‘ప‌డి ప‌డి లేచే మ‌న‌సు’ మూవీ రివ్యూ

0
386
అందాల‌ రాక్ష‌సి, కృష్ణ గాడి వీర ప్రేమగాథ లాంటి సినిమాల‌తో మంచి అభిరుచి ఉన్న ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న హ‌ను రాఘ‌వ‌పూడి.. లై ప‌రాజ‌యంతో ట్రాక్ త‌ప్పాడు. దాంతో చాలా రోజుల త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ శ‌ర్వానంద్, సాయి పల్ల‌వి ల క‌ల‌యిక లో ప‌డి పడి లేచే మ‌నసు అంటూ ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. మ‌రి ఈ సినిమాతో మ‌ళ్లీ హ‌ను ట్రాక్ లోకి వ‌స్తాడా అన్న‌ది స‌మీక్షలో చూద్దాం.
కోల్‌క‌త్తాలో చ‌దువు పూర్తి చేసి స్నేహితుల‌తో స‌ర‌దాగా జీవితాన్ని గ‌డిపేస్తున్న సూర్య (శ‌ర్వానంద్) అనుకోకుండా మెడికో అయిన వైశాలి (సాయి ప‌ల్లవి)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌టం.. ఆమె వెంట ప‌డి ప‌డి చివ‌ర‌కు ఆమెను కూడా ప్రేమ‌లోకి దించ‌డం.. త‌ర్వాత త‌న తల్లిదండ్రుల జీవితంలో జ‌రిగిన అనుభ‌వాల్ని దృష్టిలో పెట్టుకుని వైశాలితో పెళ్లికి నిరాక‌రించ‌డం.. ఒక‌రినొక‌రు విడిచి ఉండిపోలేనంత ప్రేమ ఉంటేనే పెళ్లి చేసుకోవాల‌ని చెప్పి బ్రేక‌ప్ చెప్ప‌డం.. ఇద్ద‌రూ ఒక సంవ‌త్స‌రం పాటు ఒక‌రికొక‌రు దూరంగా ఉండాల‌నే ఒప్పందానికి రావ‌డం.. మ‌ళ్లీ ఏడాది త‌ర్వాత అనుకోని సంఘ‌ట‌న వ‌ల్ల వారిద్ద‌రి మ‌ధ్య ఎడబాటు పెర‌గ‌డం, వారి మ‌ధ్య ఆ ఎడ‌బాటు ఎలా పోయింది? అస‌లు వారిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డానికి కార‌ణ‌మేంటి?  చివ‌ర‌కు వారిద్ద‌రూ ఎలా ఒక్క‌ట‌య్యార‌నేదే ఈ సినిమా క‌థ‌.
శ‌ర్వానంద్, సాయి ప‌ల్ల‌విలు ఇద్ద‌రూ ఎవ‌రికి వారే పోటీ పడి మ‌రీ న‌టించారు. వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా కుదిరింది. సినిమా,  అది సాగిన తీరును ప‌క్క‌న పెడితే వీరిద్ద‌రి కోస‌మైనా సినిమా ఒక‌సారి చూడొచ్చ‌నిపించేలా ఉన్నారిద్దరూ. ఇంట‌ర్వెల్ బ్యాంగ్ లో సాయి ప‌ల్లవి హావ‌భావాలు ప్రేక్ష‌కుడ్ని క‌ట్టిప‌డేస్తాయి. శ‌ర్వానంద్ కూడా కొన్ని కొన్ని సీన్ల‌లో త‌న ప్ర‌త్యేకత చాటుకున్నాడు. ప్రియ‌ద‌ర్శి కాసేపు న‌వ్విస్తాడు. వెన్నెల కిషోర్ బాడీ లాంగ్వేజ్ క‌నిపించిన కాసేపు కాస్త న‌వ్వించినా.. చెప్పుకోద‌గ్గ ప్రాముఖ్య‌త ఉన్న పాత్ర కాదు. మంచి న‌టీన‌టులున్న‌ప్ప‌టికీ వారెవ్వ‌రూ క‌థ‌కు అంత‌గా ఉపయోగ‌ప‌డ‌లేదు. ముర‌ళీ శ‌ర్మ, సంప‌త్ లాంటి పెద్ద న‌టుల పాత్ర‌లు సైతం ఏదో సైడ్ ఆర్టిస్ట్ ల పాత్ర‌ల‌ను త‌ల‌పిస్తాయి. అజ‌య్ ఫ‌ర్వాలేదు. సునీల్ వల్ల ఈ సినిమాకు ఒరిగింది కానీ, సునీల్ కు ఈ సినిమా వ‌ల్ల ఒరిగేది కానీ ఏమీ లేదు.
