‘క‌వ‌చం’ మూవీ రివ్యూ

0
347

హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బెల్లంకొండ శ్రీనివాస్ ఎప్ప‌టిక‌ప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు. ఒక్కో సినిమాకు త‌న మార్కెట్ ను పెంచుకుంటూ, ఆడియన్స్ లో మాస్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవాల‌నుకుంటూ.. న‌వీన్ సొంఠినేని నిర్మాణంలో వంశ‌ధార క్రియేష‌న్స్ ప‌తాకంపై కొత్త ద‌ర్శ‌కుడితో ‘క‌వ‌చం’తో ముందుకొస్తున్నాడు. మ‌రి ఈ సారైనా శ్రీనివాస్ త‌ను అనుకున్న స్థాయిలో విజ‌యం సాధించాడా లేదా అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.

విజ‌య్ (బెల్లంకొండ‌) ఓ యువ పోలీస్ అధికారి. త‌న డ్యూటీ తాను సిన్సియ‌ర్‌గా చేస్తుంటాడు. ఓ అమ్మాయి (కాజ‌ల్‌)ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. త‌న మ‌న‌సులో మాట చెప్పేలోగా.. ఆ అమ్మాయి దూర‌మైపోతుంది. ఈలోగా సంయుక్త (మెహ‌రీన్) అనే అమ్మాయి పరిచ‌యం అవుతుంది. ఓ ఆప‌ద‌లో ఉన్న సంయుక్త‌ని విజ‌య్ కాపాడ‌తాడు. అయితే అనుకోకుండా విజ‌య్ త‌ల్లి ఓ రోడ్డు ప్ర‌మాదానికి గుర‌వుతుంది. ఆప‌రేష‌న్‌కి రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కూ కావ‌ల్సివుంటుంది. అంత డబ్బు నిజాయితీగా ప‌నిచేసే విజ‌య్ ద‌గ్గ‌ర ఎందుకు ఉంటుంది? అమ్మ‌ని కాపాడ‌డానికి సంయుక్త ఓ ప్లాన్ చెబుతుంది. త‌న‌ని కిడ్నాప్ చేసి, మేన‌మామ ద‌గ్గ‌ర నుంచి రూ.50 ల‌క్ష‌లు డిమాండ్ చేయ‌మంటుంది. త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితుల్లో కిడ్నాప్ నాట‌కం ఆడి, త‌ల్లిని ర‌క్షించుకుంటాడు విజ‌య్‌. అయితే.. ఆ కిడ్నాప్ డ్రామానే త‌న జీవితాన్ని మ‌లుపు తిప్పుతుంది. అదేంటి? ఆ త‌ర‌వాత ఏమైంది? అనేది సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడాల్సిందే.

ప్ర‌తీ సినిమాకు వేరియేష‌న్ చూపిస్తూ, సినిమా కోసం క‌ష్ట‌ప‌డే బెల్లంకొండ శ్రీనివాస్ కు త‌గిన ఫ‌లితం మాత్రం రావ‌ట్లేద‌నే చెప్పాలి. ఈ సినిమా కోసం కూడా బాడీ బాగానే బిల్డ‌ప్ చేశాడు. లుక్ కూడా బావుంది. డైలాగులు చెప్ప‌డంలో మాత్రం ఇంకాస్త మెచ్యూరిటీ కావాల‌నిపిస్తుంది. కాజ‌ల్, బెల్లంకొండ కంటే వ‌య‌సులో పెద్ద‌ద‌నే విష‌యం ఎవ‌రూ చెప్ప‌కుండానే తెలిసిపోయేలా ఉంది. త‌న మేక‌ప్ కూడా అస్స‌లు బాలేదు. కాజ‌ల్ సంగ‌తి స‌ర్లే కానీ మెహ‌రీన్ అయినా బావుందా అంటే బెల్లంకొండ శ్రీనుకు అక్క‌లా ఉంది మెహ‌రీన్. ఇక నీల్ నితిన్ ముఖేష్ ఎంట్రీలో చూపించిన బిల్డ‌ప్ త‌ర్వాత్త‌ర్వాత ఉండ‌దు. పోసాని కామెడీ ఇరిటేష‌న్ తెప్పిస్తుంది. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రానే పాత్ర కూడా పెద్ద‌గా చెప్పుకోద‌గ్గ‌దేమీ కాదు.

