‘మ‌హ‌ర్షి’ మూవీ రివ్యూ

0
892
‘భ‌ర‌త్ అనే నేను’ లాంటి మంచి సినిమా త‌ర్వాత సూపర్ స్టార్ మ‌హేష్ లాంటి హీరో.. మంచి అభిరుచి గ‌ల ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి.. వీరిద్ద‌రి క‌లయిక లో సినిమా వ‌స్తుందంటే దానిపై ఉండే అంచ‌నాలే వేరు. అలాంటి సినిమాల‌కు బిజినెస్ ప‌రంగా ఎలాంటి ఢోకా ఉండ‌దు. క్రేజ్ కు లోటుండ‌దు కదా అని లైట్ తీసుకుని స‌రైన సినిమా ఇవ్వ‌క‌పోతే భారీ అంచ‌నాలు త‌ల‌కిందులైపోయి కోటానుకోట్లు గ‌ల్లంతైపోతాయి. అందుకే వారి జ‌ర్నీకి ”ఫుల్‌స్టాప్స్” లేకుండా ”స‌క్సెస్” మాత్ర‌మే కావాలంటే ఖ‌చ్చితంగా భ‌యం లేకుండా క‌థ‌ను న‌మ్మి ప్రేమించి ప‌నిచేయ‌డ‌మే.. మ‌రి వారి జ‌ర్నీ స‌క్సెస్ దిశ‌గా సాగిందా లేదా వారి స‌క్సెస్ కు ఫుల్ స్టాప్ ప‌డిందా అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.
ఈ కథ ఫారిన్‌లో ప్రారంభమవుతుంది. రిషి (మహేష్ బాబు) ఆరిజిన్‌ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. తరువాత ఫ్లాష్‌ బ్యాక్‌ మొదలవుతుంది. వైజాగ్ ఐఐఈటీలో జాయిన్‌ అయిన రిషికి, రవి (అల్లరి నరేష్‌), పూజ (పూజా హెగ్డే)లు పరిచయం అవుతారు. ముగ్గురి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్‌ లైఫ్ ముగుస్తుంది. చ‌దువులు పూర్త‌య్యాక ముగ్గురూ విడిపోతారు. ప్రపంచాన్ని గెలవలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్లిపోతాడు. అనుకోని ప‌రిస్థితుల్లో రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలిసి, వెంట‌నే ఇండియాకు బ‌య‌లుదేర‌తాడు?  కాలేజీలో అంత గొప్ప స్నేహితులైన వారు త‌ర్వాత ఎందుకు విడిపోతారు? ర‌వి గురించి రిషి తెలుసుకున్న విష‌యాలేంటి?  వారి జ‌ర్నీ ఏంట‌న్న‌దే మిగ‌తా క‌థ‌.
త‌న నుంచి ప్రేక్ష‌కులు ఎలాంటి సినిమాను ఆశిస్తున్నార‌ని, త‌మ అభిమాన హీరో ల్యాండ్ మార్క్ సినిమాపై వుండే అంచ‌నాలు ఏ స్థాయిలో ఉంటాయనేది ద‌ర్శ‌కుడు వంశీ కి తెలుసిన‌ప్ప‌టికీ.. ఆడియ‌న్స్ కు మంచి విందు భోజనం పెడ‌దామ‌ని అనుకుని,వాళ్ల అంచ‌నాల‌కు త‌గ్గ సినిమాని అందించ‌డానికి తాను మూడేళ్లు క‌ష్ట‌ప‌డ్డాడ‌ని, అందుకే కాబోలు కొంచెం ఎక్కువ సేపే సినిమాను సాగ‌దీసి సాగ‌దీసి ప్రేక్ష‌కుల స‌హ‌నానికి మూడు గంట‌ల పాటూ ప‌రీక్ష పెట్టాడు.  ఒక స్ట్రాంగ్ కాన్‌ఫ్లిక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నద‌ర్శ‌కుడు, దానికి అంత‌కంటే బ‌ల‌మైన సీన్స్ తో దాన్ని మంచి డ్రామా గా మ‌లిచి సినిమాను న‌డిపించాలే కానీ త‌ను చెప్పాలనుకున్న పాయింట్ ప‌ట్ల త‌న‌కు క్లారిటీ ఉన్నా, అది చెప్పే విధానంలో మాత్రం ఎక్క‌డో తెలియ‌ని త‌డ‌బాటు.  