ట్రైల‌ర్ టాక్ః నా నువ్వే – అంతా కొత్తే

0
228

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ డిఫ‌రెంట్ యాంగిల్ లో, కొత్త లుక్ తో త‌మ‌న్నా తో జంట‌గా ప్ర‌ముఖ యాడ్ ఫిల్మ్ డైర‌క్ట‌ర్ జ‌యేంద్ర ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న ‘నా నువ్వే’ చిత్ర ట్రైల‌ర్ రీసెంట్ గా విడుద‌లైంది. ఇన్ని రోజులు కేవ‌లం త‌న‌కు క‌లిసొచ్చే మాస్ కంటెంట్ మూవీస్ మీదే దృష్టి పెట్టిన క‌ళ్యాణ్ రామ్, మొద‌టిసారిగా త‌న పంథా మార్చి నా నువ్వే అనే కూల్ ల‌వ్ స్టోరీ ద్వారా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌నుకుంటున్నాడు. ఆల్రెడీ టీజ‌ర్, ఆడియోతో మంచి అంచనాల‌ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ట్రైల‌ర్ తో సినిమా మీద మరిన్ని అంచ‌నాల‌ను పెంచేసింది.

రేడియో జాకీగా ప‌నిచేసే మీరా, ఓ కుర్రాడిని చూసి వెంట‌ప‌డుతుంది. కొన్ని రోజుల్లోనే వారిద్ద‌రూ క‌లిసి తిర‌గ‌డం, ప్రేమ‌లో ప‌డ‌టం, విడిపోవాల్సి రావ‌డం, మళ్లీ క‌లుస్తాం అంటూ మీరా వెళ్లడం, త‌న ప్రేమ గురించి రోజూ రేడియోలో చెప్ప‌డం, ఆ టైమ్ లో అది విని ఆ అబ్బాయి మీరాను వెతుక్కుంటూ రావ‌డం, ఈ నేప‌థ్యంలో వారి ప్రేమ చేసిన సాహ‌సం ఏంటి అనే దాని చుట్టూనే ‘నా నువ్వే’ క‌థంతా తిరుగుతుంది. ప్రేమ‌కు, ఎమోషన్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, వాటికి రిలేటెడ్ గా జ‌రిగే సన్నివేశాలపైనే ట్రైలర్ ను కట్ చేసి, మొత్తానికి చాలా రోజుల త‌ర్వాత ఒక ఫీల్ గుడ్ మూవీని చూడ‌బోతున్నామ‌నే ఫీల్ ను కలిగించారు. ఇన్నాళ్లూ త‌న రొటీన్ యాక్టింగ్ తో విసుగు తెప్పించిన త‌మ‌న్నా, త‌న‌లోని యాక్టింగ్ మొత్తాన్ని ఈ సినిమాతో మ‌రోసారి బ‌య‌ట‌పెట్టి, త‌న అందాల‌ను కూడా బాగానే ఆర‌బోసిన‌ట్లు క‌నిపిస్తుంది.

180 లాంటి డిఫ‌రెంట్ సినిమాను తెర‌కెక్కించిన జ‌యేంద్ర, మ‌రోసారి ఈ సినిమాతో కూడా మంచి పేరు తెచ్చుకునేలా క‌నిపిస్తున్నాడు. ఇలాంటి రొమాంటిక్ సినిమాల‌కు ఎంతో అంద‌మైన విజువ‌ల్స్ కూడా అవ‌స‌ర‌మే. విజువ‌ల్స్ విష‌యంలో పీసీ శ్రీరామ్ ప్ర‌తీ ఫ్రేమ్ క‌ళ్లు చెదిరిపోయేలా తెర‌కెక్కించాడు. షరెత్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ట్రైల‌ర్ కు మంచి మూడ్ ను క్రియేట్ చేసింది.

మ‌రి తొలిసారి క‌ళ్యాణ్ రామ్ చేస్తున్న ప్ర‌య‌త్నం ఏమవుతుందో, ఎన్నాళ్ల నుంచో స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తున్న క‌ళ్యాణ్ రామ్ కు, త‌మ‌న్నా కు ఈ చిత్రం ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో తెలియాలంటే మే 25 వ‌ర‌కు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here