‘మ‌జిలీ’ మూవీ రివ్యూ

0
595

‘జీవితం మనకెన్నో అవకాశాలని ఇస్తుంది. మనం జీవితానికి ఒక అవకాశమిద్దాం’ అనే ఒక చిన్న లైన్ ను తీసుకుని దాన్ని సినిమాగా మ‌లిచి.. టాలీవుడ్ కు ”నిన్ను కోరి” లాంటి మంచి సినిమాను అందించిన శివ నిర్వాణ ఇప్పుడు భార్యా భ‌ర్త‌ల బంధంతో ‘మ‌జిలీ’ ను తెర‌కెక్కించాడు. దానికి ఏ మాయ చేశావె లాంటి క‌ల్ట్ క్లాసిక్ కు త‌మ న‌ట‌న‌తో ప్రాణం పోసిన రియ‌ల్ లైఫ్ పార్ట‌న‌ర్స్ నాగ‌చైత‌న్య‌, స‌మంతల‌ను ప్ర‌ధాన తారాగ‌ణంగా ఎంచుకోవ‌డంతో సినిమాకు మొద‌టి నుంచే మంచి బ‌జ్ క్రియేట్ అయింది. దాన్ని టీజ‌ర్, పాట‌లు, ట్రైల‌ర్ల‌తో మ‌రింత పెంచేశారు. మ‌రి ఈ అంచ‌నాల‌న్నింటినీ ‘మ‌జిలీ’ నిల‌బెట్టుకుందా? పెళ్లి త‌ర్వాత నాగ చైత‌న్య‌, స‌మంత క‌లిసి న‌టించిన మొద‌టి చిత్రం కూడా ఇదే కావ‌డంతో వారు కూడా ఈ చిత్రం మీద చాలా అంచ‌నాలే పెట్టుకున్నారు. చైతూ, స‌మంతల ఖాతాలో మ‌రో హిట్ ప‌డిందా లేదా అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.

తాను ప్రేమించిన అమ్మాయి త‌న‌కు ద‌క్క‌కుండా ఎవ‌రో ఇంకో అమ్మాయితో జీవితాన్ని పంచుకోవ‌డం అస‌లు ఇష్టం లేని క్యారెక్ట‌ర్ లో నాగ చైత‌న్య చాలా సెటిల్డ్ పెర్ఫామెన్స్ క‌న‌బ‌రిచాడు. రొమాంటిక్ సీన్స్ లోనూ, ఎమోష‌న‌ల్ సీన్ల‌లోనూ.. మాస్ సీన్ల‌లోనూ త‌న‌దైన స్టైల్ లో ఆక‌ట్టుకుంటాడు. ద‌ర్శ‌కుడు చెప్పిన‌ట్లు సినిమా చూసిన త‌ర్వాత పూర్ణ(నాగ చైత‌న్య‌) ఎక్క‌డైనా క‌నిపిస్తే త‌న‌ను కౌగిలించుకుని త‌న బాధను పంచుకోవాలి అనిపించేంత బాగా ఆ క్యారెక్ట‌ర్ లో ఇమిడిపోయాడు చైతూ. ఇక స‌మంత పాత్ర సినిమాకు ప్రాణం పోసింది. త‌ను ఎన్ని బాధ‌లు ప‌డినా త‌ను ఇష్ట‌ప‌డి చేసుకున్న త‌న భ‌ర్త ఏ బాధలు ప‌డ‌కుండా సంతోషంగా ఉంటే చాల‌నుకునే క్యారెక్ట‌ర్ లో త‌న న‌ట‌న, హావ భావాలు అద్భుతం. అటు త‌న భ‌ర్త ప్రేమ‌ను పొందాల‌న్న తాప‌త్ర‌యం, మ‌రోవైపు ఏం చేస్తే ఆ ప్రేమను పొందుతానో అనే ఆశ‌.. అన్నింటికీ మించి ఏం జ‌రిగినా జీవితాంతం త‌న భ‌ర్త‌తో ఉండాల‌న్న కోరిక.. ఇలా ప్ర‌తీ సన్నివేశంలోనూ స‌మంత న‌ట‌న ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటుంది. దివ్యాన్ష కు కూడా కీల‌క స‌న్నివేశాల్లో చాలా స‌హ‌జంగా న‌టించి.. మంచి మార్కులే కొట్టేసింది. ఇక రావు ర‌మేష్, పోసాని లు బాధ్య‌త గ‌ల తండ్రులుగా మ‌రో సారి మంచి పాత్ర‌లు పోషించారు. త‌మ క‌ళ్ల ముందే పిల్ల‌ల జీవితాలు చ‌క్క‌గా లేక‌పోయినా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్న తండ్రులుగా బాగా న‌టించారు. హీరో ఫ్రెండ్ గా సుహాస్ కు మంచి పాత్ర ద‌క్కింది. కీల‌కమైన పాత్ర‌లో న‌వికా కొటియా కొద్ది సేపే క‌నిపించినా త‌న పాత్ర గుర్తుండిపోయేలా ఉంటుంది. అతుల్ కుల‌క‌ర్ణి మ‌రోసారి మంచి పాత్ర‌తో మెప్పించాడు. మిగిలిన పాత్ర‌లు త‌మ త‌మ ప‌రిధుల్లో బాగా చేశారు.