త‌న పని తాను చేసుకుంటూ పోతూ.. త‌న‌కంటూ ఒక స్టేట‌స్ ను క్రియేట్ చేసుకోవాలి, లైఫ్ లో ఎక్క‌డా త‌న జ‌ర్నీఆగిపోకూడదనుకునే రిషి పాత్ర‌లో మ‌హేష్ ఇంకా బాగా చేసుండాల్సింది. త‌న 25వ చిత్రం అంటే అది త‌న‌కు ల్యాండ్ మార్క్ సినిమా. అలాంటి సినిమాలో ఇలాంటి న‌ట‌న త‌న నుంచి ఎవ‌రూ ఆశించ‌రు. ఎమోష‌నల్ సీన్స్ లో త‌ప్పించి, మిగ‌తా ఎక్క‌డా మ‌హేష్ మెప్పించింది లేదు. ఏదో సినిమాకి వ‌చ్చాం. చూడాల్సిందే అని చూడాలి త‌ప్పించి, అరె..! మ‌హేష్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ సినిమాకొచ్చాం అత‌ని న‌ట‌న ను చూసి వాహ్‌వా..! అని ఆశ్చ‌ర్య‌ప‌రిచే సీన్స్ మాత్రం ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా ఉండ‌దు. లైఫ్ లో ఎప్పుడు ఫెయిల్ అయినా స‌రే స‌క్సెస్‌ఫుల్ అనుకునే స‌క్సెస్‌ఫుల్ ఫెయిల్యూర్ గా ప్రకాష్ రాజ్ చాలా స‌హ‌జంగా న‌టించాడు. ముఖ్యంగా కొడుకు కోసం రాసే లెట‌ర్ లో త‌ను ప‌డే ఆవేద‌న‌ను తెలియ‌జెప్పే స‌న్నివేశం అయితే అంద‌రి మ‌న‌సుల్నీ తాకుతుంది. అల్ల‌రి న‌రేష్- మ‌హేష్ మ‌ధ్య వచ్చే సీన్స్ బావున్నాయి. ఒక సాదా సీదా వ్య‌క్తి త‌న ఊరి కోసం, ఆ ఊరి బాగు కోసం పాటు ప‌డ‌టం, త‌ను ఏమీ చేయ‌లేక‌పోయినా, త‌న‌తో ఎవ్వ‌రూ లేక‌పోయినా స‌రే ఒంట‌రి పోరాటయోధుడిగా అల్ల‌రి న‌రేష్ మెప్పిస్తాడు. త‌న న‌ట‌న సినిమాకు హైలైట్. పూజా హెగ్డే ఇంత‌కు ముందెన్న‌డూ లేనంత అందంగా క‌నిపించడంతో పాటూ మంచి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది.  ఎప్పుడూ ఒకే టైప్ క్యారెక్ట‌ర్స్ చేస్తున్నాన‌ని న‌న్ను ట్రోల్ చేస్తున్నారు.. వారంద‌రికీ మ‌హ‌ర్షితో స‌మాధానం దొర‌కుతుంద‌నుకుంటున్నాఅని మ‌హేష్ ఇటీవ‌లే చెప్పాడు. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఎవ‌డైనా నువ్వు ఓడిపోతున్నావంటే గెలిచి చూపించ‌డం నాకు అల‌వాటు అని.. అలాగే ఈ సినిమాతో మ‌హేష్ అలా అనే ప్రతీ ఒక్క‌రికీ తానేంటో చేసి చూపిస్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు కానీ ట్రోల‌ర్స్ కు త‌న న‌ట‌న‌తో మ‌రికొంత ప‌ని ఇచ్చాడు మ‌హేష్. మిగిలిన సపోర్టింగ్ కాస్ట్ కూడా త‌మ వంతు స‌హకారాన్ని అందించారు.  జ‌గ‌ప‌తి బాబు విల‌నీ బాగానే వ‌ర్క‌వుట్ అయింది. రాజీవ్ క‌న‌కాల, ముకేష్ రిషి, వెన్నెల కిషోర్, జ‌య‌సుధ‌.. ఇలా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ త‌మ ప్రెజెన్స్ ను ముద్ర వేసుకున్నారు. సినిమాటోగ్ర‌ఫీ బావుంది. దేవీ శ్రీ ప్ర‌సాద్ అందించిన పాటలు, నేప‌థ్య సంగీతం పంటి కింద రాయిలా ప్ర‌తిసారీ అడ్డుప‌డ‌తాయి. ఎడిటర్ త‌న కత్తెర‌కు ఇంకాస్త ప‌దును పెట్టి ర‌న్ టైమ్ విష‌యంలో జాగ్ర‌త్త తీసుకుని ఉండాల్సింది. మ‌హేష్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ కావ‌డంతో నిర్మాతలు కూడా ఖ‌ర్చుకు వెనుకాడ‌కుండా బాగానే ఖ‌ర్చు చేశారు.
ప్ల‌స్ పాయింట్స్ః
సినిమాటోగ్ర‌ఫీ
క్లైమాక్స్
ఎమోష‌న‌ల్ సీన్స్
అల్ల‌రి న‌రేష‌న్ న‌ట‌న‌

మైన‌స్ పాయింట్స్ః
ర‌న్ టైమ్
రొటీన్ స‌న్నివేశాలు
దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం
స్లో నెరేష‌న్

పంచ్‌లైన్ః నెమ్మ‌దిగా సాగిన జ‌ర్నీ
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here