సూపర్ కాన్ఫిడెంట్ గా హిందీ అర్జున్ రెడ్డి!

0
520
తెలుగు సూపర్ హిట్ ‘అర్జున్ రెడ్డి’ సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్.. కియారా అద్వాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 21 న రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు విడుదల తేదీని చాలా ముందుగానే ప్రకటించినప్పటికీ సోలో రిలీజ్ దొరకలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద మరో బాలీవుడ్ ఫిలిం ‘మెంటల్ హై క్యా’ తో పోటీ పడాల్సివస్తోంది.
పేరులో మెంటల్ ఉందని అదేదో అల్లాటప్పా సినిమా అనుకోవడానికి అసలు వీల్లేదు. ఈ సినిమా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హీరోయిన్ గా నటిస్తుంటే బాలీవుడ్ లో వెర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజ్ కుమార్ రావ్ హీరోగా నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్ తోనే సంచలనం సృష్టించిన ఈ చిత్రం పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు కే రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి. దర్శకుడికి ఇప్పటివరకూ సక్సెస్ లేదని సినిమాను తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే అక్కడ ఉండేది కంగనా. మరి ఈ పోటీపై షాహిద్ కపూర్ ఏమంటున్నాడు?

రీసెంట్ గా ఇదే విషయంలో షాహిద్ ను ప్రశ్నిస్తే “రిలీజ్ డేట్ ముందుగా ప్రకటించింది మేమే. వారు డేట్ ను మార్చుకొని మా డేట్ కు వచ్చారు. కాబట్టి బాల్ వారి కోర్టు లోనే ఉంది. అయినా వారికి అల్ ది బెస్ట్. కబీర్ సింగ్ కోసం మా బెస్ట్ ఇచ్చాం. రిజల్ట్ ఎలా ఉండబోతోందో మాకు తెలుసు” అంటూ తమ చిత్రంపై పూర్తి కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశాడు. అంతే కాదు.. సినిమా బాగుంటే ఆడియన్స్ చూస్తారని లేకపోతే చూడరని అన్నాడు. సోలో రిలీజ్ అయినా.. పోటీలో రిలీజ్ అయినా ఇదే సూత్రం వర్తిస్తుందని తెలిపాడు. ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ సమయంలో విజయ్ దేవరకొండ కూడా ఇలానే సినిమా ఫలితంపై ధైర్యంగా మాట్లాడాడు. మొదట్లో కొంతమంది ఏంటి విజయ్ రెచ్చిపోతున్నాడు అని కామెంట్ కూడా చేశారు. కానీ తర్వాత అందరికీ విషయం అర్థమయింది. ఇప్పుడు షాహిద్ ను చూస్తుంటే అలాంటి కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి