సిద్ధార్థ కూడా ఫెయిల్ అయినట్లేనా..?


స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ వైపు రావాల‌ని ఎవ‌ర‌కు మాత్రం కోరిక ఉండ‌దు చెప్పండి, బుల్లి తెర‌పై త‌న స‌త్తా చాటుకుని, వెండితెర పై కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌నే ప్ర‌య‌త్నంలో భాగంగానే చ‌క్ర‌వాకం, మొగలిరేకులు సీరియ‌ల్స్ తో టీవీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న సాగ‌ర్ చేసిన ప్ర‌య‌త్న‌మే సిద్దార్థ‌. రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మించిన చిత్రం సిద్దార్థ. లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రూపొందింది. దయానంద్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాక్షి చౌదరి, రాగిణి నంద్వాని లు సాగ‌ర్ స‌ర‌స‌న న‌టించారు. 
మొద‌టి నుంచి మాస్ సినిమాలు చూసీ చూసీ జ‌నాల‌కు కూడా బోర్ కొట్టేసిన‌ట్లుంది. అందుకే కేవ‌లం యాక్ష‌న్ ను మాత్ర‌మే న‌మ్ముకుని, సినిమాలు తీస్తే పెద్ద పెద్ద స్టార్ హీరోల‌కు, వాళ్ల వారసుల‌కే ప‌రాజ‌యాలు త‌ప్ప‌డం లేదు, అలాంటిది ఒక బుల్లితెర న‌టుడిని తీసుకొచ్చి ఒక యాక్ష‌న్ సినిమాను తీయ‌డం ఏంటో జ‌నాల‌కు ఏమీ అర్థం కావ‌డం లేదు. ప్ర‌స్తుత కాలంలో ఇలాంటి సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రించ‌ర‌ని మాగ్జిమ‌మ్ హీరోలంద‌రికీ తెలుసు. సో ఎలాగైనా ఈ సినిమా కొత్త హీరోతోనే చేయాలి. అదేదో కొత్త హీరోతో చేసే బ‌దులు, టీవీ ఆడియ‌న్స్ లో సాగ‌ర్ కు మంచి ఫాలోయింగ్ ఉంది కాబ‌ట్టి, సిద్దార్థ సినిమాకు సాగ‌ర్ తో లాగించేసి, ఇటు సాగ‌ర్ ను వెండి తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నామ‌న్న పేరు కూడా కొట్టేయొచ్చు అనుకున్న‌ట్లున్నారు నిర్మాత‌లు. సినిమా మొద‌లు పెట్టిన ద‌గ్గ‌ర నుంచి సిద్దార్థ పై హైప్ తీసుకొచ్చేందుకు మూవీ యూనిట్ చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. కానీ పాపం వాళ్ల ప్ర‌య‌త్నాలు మాత్రం ఫ‌లించ‌లేదు. 
రామ‌దూత క్రియేష‌న్స్.. ఈ బ్యాన‌ర్ లో  ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన సినిమాలేవీ, హిట్ట‌యిన దాఖ‌లాలు లేవు. జీనియ‌స్, రామ్ లీల ఇలాంటి సినిమాల‌న్నీ వ‌చ్చిన‌ట్టు కూడా స‌రిగా ఎవ‌రికీ తెలియ‌దు. ఇప్పుడు సిద్ధార్థ విష‌యంలో కూడా ఇదే రిపీట‌వుతుంది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డిన‌ప్ప‌టికీ, ప్ర‌మోష‌న్లు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. అంటే సినిమా అవుట్ పుట్ చూసి, కావాల‌నే ఈ సినిమాకు ఇంకా ఎక్కువ ఎందుకులే ఖ‌ర్చు చేయ‌డం అనుకున్నారా అనే అనుమానాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. 
సినిమా ట్రైల‌ర్లు ప్రామిసింగ్ గా ఉన్నాయి అంటే ఎందుకు ఉండ‌వు, లీడింగ్ టెక్నీషియ‌న్స్ మ‌ణిశ‌ర్మ‌, ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ లాంటి వాళ్ల హ‌స్తం ఈ సినిమాలో ఉంటే ట్రైల‌ర్ కూడా బాగాలేక పోతే ఇక వేస్ట్. ట్రైల‌ర్ క్వాలిటీ కి వాళ్లే కార‌ణం త‌ప్ప‌, కంటెంటో మ‌రేదో మాత్రం కాదు. ఇక సాగ‌ర్ న‌ట‌న గురించి చెప్పాలంటే, త‌న‌ను స‌డ‌న్ గా ఒక సినిమా ట్రైల‌ర్ లో హీరోగా చూడాలంటేనే ఏదోలా ఉంది. చూద్దాం ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది స్మాల్ స్క్రీన్ నుంచి వెండితెర వైపు రావ‌డానికి ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ, అందులో చెప్పుకోద‌గ్గ విజ‌యం సాధించిన వారెవ‌రూ లేదు. సాగ‌ర్ ఆర్ కె నాయుడిగా అభిమానుల‌కు గుర్తిండి పోతాడో లేక సిద్దార్థ గా ప్రేక్ష‌ల‌కుల‌ను మెప్పిస్తాడో చూడాలంటే మ‌రో రెండు రోజులు ఆగాల్సిందే. 
 
 


Follow Us