‘ఎన్టీఆర్ః క‌థానాయ‌కుడు’ మూవీ రివ్యూ

0
708
ఎన్టీఆర్. కేవ‌లం ఈయ‌న తెలుగు వారికి మాత్ర‌మే అభిమాన న‌టుడు కాదు. తెలుగు భాష‌ను విశ్వ‌మంత‌టా వ్యాపింప‌చేసి.. స‌గ‌ర్వంఆ త‌లెత్తుకునేలా చేసిన మ‌హోన్న‌త నాయ‌కుడు. జోన‌ర్ ఏదైనా స‌రే త‌న‌దైన న‌ట‌న‌తో చెర‌గ‌ని ముద్ర వేసిన ఎన్టీఆర్ చ‌రిత్ర గురించి తెలుగు సినిమా చరిత్ర‌లో ఆయ‌న గురించి సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించద‌గిన‌వ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. సినీ ప్ర‌స్థానంలో ఆయ‌న ఎంత‌టి ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించారో, ఆ త‌ర్వాత తెలుగు దేశం పార్టీని స్థాపించి సీఎం స్థాయికి ఎదిగిన తీరును ఎవ్వ‌రూ మ‌ర్చిపోలేరు. తెలుగోడి వాడిని వేడిని ప్ర‌పంచానికి తెలియ‌చేసిన స్వ‌ర్గీయ న‌ట సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క రామారావు జీవిత్ర చ‌రిత్రను వెండితెర‌పై ఆవిష్క‌రించిన ప్ర‌య‌త్న‌మే ఇది. కాలాన్ని గెలిచిన కార‌ణ‌జ‌న్ముడి క‌థ అంటూ ద‌ర్శ‌కుడు క్రిష్ రూపొందించిన ప్ర‌తిష్టాత్మ‌క క‌థ ‘ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు’ భారీ అంచ‌నాల న‌డుమ నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. తండ్రి పాత్ర‌లో బాల‌కృష్ణ ఎలా మెప్పించారు.? అన్న‌ది స‌మీక్షలో చూద్దాం.

ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్త‌కం. దాని గురించి అభిమానుల‌కు, తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు తెలియ‌నిది ఏమీ లేదు. ఎన్టీఆర్ సినీ నేప‌థ్యం గురించి అంద‌రికీ తెలిసిందే. అయితే, ఆయ‌న కుటుంబానికి ఎంత విలువ ఇస్తారు. ముఖ్యంగా బ‌స‌వ‌తార‌క‌మ్మ‌కు ఆయ‌న ఎంత ప్రాధాన్యం ఇస్తార‌న్న‌ది ఎవ‌రికీ తెలియ‌దు. ఆ విశేషాల‌న్నీ య‌న్‌.టి.ఆర్‌- క‌థానాయ‌కుడులో చూస్తాం. ఒక ర‌కంగా ఇది ఎన్టీఆర్ క‌థ అన‌డం క‌న్నా బ‌స‌వ‌తార‌కం క‌థ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె కోణంలో నుంచి ఈ క‌థ మొద‌లైంది. ఆ కోణంలోనే ఈ క‌థ సాగుతుంది. బ‌స‌వ‌తార‌కం(విద్యాబాల‌న్‌) క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూ ఉంటుంది. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి గురించి హ‌రికృష్ణ‌(క‌ల్యాణ్‌రామ్‌) తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతూ క‌నిపించ‌డంతో సినిమా ప్రారంభ‌మ‌వుతుంది. అప్పుడు చికిత్స తీసుకుంటున్న బ‌స‌వ‌తార‌కం ఎన్టీఆర్ ఆల్బ‌మ్‌ను తిర‌గేస్తూ ఉండ‌టంతో య‌న్‌.టి.ఆర్‌. అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. ఎన్టీఆర్(బాల‌కృష్ణ‌) ఎలా ఎదిగారు? సినిమాల‌పై వ్యామోహం ఎందుకు పెరిగింది? సినిమాల్లో ఎలా రాణించాడు? ఒక సాధార‌ణ రైతు బిడ్డ గొప్ప స్టార్‌గా ఒక్కో అడుగు వేసుకుంటూ ఎలా వెళ్లాడన్న‌ది క‌థ‌. ఎన్టీఆర్ ప్ర‌స్థానంతో మొద‌లైన చిత్రం, ఎన్టీఆర్ తెలుగుదేశం ప్ర‌క‌ట‌న‌తో ముగుస్తుంది. మ‌రి తండ్రి పాత్ర‌లో బాల‌కృష్ణ ఎలా మెప్పించారు. బ‌స‌వ‌తార‌కంగా విద్యాబాల‌న్ ఎలాంటి న‌ట‌న క‌న‌బ‌రిచింది. తెలుగువారి అభిమాన న‌టుడు ఎన్టీఆర్ సినీ జీవితం ఎలా సాగిందో తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే!

