Sunday, May 26, 2019
Home News Entertainment news రాజమౌళి ఊహ ఓకే.. కానీ

రాజమౌళి ఊహ ఓకే.. కానీ

0
2591
ఊహ.. అందుకున్నవారికి అందుకున్నంత. అసలు ఈ సృష్టిలో ఎన్నో విషయాలు ఊహల నుంచి ఉద్భవించినవే. ఇక సినిమాలకైతే అది లేనివారికి నో ఎంట్రీ బోర్డ్ ఉంటుందిక్కడ. అలాగని అన్ని ఊహలకు ఓకే అనడం సాధ్యం కాదు. కొన్ని మాత్రం ఖచ్చితంగా తేడాగా అనిపిస్తాయి. అలాంటిదే రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా కథానాయకులు. ఈ ఇద్దరూ రియల్ హీరోస్. ఆ రియల్ హీరోస్ కలిసున్న కాలాలు, ప్రాంతాలు, నేపథ్యాలు, అన్ని రకాలుగానూ పూర్తిగా వేర్వేరు. అలాంటి నాయకులను వెండితెరపై కథానాయకులను చేస్తున్నా అని చెప్పాడు రాజమౌళి. కానీ ఇక్కడే ఈ ఊహే కాస్త అసంబద్ధంగా అనిపిస్తోంది. ఎందుకంటే భౌగోళికంగా చూసినా, నైసర్గికంగా చూసినా ఆ కాలానికి ఈ రెండు ప్రాంతాలూ పూర్తిగా పరిచయం లేనివి. అలాగే సాంఘికంగానూ ఆ ఇద్దరు నాయకుల స్థానాలు వేరు. అలాంటి వారు కలిసి ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఎంత మాత్రం అంగీకారంగా అనిపించడం లేదు. కాకపోతే ఇది ఫిక్షన్ అంటున్నాడు రాజమౌళి. అసలు ఆ మాటతోనే వెళ్లి ఉంటే పోయేది. కానీ ఇలా ఇద్దరు గ్రేట్ వారియర్స్ కథతో ఫిక్షన్ సృష్టించడం కాస్త ఇబ్బందిగానే ఉంది.
అల్లూరి సీతారామరాజు పోరాటంపైనా ఇప్పటికీ చరిత్రకారులకు కొన్ని సందేహాలున్నాయి. కానీ ఆయన గిరిజనుల్లో రగిల్చిన స్ఫూర్తిని మాత్రం కాదనలేం. అలాగే గెరిల్లా పోరాట తంత్రాన్ని పాటించాడాయన. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా కేవలం స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశాడని కొందరు.. కాదు గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేశాడని కొందరు చరిత్రకారులు చెబుతారు. ఈ కారణంగానే భారత ప్రభుత్వం కూడా ఇప్పటి వరకూ అల్లూరిని స్వాతంత్ర్య సమరయోధుడుగా గుర్తించలేదు.
ఇక ఈయన కాలానికి పదేళ్లు తేడాగా కొమురం భీమ్ పోరాట నేపథ్యం ఉంది. కానీ కొమురం భీమ్ ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీక. వారి హక్కుల పోరాటాల వేగుచుక్క. అస్తిత్వం కోసం మాత్రమే కాదు.. ‘‘జల్ జంగ్ జమీన్’’ అనే నినాదంతో నాటి నైజాం ప్రభుత్వంతో పోరాటం చేశాడు. వారి చేతిలోనే హతమయ్యాడు. కానీ అల్లూరి పోరాటంలో ఈ కోణం కనిపించదు. ఇక కృష్ణ తీసిన సినిమాతో పూర్తిగా సినిమానే చరిత్ర అన్నంతగా మారిపోయింది. వాస్తవాలకు దూరంగా పూర్తి సినిమాటిక్ గా ఉన్న ఆ సినిమా కమర్సియల్ గా విజయం సాధించినా వాస్తవ కథకు నైతికంగా మాత్రం మెచ్చదగింది కాదు. మొత్తంగా ఇప్పుడు రాజమౌళి మరోసారి చరిత్రను ఫిక్షనీకరించే పనిలో పడ్డాడు.
ఇప్పటి వరకూ సాధారణ కథలతోనే మాత్రమే సావాసం చేసిన రాజమౌళి బాహుబలితో వచ్చిన ఫేమ్ ను కంటిన్యూ చేయాలంటే ఇకపై సాధారణ కథలతో కుదరదు అని తెలుసుకున్నాడు. అందుకే ఎవరికీ రాని ఊహ నాకు వచ్చింది అనే అత్యుత్సాహంతో చేస్తోన్న సినిమా ఇది అంటూ కొందరు చరిత్ర కారులు విమర్శిస్తున్నారు కూడా. నిజానికి ఈ ఇద్దరూ కలిసి ఉంటే అనే ప్రశ్న వచ్చినప్పుడు దాన్ని ఫిక్షన్ గా చెప్పలేం. ఊహకూ వదిలేయలేం. కలిసినప్పుడు నాటి పరిస్థితులనూ చెప్పాల్సి ఉంటుంది. ఆ పరిస్థితులను ఇద్దరికీ అన్వయమయ్యేలా సీన్స్ క్రియేట్ చేయగలిగితే.. కానీ సాధ్యం కాదు. బట్.. ప్రతిసారీ ఇది అల్లూరి, కొమురం భీమ్ కలిసి ఉంటే అనే ఊహ నుంచి పుట్టిన సినిమా అని కాకుండా కేవలం ఫిక్షన్ గానే ఫిక్స్ అయితే బెటర్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here