‘Mallesham’ Movie Review

0
957
ఆప‌ద‌ల్లో ఉన్న‌ప్పుడు అన్నీ దారులు మూసుకుపోయిన‌ప్ప‌టికీ, ఆ సంద‌ర్భంలో ధైర్యంగా ఉండి ఆలోచిస్తే వేరే దారి తెరిచే ఉంటుంద‌ని చెప్పే హృద్య‌మైన క‌థే ‘మ‌ల్లేశం’. చేనేత కార్మికుల బ‌తుకు సిత్రాల‌ను చిత్రంగా మ‌లిచి, అనాదిగా బ్రతుకుతున్న ప్ర‌వాహానికి ఎదురీదుతున్నకార్మికుల శ్ర‌మ‌ను, క‌ళ్లు చెమ‌ర్చేలా రంగుల ప్ర‌పంచానికి చూపించడానికి చేసిన ప్ర‌య‌త్న‌మే మ‌ల్లేశం. చేనేత రంగంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సాధించుకున్న చింత‌కింది మ‌ల్లేశం జీవిత చ‌రిత్రనే మ‌ల్లేశంగా రూపొందించారు. ఇప్ప‌టివ‌ర‌కూ, హీరో ఫ్రెండ్ రోల్స్ మాత్ర‌మే చేసుకుంటూ వ‌చ్చిన ప్రియ‌ద‌ర్శి మొట్ట‌మొద‌టి సారిగా హీరో పాత్ర అయిన మ‌ల్లేశం గా న‌టించాడు. మ‌రి ఈ మ‌ల్లేశం ప్రియ‌దర్శి కి ఎంత‌వ‌ర‌కూ క‌లిసొచ్చిందో స‌మీక్ష‌లో చూద్దాం.
1980-1990 ల మ‌ధ్య కాలంలో న‌ల్గొండ జిల్లాలోని చిన్న గ్రామంలో మ‌ల్లేశం కుటుంబం నేత ప‌ని చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. దాదాపు ఆ ఊరు మొత్తం కూడా అదే జీవ‌న వృత్తి మీద ఆధార‌ప‌డి బ్ర‌తుకుతూ, అప్పుల్లో కూరుకుపోయి ఉంటారు. మ‌ల్లేశం అమ్మ చిన్న‌ప్ప‌టి నుంచి ఆసు ప‌ని చేయ‌డంతో భుజం ప‌డిపోయే స్థితికి వ‌స్తుంది. ఆ పని చేసే అందరిదీ ఇంచుమించు ఇదే ప‌రిస్థితి. ఎలాగైనా అమ్మ‌కు ఈ క‌ష్టాలు దూరం చేయాల‌ని భావించిన మ‌ల్లేశం తన ఆలోచ‌న‌ల‌తో ఆసుయంత్రాన్ని త‌యారుచేయాల‌ని నిర్ణ‌యించుకుని దాని కోసం ఊరంతా అప్పులు చేస్తాడు. ఆ యంత్రం త‌యారు చేయాల‌ని చూస్తున్న మ‌ల్లేశాన్ని చూసి ఊర్లో వారంతా ఎగ‌తాళి చేసేవారు. అయినా అవ‌న్నీ ప‌ట్టించుకోకుండా ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా దాని మీద ప్ర‌య‌త్నాలు చేస్తూంటాడు. పెళ్లి చేస్తే అయినా బాగుప‌డ‌తాడ‌ని భావించిన అత‌డి త‌ల్లిదండ్రులు మ‌ల్లేశానికి పెళ్లి చేస్తారు. మొద‌ట పెళ్లి ఇష్టం లేద‌ని చెప్పినా, పెళ్లి కూతురు త‌ను ప్రేమిస్తున్న మ‌ర‌ద‌ల ప‌ద్మ (అన‌న్య‌) అవ‌డంతో పెళ్లికి ఒప్పుకుంటాడు. ప‌ద్మ కూడా ఆసుయంత్రం చేయ‌మ‌ని ప్రోత్స‌హిస్తుంది. అయితే ఓసారి ఆసుయంత్రాన్ని ప‌రీక్షించబోతే మోట‌ర్ పేలిపోతుంది. దాంతో అప్పులోల్లు అంద‌రూ ఇంటిమీద‌కు వ‌స్తారు. ఈ విష‌యంపై మొద‌టిసారి మ‌ల్లేశం అమ్మ కూడా మంద‌లిస్తుంది. అయినా స‌రే ఆసుయంత్రం చేయాల్సిందేన‌ని, అందుకు డ‌బ్బు కావాల‌ని భార్య న‌గ‌లు ఇవ్వ‌మంటాడు. అవి త‌న‌కు పుట్టింటి వారు ఇచ్చిన‌వ‌ని , త‌న‌కు మిగిలింది ఇవొక్క‌టే అని అన‌డంతో మాటా మాటా పెరిగి గొడ‌వ పెద్ద‌వ‌వుతుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మ‌ల్లేశం అప్పుల బాధ‌లు తట్టుకోలేక, త‌ల్లి కూడా మంద‌లించ‌డం, భార్య కూడా కూడా సాయం చేయకపోవడంతో ఆత్మహత్యయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మల్లేశం అసలు ఆసు యంత్రాన్ని ఎలా తయారుచేశాడు? అనేది మిగతా కథ
ఏదైనా ఒక క‌థను ముందుకు న‌డిపించ‌డానికి దానికి త‌గ్గ న‌టీన‌టులు అవ‌స‌రం. త‌మ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను కూడా ఆ పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్రవేశం చేయించే న‌టులు దొరికిన‌ప్పుడే అది సాధ్య‌మ‌వుతుంది. మ‌ల్లేశానికి అటువంటి న‌టీన‌టులే దొరికారు. మ‌ల్లేశం పాత్ర‌లో ప్రియ‌ద‌ర్శి, ప‌ద్మ క్యారెక్ట‌ర్ లో అన‌న్య‌, ల‌క్ష్మి రోల్ లో ఝాన్సీ… ఎవ‌రికి వారు త‌మ‌కు తామే పోటీ పెట్టుకుని న‌టించారు. త‌న అనుభ‌వంతో ఝాన్సీ ఆక‌ట్టుకుంటే, ప్రియ‌ద‌ర్శి, అన‌న్య లు మాత్రం ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేశారు. ఇప్ప‌టివ‌ర‌కు ప్రేక్ష‌కుల‌కు క‌మెడియెన్ గా మాత్ర‌మే ప‌రిచ‌య‌మున్న ప్రియ‌ద‌ర్శి, ఈ సినిమాతో ప్రేక్ష‌కుల చేత కంట‌త‌డి పెట్టిస్తాడు. మ‌ల్లేశం పాత్ర‌కు అవ‌మానాలు జ‌రిగితే, చూస్తున్న ప్రేక్ష‌కుడికి కోపం వ‌చ్చేంత‌గా ఆ పాత్ర‌లో ప్రియ‌ద‌ర్శి లీన‌మైపోయాడు. ఇక అన‌న్య అయితే క‌ళ్ల‌తోనే అన్నీ భావాల‌ను ప‌లికించింది. ఆట‌పట్టించే భార్య‌గా, ఆటుపోట్ల‌లో తోడుగా నిలిచే ఇల్లాలిగా అందరితోనే మంచి మార్కుల్నే వేయించుకుంది. ప‌ద్మ పాత్ర‌ను కొన్నాళ్ల పాటూ గుర్తుండిపోయేలా అన‌న్య ఈ పాత్ర‌ను పోషించింది. మిగిలిన న‌టీన‌టులు త‌మ త‌మ పరిధుల మేర‌కు బాగానే చేశారు.

