‘పేట’ మూవీ రివ్యూ

0
772
లేట్ వ‌య‌సులో స్పీడ్ గా సినిమాలు చేసుకుంటూ సాగిపోతున్న ర‌జ‌నీకాంత్ .. 2.0 వ‌చ్చిన రెండు నెల‌ల్లోపే పేట సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. 90ల నాటి రజ‌నీని త‌లపించేలా ఉన్న ట్రైల‌ర్ తో పేట అంటూ ఈసారి మన ముందుకొచ్చాడు. మ‌రి సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ‘పేట’ ఎలా ఉందో చూద్దాం.

కాళీ( ర‌జ‌నీకాంత్) హై రెక‌మండేష‌న్ తో హిల్ స్టేష‌న్ లోని ఒక కాలేజీ హాస్టల్ వార్డెన్ గా వ‌స్తాడు.అప్ప‌టివ‌ర‌కు అస్త‌వ్య‌స్తంగా ఉన్న ఆ హాస్ట‌ల్ కాళీ రాక‌తో మొత్తం మారిపోతుంది. ఆ కాలేజీని ప‌ట్ట‌టి పీడిస్తున్న రౌడీ గ్యాంగ్ ఆట క‌ట్టించిన కాళీ అక్క‌డే చ‌దువుకుంటున్న అన్వ‌ర్ అనే కుర్రాడి మీద ప్ర‌త్యేక దృష్టి సారిస్తాడు. అత‌డి ప్రేమ‌కు సాయం కూడా చేస్తాడు. ఐతే కాళీ ఆ కాలేజీకి రావ‌డానికి అన్వ‌ర్ కు సాయం చేయ‌డానికి వేరే కార‌ణాలు కూడా ఉంటాయి. అన్వ‌ర్ మీద ఒక గ్యాంగ్ దాడి చేయ‌డం, వాళ్ల నుంచి అన్వ‌ర్ ను కాళీ కాపాడ‌టంతో అత‌డి గ‌తం బ‌య‌టికి వ‌స్తుంది. ఇంత‌కీ కాళీ ఎవ‌రు? అత‌డి గ‌త‌మేంటి అత‌డికి అన్వ‌ర్ కు సంబంధమేంటన్న‌దే మిగ‌తా క‌థ‌.

సూప‌ర్ స్టార్ త‌న అభిమానుల్ని అల‌రించేలా క‌నిపించాడు. గ‌త కొన్నేళ్ల‌లో క‌నిపించిన బెస్ట్ లుక్ అంటే పేట లోనిదే. ఆయ‌న స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. అభిమానుల్ని ఉర్రూత‌లూగించే ర‌జ‌నీ మార్క్ మూమెంట్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. సినిమా అంత‌టా చాలా ఉత్సాహంగా క‌నిపించి త‌న న‌ట‌న‌తోనూ ఆక‌ట్టుకున్నాడు. న‌వాజుద్దీన్ సిద్దిఖి ఉన్నంత‌లో బాగా చేశాడు. కాక‌పోతే ఆయ‌న స్థాయికి త‌గ్గ పాత్ర కాదు. హీరో కుటుంబంలోని వాళ్లంద‌రినీ చంపేశాక న‌వాజ్ ఇచ్చే ఎక్స్‌ప్రెష‌న్స్ ఆయ‌నలోని న‌టుడి ప్ర‌త్యేక‌త‌ను చాటి చెబుతాయి. విజ‌య్ సేతుప‌తి మ‌రోసారి త‌న‌దైన శైలిలో ఎఫ‌ర్ట్స్ ఏమీ క‌నిపించకుండా జిత్తు పాత్ర‌ను చేసుకుంటూ వెళ్లాడు. కానీ అత‌డి పాత్ర కూడా ఆశించిన స్థాయిలో ఏమీ లేదు. ద‌ర్శ‌కుడి దృష్టంతా ర‌జ‌నీ మీదే పెట్ట‌డం వ‌ల్ల ఇలా మిగిలిన పాత్ర‌ల‌ను సీరియ‌స్ గా తీసుకోలేద‌నిపిస్తుంది. సిమ్ర‌న్, త్రిష లు అతిథి పాత్ర‌లుగానే ఉండిపోయారు. బాబీ సింహా లాంటి మంచి నటుడిని కూడా ద‌ర్శ‌కుడు స‌రిగ్గా ఉప‌యోగించుకోలేదు. మిగిలిన వారు త‌మ త‌మ ప‌రిధిలో బాగానే చేశారు.

ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ పేట ద్వారా ప్రేక్ష‌కుల‌ను నిరాశ ప‌రిచాడ‌నే చెప్పాలి. ఒక ర‌జనీ అభిమానిలా ఆలోచించి ర‌జ‌నీని స్టైలిష్ గా ప్రెజెంట్ చేయ‌డం వ‌ర‌కు బానే ఉంది కానీ ఇంత రొటీన్ క‌థ‌ను ఎలా ఎంచుకున్నాడ‌న్న‌దే అర్థం కాదు. స్క్రీన్ ప్లే విష‌యంలో కూడా పెద్ద‌గా అత‌ను మార్క్ వేసుకోలేక‌పోయాడు. మాస్ ఆడియ‌న్స్, ర‌జ‌నీ ఫ్యాన్స్ ను మెప్పించడానికి కొన్ని సీన్స్ ను మాత్రం ఎంట‌ర్‌టైనింగ్ గా తీయ‌గ‌లిగాడు, టేకింగ్ లో త‌న స్టైల్ ను చూపించాడు త‌ప్ప త‌న నుంచి కొత్త‌ద‌నం ఆశించే ప్రేక్ష‌కుల్ని మాత్రం అత‌ను నిరాశ ప‌రిచాడు. ఇక‌పోతే పేట కోసం టెక్నిక‌ల్ టీమ్ కూడా బాగానే క‌ష్ట‌ప‌డ్డారు. తిరు సినిమాటోగ్ర‌ఫీ ఆక‌ట్టుకుంటుంది. సినిమాకు ఒక స్టైలిష్ లుక్ తీసుకురావ‌డంలో ఆయ‌న కీల‌క‌పాత్ర పోషించాడ‌నే చెప్పాలి. మొద‌టిసారి ర‌జ‌నీతో ప‌ని చేసే అవ‌కాశం రావ‌డంతో అనిరుధ్ కూడా ఆ అవ‌కాశాన్ని బాగానే ఉప‌యోగించుకున్నాడు. అత‌డి పాట‌లు, రీరికార్డింగ్ సినిమాకు మంచి ప్ల‌స్. అస‌లేమీ విష‌యం లేని సీన్స్ కూడా అత‌ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు. ప్ర‌తీ సీన్ లోనూ మ్యూజిక్ ప‌రంగా ఒక ఎన‌ర్జీ క‌నిపిస్తుంది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
ర‌జ‌నీకాంత్
మాస్ ఆడియ‌న్స్ కు న‌చ్చే సీన్స్
అనిరుధ్ సంగీతం
సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్ః
క‌థ‌
సెకండాఫ్

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here