‘ఎన్టీఆర్ః మ‌హానాయ‌కుడు’ మూవీ రివ్యూ

0
2408

ఎన్టీఆర్. కేవ‌లం ఈయ‌న తెలుగు వారికి మాత్ర‌మే అభిమాన న‌టుడు కాదు. తెలుగు భాష‌ను విశ్వ‌మంత‌టా వ్యాపింప‌చేసి.. స‌గ‌ర్వంగా త‌లెత్తుకునేలా చేసిన మ‌హోన్న‌త నాయ‌కుడు. జోన‌ర్ ఏదైనా స‌రే త‌న‌దైన న‌ట‌న‌తో చెర‌గ‌ని ముద్ర వేసిన ఎన్టీఆర్ చ‌రిత్ర గురించి తెలుగు సినిమా చరిత్ర‌లో ఆయ‌న గురించి సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించద‌గిన‌వ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. సినీ ప్ర‌స్థానంలో ఆయ‌న ఎంత‌టి ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించారో, ఆ త‌ర్వాత తెలుగు దేశం పార్టీని స్థాపించి సీఎం స్థాయికి ఎదిగిన తీరును ఎవ్వ‌రూ మ‌ర్చిపోలేరు. తెలుగోడి వాడిని వేడిని ప్ర‌పంచానికి తెలియ‌చేసిన స్వ‌ర్గీయ న‌ట సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క రామారావు జీవిత్ర చ‌రిత్రను వెండితెర‌పై ఆవిష్క‌రిస్తూ బాల‌కృష్ణ- క్రిష్ లు చేసిన ప్ర‌య‌త్న‌మే ఎన్టీఆర్ బ‌యోపిక్. ఆయ‌న చ‌రిత్ర‌ను చెప్ప‌డం అంత తేలికా? అదొక సుదీర్ఘ ప్ర‌యాణం. అందుకే దాన్ని రెండు భాగాలు చేసి ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హా నాయ‌కుడుగా చేశారు. సంక్రాంతి కానుక గా వ‌చ్చిన ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు ఫ్లాప్ కావ‌డంతో మ‌హానాయ‌కుడిపై పెద్ద‌గా అంచ‌నాలు ఏర్ప‌డ‌లేదు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చిన ‘ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు’ ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తాడో లేదో చూద్దాం.

”తెలుగుదేశం పార్టీ స్థాపిస్తున్నా…” అనే రాజ‌కీయ ప్ర‌క‌ట‌న తో క‌థానాయ‌కుడు ముగిసింది. అక్క‌డి నుంచి దానికి కొన‌సాగింపుగానే మ‌హానాయ‌కుడు ఉంటుంది. రామారావు తెలుగు దేశం పార్టీ పెట్టి ప్ర‌జ‌ల్లోకి వ‌స్తాడు. ప్ర‌జా సంక్షేమమే త‌న ప‌థ‌కాలు అంటూ జనాల్లోకి వెళ్లిపోతాడు. పార్టీ పెట్టిన 9 నెల‌ల్లోనే ఎన్టీఆర్ ఎలా అధికారంలోకి రాగ‌లిగాడు? త‌న వెంటే ఉండి రాజ‌కీయంగా దెబ్బ తీయాల‌ని చూసిన వాళ్లెవ‌రు? ఆ కుట్ర‌ల నుంచి రామారావు ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు.? ఢిల్లీ గ‌ద్దెను సైతం స‌డ‌లించి తెలుగుదేశం పార్టీ త‌ర‌పున ఎలా సీఎం అయ్యాడు? అన్న‌దే క‌థ‌.

క‌థానాయ‌కుడులో ఎన్టీఆర్ గా న‌టించిన బాల‌య్య‌పై ఎన్నో విమ‌ర్శ‌లొచ్చాయి. అయితే మ‌హానాయ‌కుడు విష‌యంలో అది మారింది. 60 ఏళ్లున్న పాత్ర పోషించ‌డం, పైగా తండ్రి పోలిక‌లు కొద్దో గొప్పో ఉండ‌టం వ‌ల్ల ఆ మ‌హానుభావుడిని మ‌రిపించ‌క‌పోయినా.. రామారావు పాత్ర‌లో ఒదిగిపోయాడు బాల‌కృష్ణ‌. హావ‌భావాలు ప్ర‌ద‌ర్శించ‌డంలోనూ, సంభాష‌ణ‌లు ప‌లికే విధానంలోనూ మంచి స‌మ‌తూకం పాటించాడు. అటు రాజ‌కీయ నాయ‌కుడిగా, ఇటు భ‌ర్త‌గా రెండు ర‌కాలుగా క‌నిపించి మెప్పించాడు. కొన్ని కొన్ని సీన్స్ లో బాల‌కృష్ణ న‌ట‌న బాగా మెప్పిస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీలో ఎన్టీఆర్ ను అవ‌మానప‌రిచే సీన్ లో బాల‌య్య ఎక్స్‌ప్రెష‌న్స్ ఆక‌ట్టుకుంటాయి. బాల‌కృష్ణ త‌ర్వాత సినిమాలో చెప్పుకోవాల్సింది విద్యా బాల‌న్ గురించే. త‌న పాత్ర మొత్తం ఎమోష‌న్స్ చుట్టూ తిరుగుతూంటుంది. విద్యా బాల‌న్ యాక్టింగ్ బ‌స‌వ‌తార‌కం పాత్ర‌కు మ‌రింత గుర్తింపు, మ‌ర్యాదను తెచ్చింద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. చంద్ర‌బాబు నాయుడుగా రానా న‌ట‌న వ‌ర‌కు అయితే ఆక‌ట్టుకున్న‌ప్ప‌టికీ రానా మాత్రం ఆ పాత్ర‌కు సెట్ అవ‌లేద‌నిపిస్తుంది. కానీ చంద్ర‌బాబు నాయుడు బాడీ లాంగ్వేజ్ ని రానా పుణికిపుచ్చ‌కున్న‌ట్లే ఎంతో ఒదిగిపోయి చేశాడు. నాదెండ్ల భాస్క‌ర్ రావు గా స‌చిన్ ఖేడ్‌ఖ‌ర్ అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. చైత‌న్య ర‌థ సారధి నంద‌మూరి హ‌రికృష్ణ‌గా క‌ళ్యాణ్ రామ్ బాగా చేశాడు. మిగిలిన వారు కూడా త‌మ త‌మ ప‌రిధుల్లో బాగా చేశారు.