సినిమా అంతా ఎన్టీఆర్ అనే పాత్ర చుట్టూనే తిరుగుతుంది కాబ‌ట్టి మ‌రో పాత్ర‌కు పెద్ద‌గా స్కోప్ ఉండ‌ద‌నే విష‌యం అర్థ‌మ‌వుతుంది. ఇక విధంగా చెప్పాలంటే ఈ సినిమా నంద‌మూరి అభిమానుల‌కు పండ‌గ‌నే చెప్పాలి. అస‌లు ఎన్టీఆర్ పాత్ర‌లో మ‌రొక‌రిని ఊహించుకోవ‌డమంటే క‌ష్ట‌మే కానీ.. త‌న తండ్రి చరిత్ర‌ను ప్ర‌జ‌ల‌కు తెలియచేయాల‌న్నవాంఛ‌తో బాల‌కృష్ణ ఈ సినిమా నిర్మించి, త‌న తండ్రి పాత్ర‌ను పోషించి చాలా పెద్ద బ‌రువే మోసాడు. యుక్త వ‌య‌సులో ఉన్న ఎన్టీఆర్ గా బాల‌య్య రూపు కాస్త సెట్ అవ‌లేద‌నిపిస్తుంది కానీ కాస్త వ‌య‌సు మీద ప‌డ్డాక మ‌ధ్య వ‌య‌స్కుడిగా బాల‌కృష్ణ రూపం ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. రూపులో ఆ మ‌హానుభావుడిని త‌ల‌పించడం సాధ్యం కాని ప‌నే అయినప్ప‌టికీ.. త‌న తండ్రి వేషంలో న‌ట‌న విష‌యంలో మాత్రం బాల‌య్య ఒదిగిపోయి మంచి న‌ట‌న క‌న‌బ‌రిచాడు. ఇక బ‌స‌వ తార‌కంగా విద్యా బాల‌న్ ఆ పాత్ర‌కు, సినిమాకు ప్రాణం పోశారు. సినిమాకు ఆమెను ఎంచుకోవ‌డ‌మే ప్ర‌ధాన బ‌లం. ఎందుకంటే ఇది బ‌స‌వ తార‌కం క‌థ కాబ‌ట్టి. సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఆ త‌ర్వాత సినిమాలో బాగా ఆక‌ట్టుకునేది ఏఎన్నార్ పాత్ర‌. ఏఎన్నార్ గా సుమంత్ చాలా చ‌క్క‌గా ఇమిడిపోయాడు. కొన్ని స‌న్నివేశాల్లో నిజంగా ఏఎన్నారేమో అనేలా ఉన్నాడ‌న్నా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు సుమంత్ కెరీర్ లోనే ఇది బెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. ఈ పాత్ర‌లో త‌న‌ని త‌ప్ప మ‌రో న‌టుడిని కూడా ఊహించుకోలేని స్థాయిలో సుమంత్ మెప్పించాడు. ఎన్టీఆర్ – ఏఎన్నార్ ల అనుబంధం కూడా చాలా బాగా చూపించారు. చంద్ర బాబుగా రానా పాత్ర చివ‌రిలో తార‌స‌ప‌డ‌తాడు. అంటే సెకండ్ పార్ట్ కు ఆ పాత్రే స్ట్రాంగ్ అని తెలుస్తుంది. మిగిలిన వారంద‌రూ క‌నిపించేది రెండు రెండు నిమిషాలే అయినా ఎవ‌రికి వారు మంచి న‌ట‌న క‌న‌బ‌రిచారు.

