెట్టాడు అశోక్. ముఖ్యంగా భాగ‌మ‌తి బంగ్లాలో జ‌రిగే సీన్స్ అన్నీ వావ్ అనేలా ఉంటాయి. ఆడియ‌న్స్ కు ట్విస్ట్ లు ఇచ్చే సీన్స్ ను కూడా బాగానే రాసుకున్నాడు. కాక‌పోతే కొన్ని జరగని సంఘటనలు జరిగినట్టుగా భ్రమ కలిగించటంతో ఆడియన్స్‌ కాస్త తికమక పడే అవకాశం ఉంది. అంతే త‌ప్పించి ద‌ర్శ‌కుడిగా అశోక్ ప్ర‌య‌త్నాన్ని అంద‌రూ మెచ్చుకుంటారు. మాధీ సినిమాటోగ్ర‌ఫీ, ఆర్ట్ డైర‌క్ట‌ర్ ర‌వీంద‌ర్ ప‌నితీరు సినిమా స్థాయిని పెంచేట్లు ఉన్నాయి. థ‌మ‌న్ సంగీతం బాగుంది. ముఖ్యంగా త‌న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సీన్స్ ను బాగా ఎలివేట్ చేశాడు. ఎడిటింగ్ బావుంది. యూవీ క్రియేష‌న్స్ నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి తగ్గ‌ట్లున్నాయి.


ప్ల‌స్ పాయింట్స్ః 

అనుష్క న‌ట‌న‌

సినిమాటోగ్ర‌ఫీ

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

ఆర్ట్ డైర‌క్ట‌ర్ ప‌నిత‌నం


మైన‌స్ పాయింట్స్ః 

అక్క‌డ‌క్క‌డ తిక‌మ‌క పెట్టే సీన్స్

కామెడీ లేక‌పోవ‌డం


పంచ్‌లైన్ః భాగ‌మ‌తి లెక్క తేల్చేసింది

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.25/5


Follow Us