మంచి అభిరుచి ఉన్న ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న హ‌ను రాఘ‌వపూడికి ప్రేమ స‌న్నివేశాల‌ను బాగా పండిచ‌గ‌లడు. కానీ అదే క‌థను ఒక నేర్పుతో.. ప‌ట్టు బిగించి చెప్ప‌డం మాత్రం త‌న వ‌ల్ల కావ‌ట్లేదు. త‌న గ‌త సినిమాల‌న్నీ ఇదే ఫార్మాట్ లో ఉన్నాయ‌నే మాట అంద‌రూ అన్నారు ఇక ఈ సినిమాలో ఆ త‌ప్పును స‌రిచేసుకుంటాడులే అనుకున్నారంతా. కానీ ఈ సినిమా విష‌యంలో కూడా హ‌ను మ‌ళ్లీ అదే త‌ప్పు చేశాడు. ఒక మంచి ఫీల్ ఉన్న స‌బ్జెక్ట్ ను తీసుకుని, దాన్ని చ‌క్క‌గా న‌డిపించి, ప్రేక్ష‌కుడికి మంచి ఫీల్ ను క‌లిగించి సినిమా మంచి హై లో వెళ్తుంద‌న్న టైమ్ లో ఒక్క‌సారిగా ప‌డేసాడు. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు సినిమా న‌డిచిన తీరు చూసి, సెకండాఫ్ మినిమం ఉన్నా మంచి ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీగా మిగిలే ఈ సినిమా సెకండాఫ్ మొద‌లైన ఒక 10 నిమిషాల‌కే ‘అస‌లేం జ‌రుగుతుందో అర్థ‌మ‌వుతుందా?’ అని సినిమాలో ప్రియ‌ద‌ర్శి చెప్పే డైలాగ్ లాగే ఫీల‌వుతాడు. డైరక్ట‌ర్ అస‌లు క‌థ‌ను ఎక్క‌డ మొద‌లుపెట్టాడు ఎక్క‌డ‌కు తీసుకొచ్చాడు, ఏం చేస్తున్నాడు అన్న‌ది ప్రేక్ష‌కుడికి త‌ల‌నొప్పిగా త‌యార‌వుతుంది.  ఇంకా చెప్పాలంటే అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఫీల్ ను పోగొట్ట‌డానికి ఏం చేయాలో అంతా చేశాడు. అయితే ల‌వ్ సీన్స్ ను హ్యాండిల్ చేయ‌డంలో త‌న బ‌లం క‌నిపిస్తుంది. చాలా సీన్ల‌లో త‌న అభిరుచి క‌నిపిస్తుంది. రాసుకున్న డైలాగులు చాలా బావున్నాయి. కృష్ణుడు- రుక్మిణిల ప్రేమ క‌థ‌ను స్పూర్తిగా తీసుకుని ఈ ల‌వ్ స్టోరీ ని న‌డిపించిన విధానం బావుంది. టెక్నిక‌ల్ గా ఈ సినిమా ఉన్న‌తంగా అనిపిస్తుంది. జేకే సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు మేజ‌ర్ హైలైట్. ప్ర‌తీ స‌న్నివేశం ఆహ్లాదంగా అనిపించేలా తెర‌కెక్కించాడు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతంలోని పాట‌లు బావున్నాయి. రీరికార్డింగ్ లో కూడా మంచి ఫీల్ ఉంది. సెకండాఫ్ ఇంకాస్త ఎడిట్ చేసి ఉంటే కొంత‌లో కొంత అయినా బావుండేది. నిర్మాత‌లు ఖ‌ర్చు విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా మంచి నిర్మాణ విలువ‌లు పాటించారు.
ప్ల‌స్ పాయింట్స్ః 
శ‌ర్వానంద్- సాయి ప‌ల్ల‌విల న‌ట‌న‌
సినిమాటోగ్ర‌ఫీ
సంగీతం
మైన‌స్ పాయింట్స్ః
ద‌ర్శ‌కత్వం
స్క్రీన్ ప్లే
పంచ్‌లైన్ః లేచిన మ‌న‌సు ప‌డిపోయింది
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః  2.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here