శ్రీనివాస్ మామిళ్ల ఒక కొత్త ద‌ర్శ‌కుడి నుంచి ఆశించే వైవిధ్యాన్ని ఏ మాత్రం చూపించ‌లేదు. అత‌ని నెరేష‌న్ ఈ ట్రెండ్ కు త‌గ్గ‌ట్లు లేక‌పోగా.. క‌థ విష‌యంలో క‌స‌ర‌త్తు చేసిన‌ట్లు అర్థ‌మ‌వుతుంది. కానీ స్క్రీన్ ప్లేను మాత్రం ఆస‌క్తిక‌రంగా రాసుకోలేక‌పోయాడు. సినిమాకు ఉన్న ప్ర‌ధాన లోప‌మంటే ఇదే. ద‌ర్శ‌కుడిగా మొద‌టి సినిమాతోనే త‌న‌కంటూ ఒక ముద్ర వేసుకోలేక‌పోయాడు. థ్రిల్ల‌ర్ సినిమాలు తీసి మెప్పించ‌డం క‌త్తి మీద సాము. ద‌ర్శ‌కుడు `ట్విస్టు` అనుకున్న‌ది ప్రేక్ష‌కుడికి ట్విస్టులా అనిపించ‌క‌పోయినా, ఆ త‌ర్వాతి మ‌లుపేంటో ప్రేక్ష‌కుడు క‌నిపెట్టేసినా దర్శ‌కుడు దుకాణం స‌ర్దేయాల్సిందే.. ఈ రోజు ప్రేక్ష‌కుడికి తెలివి మ‌రీ ఎక్కువై పోయింది. ఏదైనా సినిమాలో ఒక ట్విస్ట్ ఉంటే చాలు దాన్ని ప‌ది ర‌కాలుగా ఆలోచించి ద‌ర్శ‌కుడు అనుకున్న ట్విస్ట్ ని ముందే క‌నిపెట్టేస్తున్నారు. అలా కాకుండా ప్రేక్ష‌కుడు ఆశించింది కాకుండా దానికి భిన్నంగా క‌థ‌ని న‌డిపిన‌ప్పుడే థ్రిల్ల‌ర్లు థ్రిల్ గా అనిపిస్తాయి. పిండి కొద్ది రొట్టె అన్న‌ట్లు క‌థ‌కు త‌గ్గ‌ట్లే సాంకేతిక నిపుణుల ప‌నిత‌నం కూడా అన్న‌ట్లుంది ఈ సినిమా విష‌యంలో.. ఛోటా కె నాయుడు సినిమాటోగ్ర‌ఫీలో రిచ్ నెస్ అయితే ఉందికానీ కొత్త‌ద‌న‌మేమీ లేదు. ఈ మ‌ధ్యే రొటీన్ దారి వ‌దిలి భిన్నంగా కొత్త సంగీతంతో ఆక‌ట్టుకుంటున్న థ‌మ‌న్.. మ‌ళ్లీ త‌న పాత స్టైల్ లోకి వెళ్లాడు. పాట‌లేవీ ఆక‌ట్టుకోక‌పోగా, రీరికార్డింగ్ కూడా అదే స్థాయిలో ఉండ‌టం విచార‌మే. ఇక వంశ‌ధార క్రియేష‌న్స్ పాటించిన నిర్మాణ విలువ‌లు బెల్లంకొండ పాత సినిమాల‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఖ‌ర్చుకు వెనుకాడ‌కుండా ఖ‌ర్చు పెట్టారు.

పంచ్‌లైన్ః బెల్లంకొండ‌ను క‌వ‌చం కూడా కాపాడ‌లేక‌పోయింది…!
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here