‘జెర్సీ’ మూవీ రివ్యూ

0
846
రెండు ఫ్లాపుల త‌ర్వాత నాని న‌టించిన సినిమా ‘జెర్సీ’. మ‌ళ్లీ రావా డైర‌క్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో సితార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా వ‌చ్చిన ఈ సినిమా క్రికెట్ నేప‌థ్యంలో తెర‌కెక్కించారు. టీజ‌ర్, ట్రైల‌ర్ తో అంచ‌నాలు పెంచేసిన ఈ సినిమా రిలీజ్ కు ముందే స‌క్సెస్ సాధించామ‌నేంత ధీమ‌గా ఉన్నాడు నాని. మ‌రి నాని ధీమాని, ప్రేక్ష‌కుల అంచ‌నాలను జెర్సీ అందుకుందా లేదా స‌మీక్ష‌లో చూద్దాం.

అర్జున్ (నాని) తన వివాహ జీవితానికి ముందు క్రికెట్‌ను అమితంగా ఇష్ట‌ప‌డతాడు. క్రికెట్ త‌ప్ప మ‌రో లోకం తెలియ‌ని అర్జున్ జీవితంలోకి హీరోయిన్(శ్రద్ధ శ్రీనాథ్ ) ఎంట్రీ ఇస్తుంది. ఆ త‌రువాత అర్జున్ కొన్ని కార‌ణల‌తో క్రికెట్‌కు దూరం అవుతాడు. కానీ మళ్ళీ పదేళ్ల తర్వాత తాను కోల్పోయిన లక్ష్యాన్ని మళ్ళీ అందుకోవాలని ఆశిస్తాడు.ఆ నేపథ్యంలో అర్జున్ ఎదుర్కున్న పరిణామాలు ఏమిటి? భారత జట్టుకు ఎంపిక కావాలనే తన ప్రయత్నం ఫలించిందా? 36 ఏళ్ల వ‌యస్సులో అర్జున్ ఏం సాధించాడు? అస‌లు అర్జున్ 26 ఏళ్ల వయసులోనే ఆటకు ఎందుకు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. మళ్లీ పదేళ్ల తర్వాత ఎందుకు బ్యాట్ చేతబట్టాడు అనేది ఈ సినిమా స్టోరీ.

స్టోరీ సెల‌క్ష‌న్ లో నాని మిగిలిన హీరోల కంటే ప‌రిణితి చూపిస్తున్నాడ‌న్న‌ది అంద‌రూ ఒప్పుకోవాల్సిన వాస్త‌వం. త‌న‌కేమీ ఇమేజ్ లేదు కాబ‌ట్టి అలా చేస్తున్నాడులే అనుకోవ‌చ్చు కానీ క‌థ విని దానిని ఆడియ‌న్స్ ఆద‌రిస్తార‌ని న‌మ్మి ఆ సినిమా చేయ‌డం అంత తేలికైన ప‌నేమీ కాదు. చాలామంది హీరోలు వారు విన్న క‌థ‌ల్ని తెర‌పై ఎలా ఉంటాయో ఊహించుకోలేక చాలా మంచి క‌థ‌ల్ని కూడా వ‌దిలేసి రొటీన్ స్టోరీస్ తో సినిమాలు చేసి సేఫ్ గేమ్ ఆడాల‌నే చూస్తారు కానీ నాని అలాకాద‌ని మ‌రోసారి నిరూపించుకున్నాడు. త‌న‌ను అంద‌రూ గౌర‌విస్తున్నా కూడా త‌న‌కు 500 కూడా అప్పు పుట్ట‌ని ఒక క్రికెట‌ర్ క‌థని ఆడియ‌న్స్ ఎంక‌రేజ్ చేస్తారా అన్న అనుమానం లేకుండా ఎంతో ధైర్యంతో ముందుకొచ్చి ఈ సినిమా లో న‌టించాడు కాదు కాదు.. జీవించాడు. నిజ‌మే, అస‌లు సినిమా చూస్తున్నంత సేపు అక్క‌డున్న‌ది నాని కాదు అర్జునే అన్న‌ట్ల‌నిపిస్తుంది. ఒక క్రికెట‌ర్ గా, ప్రేమికుడిగా,స్నేహితుడిగా, అన్నింటికీ మించి ఒక గొప్ప తండ్రిగా ఎప్ప‌టికీ గుర్తుండిపోయే పాత్ర‌లో నాని బాగా ఒదిగిపోయాడు. ముఖ్యంగా తండ్రీ కొడుకుల మ‌ధ్య‌ వ‌చ్చే స‌న్నివేశాల్లో నాని క‌న‌బ‌రిచే న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తుంది. రెండు షేడ్స్ లో క‌నిపించిన నాని ఈ సినిమాలో చేసిన న‌ట‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఒక‌వైపు కుటుంబాన్ని క‌ష్ట‌పెట్ట‌కూడ‌ద‌నే బాధ‌, మ‌రోవైపు త‌న మ‌న‌సును చంపుకుని వేరే ప‌ని చేయ‌లేని వ్య‌క్తిత్వ‌మున్న పాత్ర‌లో నాని త‌న కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ క‌న‌బ‌రిచాడు. శ్ర‌ద్ధా శ్రీనాథ్ ఒక మంచి సినిమాతో తెలుగు ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టింది. అటు ప్రియురాలిగా, ఇటు భార్య‌గా, మ‌రోవైపు త‌ల్లిగా.. మూడు డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ లో చాలా మెచ్యూర్డ్ గా న‌టించింది. ఇక అర్జున్ కొడుకు నాని గా న‌టించిన రోనిత్ క‌మ్రా త‌న మాట‌ల‌తో క‌ట్టిప‌డేశాడు. బాహుబ‌లి త‌ర్వాత స‌త్య‌రాజ్ కు మ‌రోసారి మంచి పాత్ర ద‌క్కింది. రావు ర‌మేష్, ప్ర‌వీణ్, సంప‌త్, మిగిలిన న‌టీన‌టులు వారి ప‌రిధుల్లో మెప్పించారు.

