సినిమా కళామతల్లికి కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలి!


"ఈ ప్రపంచంలో తల్లిని గౌరవించుకొనేందుకు "మదర్స్ డే" ఉంది, తండ్రిని గౌరవించుకొనేందుకు "ఫాదర్స్ డే" ఉంది. కానీ.. భాష, వయసు, కులం, మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కర్ని ఆదరించే సినిమా కళామతల్లిని గౌరవించుకొనేందుకు మాత్రం ఏడాది మొత్తానికి ఒక్కటంటే ఒక్క ప్రత్యేకమైన రోజు కూడా లేదు". ఈ విషయాన్ని ఇండస్ట్రీలోని పెద్దలందరూ గ్రహించి.. ఒక ప్రాముఖ్యత ఉండేలా "సినిమా డే"ను నిర్ణయించి, ఆ రోజున ఇండస్ట్రీలోని 24 క్రాఫ్టులకు చెందిన నటీనటులు, టెక్నిషియన్లు సోషల్ స్టేటస్ తో సంబంధం లేకుండా ఒకే రకమైన దుస్తులు ధరించి.. ఆ రోజును ఎంతో హుందాగా పండుగలా జరుపుకోవాలన్నది తమ ఆశయమని.. ఈ ఆశయాన్ని ఇండస్ట్రీ పెద్దలు గుర్తించాలని సీనియర్ ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ లు కోరారు. 
హైదరాబాద్, ఫిలిం చాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్-లక్ష్మణ్ లు మాట్లాడుతూ.. "అసలేం చేయాలో పాలుపోని స్థితిలో ఫైటర్లుగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాం. ఆ తర్వాత ఫైట్ మాస్టార్లుగా ఎదిగాం. మా ఎదుగుదలకు ఇండస్ట్రీయే కారణం. అటువంటి ఇండస్ట్రీకి మనం ఏం చేసాం? అని మమ్మల్ని మేం ప్రశ్నించుకొన్నప్పుడు "ఏమీ చేయలేదు" అనిపించింది. అందుకే.. మదర్స్ డే, ఫాదర్స్ డే తరహాలో సినిమా కోసం ఒక ప్రత్యేకమైన రోజును ప్రకటించి.. ఆ రోజున ఇండస్ట్రీ మొత్తం ఏకమై.. "కళామతల్లిని పూజించుకొందాం" అన్న ఆలోచన వచ్చింది. ఈరోజు ఆ ఆలోచనను మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. మా ఈ ఆలోచనను ఇండస్ట్రీ పెద్దలు గ్రహించి, గుర్తించి "సినిమా డే" అనే ఓ ప్రత్యేకమైన రోజును ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాం" అన్నారు.


Follow Us