బయోపిక్‌ తీయడం అంటే ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. ఎన్నో ఆంక్షల మధ్య తీయాల్సి వస్తుంది. పైగా ఆ కథను నడిపించేవాడు సరిగ్గా ఉండాలి. కథకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడంలోనే మొదటి విజయం ఉంటుంది. అందులోనే మల్లేశం దర్శకుడు రాజ్‌ ఆర్‌ ప్రతిభ కనపడుతుంది. మొదటిసారి పూర్తిగా తెలంగాణ నేతన్నల సమాజాన్ని తెరపై ఆవిష్కరించాడు. తెలంగాణ యాస అంటే కేవలం నవ్వించిడమే కాదు.. ఏడిస్తుంది, దానికి కూడా అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయని చూపించాడు. చిన్నతనం నుంచే అమ్మ కష్టాలను దూరం చేయాలని ఆలోచన నుంచి.. ఆసు యంత్రం కనిపేట్టే వరకు మల్లేశం జీవితంలో జరిగిన అంతర్మథనం, పడిన కష్టాలు అన్నింటిని ఒక సినిమాలో చూపించడం అసాధ్యం. అయినా దర్శకుడు ఈ విషయంలో సక్సెస్‌ అయ్యాడు. అప్పుల బాధలు తట్టుకోలేక, ఇంట్లో చీరలు నేయడం మానేసి హైదరాబాద్‌కు వచ్చి జీవనం సాగిస్తాడు మల్లేశం. ఊరి మనుషులు, అక్కడి వాతావరణం తప్ప ఇంకోటి తెలియని మల్లేశం అక్కడ ఎలా జీవనం సాగించాడనే విషయాలు బాగా చూపించాడు. కనీసం పూలు అమ్మడం కూడా రాని మల్లేశంను చూస్తే నవ్వొచ్చినా.. ఆ తరువాత జాలేసేలా చూపించాడు దర్శకుడు. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని మల్లేశంతో పాటే ప్రయాణించేలా చేయడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. అప్పటి పల్లెవాతావరణాన్ని తెరపై సినిమాటోగ్రఫర్‌ అందంగా చూపించాడు. మార్క్ కె రాబిన్‌ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పాటలు సన్నివేశానికి తగ్గట్టుగా వచ్చి వెళ్లిపోతూ ఉంటాయి. మల్లేశం జీవితాన్ని గుండెకు హత్తుకునేలా చూపించేందుకు ఎడిటర్‌ కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
క‌థ‌
ద‌ర్శ‌క‌త్వం
న‌టీన‌టుల న‌ట‌న‌

మైన‌స్ పాయింట్స్ః
స్లో నెరేష‌న్

పంచ్‌లైన్ః హృద‌యాల‌ను హ‌త్తుకునే మ‌ల్లేశం
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here