ఎన్టీఆర్ చ‌రిత్ర‌ను సినిమా తీయాల‌న్న‌ది ఒక గొప్ప ఆలోచ‌న‌. దానికి త‌గిన న‌టీన‌టులు సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు దొరికారు. కథా కథనాల మీద కన్నా బాలయ్య అభిమానులను అలరించే ఎలివేషన్‌ షాట్స్‌ మీదే ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఎన్టీఆర్‌ కథను తెలుసుకోవాలనుకున్న ప్రేక్షకులను నిరాశపరిచినా.. ఫ్యాన్స్‌ను మాత్రం మెప్పించాడు. ముఖ్యంగా కృష్ణుడిగా ఎన్టీఆర్ తెరమీద కనిపించే సన్నివేశానికి థియేటర్లో అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తుంది. సినిమాలో ఎమోష‌న‌ల్ సీన్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాడు ద‌ర్శ‌కుడు. ఎన్టీఆర్- బ‌స‌వ తార‌కం మ‌ధ్య‌ ఉన్న అనుబంధం చూసి అంద‌రికీ ఆశ్చ‌ర్య‌మేసేలా స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించారు. ఏంటి ఒక భ‌ర్త‌.. భార్య‌కు ఇంత‌లా ప్రాధాన్యమిస్తారా? అనిపిస్తుంది. ఎన్టీఆర్ కు అస‌లు రైతు బిడ్డ‌, మ‌న దేశం చిత్రాల్లో ఎలా అవ‌కాశం ద‌క్కింది? తోట రాముడి పాత్ర ఎలా ద‌క్కింది? కృష్ణుడిగా ఎన్టీఆర్ క‌నిపించిన‌ప్పుడు ఎదురైన సంఘ‌ట‌న‌ల‌ను ద‌ర్శ‌కుడు చాలా చక్క‌గా తెరకెక్కించాడు. కొన్ని స‌న్నివేశాల‌కైతే రోమాలు నిక్క‌బొడుచేలా ఉంటాయి. కుటుంబ‌మా? సినిమానా అన్న‌ప్పుడు నాకు సినిమానే ముఖ్య‌మ‌ని ఎన్టీఆర్ ఎందుకు చెప్పాడో ప్రీ ఇంట‌ర్వెల్ సీన్ లో చెప్ప‌డం బావుంది. కొడుకు చ‌నిపోయాడ‌నే వార్త తెలిసినా స‌రే త‌న షాట్ అయిపోయాకే వెళ‌తాడు త‌ప్పించి త‌న వ‌ల్ల నిర్మాత న‌ష్ట‌పోకూడ‌ద‌నే ఉద్దేశంతో షూటింగ్ ఆగిపోకూడ‌ద‌నుకునే ఒక మ‌హాన‌టుడిని తెర‌పై చూస్తాం. అంతా స‌వ్యంగా సాగుతున్న స‌మ‌యంలో అస‌లు ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావ‌డానికి ప్రేరేపించిన అంశాలేంట‌న్న‌ది ప్రీ క్లైమాక్స్ లో క‌నిపిస్తుంది. దివిసీమ ఉప్పెన నేప‌థ్యాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు, గుండెల‌ను మెలి తిప్పేలా చూపించాడు ద‌ర్శ‌కుడు. అభిమానుల‌కు తెలిసిన విష‌యాలు, తెలియ‌ని విష‌యాల‌ను అత్యంత నాట‌కీయంగా, స‌హ‌జంగా ద‌ర్శ‌కుడు తెర‌పైకి తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు. అయితే స‌న్నివేశాల ప‌రంగా ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట్ చేసిన క్రిష్, అన‌వ‌స‌రంగా క‌థ‌ను సాగ‌దీసి, ప్రేక్ష‌కుడి స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టిన‌ట్ల‌నపిస్తుంది. గొప్ప గొప్ప సీన్స్ సైతం వాటి వ‌ల్ల తేలిపోయిన‌ట్ల‌పిస్తుంది.

క‌థ ప‌రంగానే కాదు, సాంకేతికంగానూ ఎన్టీఆర్ రిచ్ గానే తెర‌కెక్కింది. జ్ఞాన శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు రిచ్ నెస్ ను తీసుకొచ్చింది. ప్ర‌తీ ఫ్రేమ్ ఎంతో అందంగా తెరెక్కించాడు. బాహుబ‌లి త‌ర్వాత అదే రేంజ్ లో సంగ‌తాన్ని అందించాడు కీర‌వాణి. పాట‌ల‌తో పాటూ, రీరికార్డింగ్ తో సీన్స్ ను త‌ర్వాతి స్థాయికి తీసుకెళ్లాడు. ఎడిటింగ్ బావుంది కానీ ఎడిట‌ర్ త‌న క‌త్తెర‌కు ఇంకాస్త ప‌దును పెట్టుండాల్సింది. న‌టుడిగానే కాదు బాల‌కృష్ణ నిర్మాత‌గానూ మంచి మార్కులే కొట్టేశాడు. ఎక్క‌డా ఖ‌ర్చుకు వెనుకాడ‌కుండా మంచి నిర్మాణ విలువ‌లు పాటించాడు.

ప్ల‌స్ పాయింట్స్ః
బాల‌కృష్ణ న‌ట‌న‌, విద్యా బాల‌న్ న‌ట‌న‌
ఎన్టీఆర్- బస‌వ తార‌కం మ‌ధ్య స‌న్నివేశాలు
సంగీతం
మాట‌లు

మైన‌స్ పాయింట్స్ః
ర‌న్ టైమ్
ఫ‌స్టాఫ్ లో బాల‌కృష్ణ మేక‌ప్

పంచ్ లైన్ః కాలాన్ని గెలిచిన కార‌ణజ‌న్ముడి క‌థ‌
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here