జెర్సీ అనే టైటిల్ తోనే క‌థేంటో చెప్పేసిన ద‌ర్శ‌కుడు గౌత‌మ్ ఆ క‌థ‌ను డీల్ చేసిన విధానం కూడా చాలా బావుంది. 1986, 1990 లో ఉన్న వ్య‌త్యాసాల‌ను తెర మీద బాగా చూపించాడు. త‌న‌కు క‌లిసి వ‌చ్చిన స్క్రీన్ ప్లే తోనే మ‌రోసారి మ్యాజిక్ చేసి క‌థ‌లో భాగంగానే అక్క‌డ‌క్క‌డా ఫ్లాష్ బ్యాక్ ను రివీల్ చేస్తూ.. క‌థ‌ను ముందుకు న‌డిపించాడు. తండ్రికి, కొడుకు కు మ‌ధ్య వచ్చే స‌న్నివేశాలు కంట‌త‌డి పెట్టిస్తాయి. అలా అని ల‌వ్ ట్రాక్ ని పూర్తిగా ప‌క్క‌కు నెట్టేయ‌లేదు. అర్జున్, స‌రా ల మ‌ధ్య బంధాన్ని కూడా చాలా బ‌లంగా చూపించి ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యేలా చేశాడు. మాట‌లు చాలా కన్విన్సింగ్ గా అనిపిస్తాయి. ద‌ర్శ‌కుడు క‌థ మీద న‌మ్మ‌కంతో సినిమా తీస్తే మంచి సినిమాలొస్తాయేమో.. అదే ద‌ర్శ‌కుడితో పాటూ టీమ్ మొత్తం ఆ క‌థ‌ను న‌మ్మి, ప్రేమించి, ప్రేక్ష‌కుల‌కు చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తే జెర్సీ లాంటి సినిమాలొస్తాయి. సినిమా సాంకేతికంగానూ బావుంది. కెమెరా మెన్ ప‌నితీరు, అనిరుధ్ సంగీతం, రీరికార్డింగ్ సినిమాకు మేజ‌ర్ హైలైట్స్. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ వారు మంచి నిర్మాణ విలువ‌లు పాటించారు.

ప్ల‌స్ పాయింట్స్ః
నటీన‌టుల న‌ట‌న‌
ద‌ర్శ‌క‌త్వం
ఎమోష‌నల్ సన్నివేశాలు
డైలాగ్స్
రీరికార్డింగ్
సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్ః
నెమ్మ‌దిగా సాగే ఫ‌స్టాఫ్‌

పంచ్‌లైన్ః మ్యాచ్ నెగ్గిన జెర్సీ
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.75/5