ఈ మెచ్యూర్డ్ ల‌వ్ స్టోరీ చాలా స‌హ‌జ‌మైన క్యారెక్ట‌ర్ల‌తో… అంద‌రం చాలా ద‌గ్గ‌ర‌య్యే ఫీల‌య్యే సంఘ‌ర్ష‌ణ‌ల‌తో, గుండెల‌కు హ‌త్తుకునే భావోద్వేగాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. మ‌నుషుల మ‌ధ్య జ‌రిగే ఒక అంశాన్ని తీసుకుని దాన్ని సున్నితంగా చెప్పిన ద‌ర్శ‌కుడు తీరుని ఖ‌చ్చితంగా అభినందించాల్సిందే. తన ద‌గ్గ‌రున్నక‌థ‌కు త‌గ్గ న‌టుల‌ను ఎంచుకోవ‌డంలోనే ద‌ర్శ‌కుడు స‌గం స‌క్సెస్ అయ్యాడు. క‌థ‌ను న‌డిపించే మూడు పాత్ర‌లు నాగ చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాన్ష త‌మ త‌మ పాత్ర‌ల్లో లీన‌మైపోయారు. అస‌లు వాళ్ల‌కు నిజంగా ఆ సిట్యుయేష‌న్ వ‌చ్చిందేమో అని అనుమానం క‌లిగించేంత‌గా న‌టించారు. అంద‌రూ నిజ జీవితంలో చాలా సార్లు చూసిన క‌థే అయినా మ‌జిలీ ప్రేక్ష‌కుడి మ‌నసుని గెలిచేస్తుంది. హృద‌యాల్ని సృశిస్తుంది. క‌ళ్లు చెమ్మ‌గిల్లేలా చేస్తుంది. ఒక ఎమోష‌ల్ ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ ని తీసుకున్న శివ నిర్వాణ దాన్ని చాలా స‌హ‌జంగా చూపించాడే త‌ప్ప ఎక్క‌డా లిబ‌ర్టీ తీసుకుని సినిమాటిక్ ఎమోష‌న్స్ జోలికి పోలేదు. మామూలుగా నిజ జీవితంలో ప్రేమ‌కు, దాంప‌త్య జీవితానికి ఎలాంటి ప‌రిస్థితులు, ఆటంకాలు ఎదుర‌వుతాయో అలాంటివే చూపించాడు త‌ప్ప ఏదో స‌న్నివేశాలు బాగా బ‌లంగా ఉండాల‌ని కొత్త‌గా క్రియేట్ చేయ‌క‌పోవ‌డంతో మ‌నం చూస్తున్న‌ది సినిమా కాదు మ‌న క‌ళ్ల ముందు జ‌రిగే ఒక మామూలు ప్రేమ క‌థే అనిపించేలా ఉంటుందీ మ‌జిలీ. అయితే ఏం చేసినా, ఎలా చూపించినా దాన్ని ప్రేక్ష‌కుడు క‌న్విన్స్ అయ్యేలా చెప్పిన‌ప్పుడే ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయినట్లు లెక్క‌. గ‌తాన్నిప్ర‌స్తుతంతో పోల్చుకోవడం, స‌మంత ప్రేమ‌ను చూసి నాగ చైత‌న్య కు వ‌చ్చే రియ‌లైజేష‌న్ వ‌చ్చే ప్రీ క్లైమాక్స్ , చివ‌ర‌లో చైతూ- స‌మంత ల మ‌ధ్య వ‌చ్చే సంభాష‌ణ‌ అన్నీ చ‌క్క‌గా కుదిరి సినిమాను మంచి క్లైమాక్స్ దిశ‌గా న‌డిపించేలా చేశాడు.

విష్ణు శ‌ర్మ క‌థ మూడ్ కు త‌గ్గట్లు సినిమాటోగ్ర‌ఫీని చాలా బాగా మెయింటెయిన్ చేశాడు. సంద‌ర్భానుసారంగా వచ్చే అన్నీ పాట‌లూ బావున్నాయి. గోపీ సుంద‌ర్ మ‌రోసారి మంచి మ్యూజిక్ తో ఆక‌ట్టుకున్నాడు. త‌న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల్ని మ‌రో స్థాయికి తీసుకెళ్లాడు థ‌మ‌న్. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే మంచి రీరికార్డింగ్ ఇచ్చి సినిమాకు ప్రాణం పోశాడు. ఎడిటింగ్, నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
నాగ చైత‌న్య‌, స‌మంత ల న‌ట‌న‌
ద‌ర్శ‌క‌త్వం
సంగీతం
ఎమోష‌న‌ల్ సీన్స్

మైన‌స్ పాయింట్స్ః
స్లో నెరేష‌న్

పంచ్‌లైన్ః ప్రేమ మ‌జిలీ హాయి
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.5/5