బాల నటుడిగా.. హీరోగా 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేసిన తనీష్‌కి ఇప్పటి వరకూ సరైన హిట్ పడలేదు. బిగ్ బాస్ సీజన్ 2లో ఫైనల్‌కి చేరడంతో ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటూ.. బెజవాడ రౌడీ షీటర్ లారా వాస్తవ జీవిత కథతో ‘రంగు’ సినిమా ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విడుదలకు ముందు వివాదాలు చుట్టిముట్టిన ఈ చిత్రం ప్రేక్షకులకు చేరువైందా? బెజవాడ రౌడీ షీటర్ లారా కథతో తనీష్ మెప్పించగలిగాడా? అన్నది సమీక్షలో తెలుసుకుందాం.
పవన్‌కుమార్ అలియాస్ లారా(తనీష్) టెన్త్ క్లాస్‌లో స్కూల్ టాపర్. ఇంటర్మీడియట్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ వస్తుంది. కాలేజ్‌లో చేరిన లారా ఓ అమ్మాయి కారణంగా సీనియర్‌తో గొడవ పడతాడు. అవేశం కారణంగా ఈ గొడవలు పెరుగుతూనే వస్తాయి. ఓ సందర్భంలో ఓ వ్యక్తిని లారా చంపేస్తాడు. తర్వాత నాటకీ పరిస్థితుల నడుమ లారా రౌడీషీటర్‌గా మారుతాడు. దందాలు, సెటిల్మెంట్స్ చేస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల మధ్యనే పూర్ణ(ప్రియా సింగ్)ను చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. జీవితంపై ఆశ పుడుతుంది. అయితే ప్రత్యర్థులు లారాను చంపడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే విజయవాడకు వచ్చిన ఎసిసి రాజేంద్ర(పరుచూరి రవి) లారాను కాపాడటానికి ఏం చేశాడు? చివరకు లారా రౌడీ నుండి మామూలు మనిషిగా మారి జీవితాన్ని కొత్తగా ప్రారంభించాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
తనీష్ తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ను ఇవ్వగలిగాడు. ఇప్పటివరకు తను ట్రై చేయని జానర్ లో చాలా గొప్పగా నటించాడు. హీరోయిన్గా నటించిన ప్రియాసింగ్ తన పాత్ర పరిధి మేర బాగానే నటించింది. చివర్లో వచ్చే ఎమోషన్స్ సీన్స్ పండించగలిగింది. రౌడీయిజం వదిలేసి సాధుజీవిలో బతుకుతున్న పాత్రలో షఫీ నటన బాగుంది. పూర్ణ తెరపై కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో మంచి నటన కనబరిచింది. ఇక మిగిలిన పాత్రల్లో పోసాని కృష్ణమురళీ, పరుచూరి వెంకటేశ్వర్రావు తమ పాత్ర పరిధిమేరకు నటించారు.
కథను చెప్పడానికి దర్శకుడు ఎంచుకున్న స్క్రీన్ ప్లే చూస్తేనే తను కథ మీద ఎంత కాన్ఫిడెంట్ గా , క్లారిటీగా ఉన్నాడన్నది అర్థమవుతుంది. ఫస్ట్ సినిమా అయినా ఇలాంటి బరువైన కథను తను డీల్ చేసిన విధానాన్ని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకుని తీరాల్సిందే. మొత్తం విజయవాడలోనే చిత్రీకరించడంతో సినిమాటోగ్రాఫర్ సురేందర్ రెడ్డికి కొత్త విజువల్స్‌తో పనిలేకుండా పోయింది. యోగేశ్వర శర్మ మ్యూజిక్‌తో పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ, రీరికార్డింగ్ మాత్రం బాగా ఇచ్చాడు. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్, కథా సహకారం సినిమాకు మంచి హెల్ప్ అయ్యాయి. ఎడిటింగ్ ఇంకాస్త బావుండాల్సింది. నిర్మాణ విలువలు బావున్నాయి.
పంచ్‌లైన్ః తనీష్ ‘రంగు’ బావుంది.
ఫిల్మ్‌జల్సా రేటింగ్ః 3.25/5