ఆలోచింపజేసే బ్రాహ్మణ


పుష్కలంగా వినోదాన్ని పంచుతూనే... ఆలోచింపజేసే చిత్రం "బ్రాహ్మణ" -చిత్ర దర్శకుడు- "దండుపాళ్యం" ఫేమ్ శ్రీనివాస్ రాజు
"ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు" 'సాధారణంగా. మన తెలుగువాడైన శ్రీనివాస్ రాజు మాత్రం రచ్చ గెలిచి ఇంట గెలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. శ్రీనివాస్ రాజును దర్శకుడిగా పరిచయం చేస్తూ కన్నడలో రూపొందిన "దండుపాళ్యం" ఆ భాషలో మాత్రమే కాదు.. తెలుగులోనూ సంచలన విజయం సాధించింది. నిజానికి అప్పటినుంచే, కన్నడ సినిమాలు తెలుగులో అనువాదమవ్వడం ఎక్కువయ్యింది. ఎందుకంటే.. కన్నడలో ఎంత పెద్ద హిట్టయిన సినిమాలైనా.. తెలుగులో ఆడకపోవడమన్నది అప్పటివరకు ఓ ఆనవాయితీగా ఉండేది. . కానీ.. "దండుపాళ్యం" ఆ ఆనవాయితీని అంతర్ధానం చేసేసింది. "దండుపాళ్యం" వంటి సంచలన విజయం తర్వాత శ్రీనివాస్ రాజు "శివమ్" పేరుతో కన్నడలో రూపొందించిన చిత్రం కర్ణాటకలో రెట్టింపు సంచలనం సృష్టించింది. ఆ చిత్రం తెలుగులో "బ్రాహ్మణ" పేరుతో జులై 8, శుక్రవారం విడుదలవుతోంది. ఉపేంద్ర, సలోని, రాగిణీ ద్వివేదీ, గీత, రవిశంకర్ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు. "బ్రాహ్మణ" విడుదలను పురస్కరించుకొని చిత్ర దర్శకులు శ్రీనివాస్ రాజు మాట్లాడుతూ.. "దురదృష్టవశాత్తూ మన దేశంలో మెజారిటీ మతస్తుల పట్ల ఒకలా.. మైనారిటీ మతస్తుల పట్ల మరొకలా.. మన ప్రభుత్వాలు వ్యవహరిస్తుంటాయి. "ఓటు బ్యాంక్ రాజకీయాలు" ఇందుకు కారణం. "దండుపాళ్యం" తర్వాత ఉపేంద్రతో నేను తీసిన "శివమ్" చిత్రం వివాదాస్పదం కావడానికి కారణం కూడా మన ప్రభుత్వాలు అనుసరించే పైన పేర్కొన్న ద్వంద్వ విధానాలే. ఒక గుడి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి మేము ముందు పెట్టిన "బసవన్న" అనే పేరును... మా పీక మీద కత్తి పెట్టి మార్పించడమే కాకుండా- సెన్సార్ పరంగా మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మన భారతీయ సినిమా చరిత్రలోనే.. మునుపెన్నడూ లేనివిధంగా.. కర్ణాటక అసెంబ్లీలో జీరో అవర్ (శూన్య గంట)లో ఈ చిత్రం గురించి చర్చించారు. అయితే విజ్ఞులైన కన్నడ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరధం పట్టారు. ఉపేంద్ర కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టడమే కాకుండా.. బ్లాక్ బస్టర్ గా నిలిచిందీ చిత్రం. తెలుగులో "బ్రాహ్మణ" పేరుతో వస్తున్న ఈ చిత్రం ఇక్కడ.. కన్నడలో కంటే ఘన విజయం సాధిస్తుందని కాన్ఫిడెంట్ గా చెప్పగలను. నిర్మాతలు "విజయ్, మహేష్, కేశవులునాయుడు" ఈ చిత్రాన్ని ఎంతో ప్రేమిండంతోపాటు.. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విడుదల చేస్తున్నారు. వారి శ్రమకు తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది" అన్నారు. ప్రస్తుతం "దండుపాళ్యం-2" రూపకల్పనలో తలమునకలై ఉన్న శ్రీనివాస్ రాజు- తన తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ.. "దండుపాళ్యం-2" తర్వాత "18 ప్లస్ సినిమా" (ఎయిటీన్ ప్లస్ సినిమా) పేరుతో ఓ హారర్ ఎంటర్ టైనర్ ప్లాన్ చేస్తున్నాను. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కించబోతున్నాను. ఆ తర్వాత "రామ జన్మభూమి" నేపథ్యంలో ఓ చిత్రం తీయనున్నాను" అని తెలిపారు!!


Follow Us