కేవ‌లం ఎన్టీఆర్.. ఎన్టీఆర్ అంటూ భ‌జ‌న చేయ‌డం వ‌ల్లే క‌థానాయ‌కుడు ప‌రాజ‌యానికి మొద‌టి కార‌ణ‌మ‌ని అంద‌రూ ఒప్పుకోవాల్సిన నిజం. దాంతో క్రిష్ ఈసారి కాస్త జాగ్ర‌త్త తీసుకుని మ‌హానాయ‌కుడులో అలాంటి వాటి జోలికి వెళ్ల‌కుండా కేవ‌లం నిజాలు మాత్ర‌మే చూపిస్తాడని అనుకున్నారు. అంద‌రూ అనుకున్న‌ట్లే.. ఇప్ప‌టికే చాలా లేట్ అయింది అనుకున్నాడో ఏమో కానీ ఎక్క‌డా టైమ్ వేస్ట్ కాకుండా నేరుగా క‌థ‌లోకి వెళ్లిపోయి మొద‌టి పాట‌లోనే ఎన్టీఆర్ బాల్యం నుంచి వివాహం, ఆ త‌ర్వాత మొద‌టి సినిమా క‌థానాయ‌కుడు ని కేవ‌లం 8 నిమిషాల్లోనే చుట్టేసి, ఇక ఆ త‌ర్వాత చైత‌న్య ర‌థం తీసుకుని జనాల్లోకి వెళ్ల‌డం, అన్న‌గారి ప్ర‌పంచంలోని ఆయ‌నుకున్న అభిమానం అన్నీ క‌లిపి చూపించేయ‌డం వ‌ర‌కు చేసాడు బానే ఉంది. ఇప్పుడు అసలు క‌థ‌లోకి వ‌చ్చాడు క్రిష్. నాదెండ్ల భాస్క‌రరావు ఎపిసోడ్ తో క‌థ‌ను మ‌లుపు తిప్పాడు. ఎన్టీఆర్ సీఎం కుర్చీ ఎక్కాక నాదెండ్ల‌కు ఆ ప‌దవి కావాల‌నుకోవ‌డం, ఎన్టీఆర్ వెనుక నాదెండ్ల రాజ‌కీయం న‌డిపిన‌ట్లు చూపించ‌డం ఇవ‌న్నీ కూడా బాగానే ఆవిష్క‌రించాడు క్రిష్. ఆ టైమ్ లో తెలుగుదేశం పార్టీని ముందుండి న‌డిపించి, మ‌ళ్లీ ఎన్టీఆర్ సీఎం కుర్చీ ఎక్క‌డానికి తెలుగుదేశం పార్టీలో చంద్ర‌బాబు పోషించిన పాత్ర‌ను కూడా బాగా చిత్రీక‌రించాడు. త‌నకున్న బ‌డ్జెట్, టైమ్ లో ఈ రేంజ్ సినిమాను అందించినందుకు క్రిష్ ను మెచ్చుకోకుండా ఉండ‌లేం. మంచి మంచి ఎమోష‌న‌ల్ సీన్స్ తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. తొలి భాగంతో పోలిస్తే రెండో భాగంలోనే ఎమోష‌న‌ల్ కంటెంట్ కూడా బాగా ఎక్కువగా ఉంది. అయితే ఎంత చేసినా కానీ ఎన్టీఆర్ బ‌యోపిక్ ఎందుకో అసంపూర్ణంగానే అనిపిస్తుంది. టెక్నిక‌ల్ గా కూడా ఈ సినిమా రిచ్ గా ఉంది. సినిమాటోగ్ర‌ఫ‌ర్ ప‌నితీరు బావుంది. సాయి మాధవ్ బుర్రా మ‌రోసారి త‌న పెన్ ప‌వ‌ర్ చూపించి మంచి మాట‌లు అందించాడు. సంగీతంలోని పాట‌లు సన్నివేశాల‌కు అనుగుణంగా వచ్చి ఆక‌ట్టుకుంటాయి. త‌న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కొన్ని స‌న్న‌వేశాల‌ను బాగా ఎలివేట్ అయ్యేలా చేశాడు. ఎడిటింగ్ చాలా ప‌ర్ఫెక్ట్ గా ఉంది. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి తగ్గ‌ట్లుగా బావున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
ఎమోష‌న‌ల్ సీన్స్
సంగీతం

మైన‌స్ పాయింట్స్ః
సెకండాఫ్‌
అసంపూర్ణ క‌థ‌

పంచ్‌లైన్ః మ‌హానాయ‌కుడి జీవిమంతా పాలి’ట్రిక్సే’..
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5

Click here for NTR Kathanayakudu Movie Review http://www.filmjalsa.com/ntr-kathanayakudu-movie-review/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here