‘ఈ న‌గ‌రానికి ఏమైంది?’ మూవీ రివ్యూ

0
253

‘పెళ్లి చూపులు’ సినిమాతో అటు ప్రేక్ష‌కుల మ‌నసుల‌ను, ఇటు అవార్డుల‌ను అందుకున్న త‌రుణ్ భాస్క‌ర్ కాస్త గ్యాప్ తీసుకుని మ‌రో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ప‌క్కా యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైనర్ గా తెర‌కెక్కిన ‘ఈ న‌గ‌రానికి ఏమైంది?’ సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లాంటి పెద్ద బ్యాన‌ర్ నిర్మించ‌డంతో సినిమాపై మంచి ఆస‌క్తే ఉంది. ఇండ‌స్ట్రీలో తొలి స‌క్సెస్ ఎలా ఉన్నా, ద్వితీయ విఘ్నాన్ని స‌క్సెస్‌ఫుల్ గా దాట‌డ‌మే ముఖ్యం. మ‌రి త‌రుణ్ భాస్క‌ర్ ద్వితీయ విఘ్నం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడా..? ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను ‘ఈ న‌గ‌రానికి ఏమైంది?’ అందుకుందా లేదా చూద్దాం.

క‌థః
ఈ నగరానికి ఏమైంది? నలుగురు మధ్య తరగతి యువకుల కథ. వివేక్ (విశ్వక్ సేన్ నాయుడు), కార్తిక్ (సుశాంత్ రెడ్డి), కౌశిక్ (అభినవ్ గోమఠం), ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను)లు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. షార్ట్ ఫిల్మ్ తీయాల‌న్న‌ది గోల్‌. ఆ ప్ర‌య‌త్నాల్లో ఉండ‌గానే వివేక్ ప్రేమ‌లో ప‌డతాడు. అత‌నికున్న భ‌యాన్ని చూసి అత‌ని గ‌ర్ల్ ఫ్రెండ్ బ్రేక‌ప్ చెబుతుంది. దాంతో తాగుడుకు బానిసై క‌ర్త‌వ్యాన్ని నిర్ల‌క్ష్యం చేస్తుంటాడు వివేక్‌. వీరంద‌రికీ దూరంగా వెళ్లి కార్తిక్ ఓ పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకునే ప‌నిలో ఉంటాడు. కౌశిక్ డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా, ఉపేంద్ర ఎడిట‌ర్‌గా ఉద్యోగాలు చేస్తుంటారు. త‌న‌కు పెళ్లి కుదిరిన సంద‌ర్భంగా ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తాడు కార్తిక్‌. ఆ పార్టీలోనే రింగు పోగొట్టుకుంటాడు. తాగిన మ‌త్తులో ఉన్న ఫ్రెండ్స్ అక్క‌డి నుంచి గోవాకు చేరుకుంటారు. ఖ‌రీదైన రింగు కొన‌డం కోసం వారు చేసిన ప్ర‌య‌త్నాలు ఏంటి? మ‌ర‌లా షార్ట్ ఫిల్మ్ చేయ‌డానికి వారికి స‌హ‌క‌రించింది ఎవ‌రు? చివ‌రికి తీశారా? లేదా? లాంటివ‌న్నీ తెర మీదే చూడాలి.

నటీన‌టుల ప్ర‌తిభః
సినిమా అంతా నలుగురు కుర్రాళ్ల చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని నటీనటులను ఎంచుకున్న దర్శకుడు వాళ్ల నుంచి సహజమైన నటనను చాలా బాగా రాబట్టుకున్నాడు. వివేక్‌ పాత్రలో విశ్వక్‌ సేన్‌ సీరియస్‌నెస్‌ తో పాటు బాధని కూడా పలికించాడు. సినిమాకు మేజర్‌ ప్లస్ పాయింట్‌ కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్‌ గోమఠం. అభినవ్‌ తెర మీద కనిపించిన ప్రతీసారి ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుకుంటాడు. చిన్న చిన్న పంచ్ డైలాగ్స్‌తో ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌ తో ఆకట్టుకున్నాడు అభినవ్‌. ఇతర పాత్రల్లో సుశాంత్‌, ఉపేంద్రలు తమ పాత్రలకు న్యాయం చేశారు. వివేక్‌ ప్రేమ కథలో వచ్చే శిల్ప పాత్రలో సిమ్రాన్‌ చౌదరి అందంగా కనిపించారు. మోడ్రన్ అమ్మాయిగా అనీషా ఆంబ్రోస్‌ అందం, అభినయంతో ఆకట్టుకుంది.

సాంకేతిక నిపుణులుః
పెళ్లి చూపులు లాంటి క్లాసిక్ త‌ర్వాత త‌ను ఎంచుకున్న ఈ యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైనర్ ను కూడా త‌రుణ్ భాస్క‌ర్ అంతే డిఫ‌రెంట్‌గా తెర‌కెక్కించాడు. ఎక్క‌డా కూడా కావాల‌ని ఇరికించిన కామెడీ కానీ, ఎమోష‌న్స్ కానీ, బిల్డ‌ప్ సీన్స్ కానీ, డ్రామా కానీ లేకుండా సినిమా అంతా చాలా స‌హ‌జంగా సాగుతుంది. న‌లుగురు స్నేహితుల మ‌ధ్య జ‌రిగే చాలా మామూలు క‌థ‌ను అంతే ఆస‌క్తిక‌రంగా తెర మీద చూపించ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు. చాలా సంద‌ర్భాల్లో త‌రుణ్ భాస్క‌ర్ లోని ద‌ర్శ‌కుడిని ర‌చ‌యిత డామినేట్ చేశాడ‌ని సినిమా చూశాక అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ మాత్రం కాస్త స్లో గా సాగ‌దీశాడ‌నిపిస్తుంది. సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగుంది. గోవా ప్రాంత అందాల‌ను చాలా బాగా చూపించారు. వివేక్ సాగ‌ర్ పాట‌లు పెద్ద‌గా చెప్పుకునే రీతిలో లేక‌పోయినా, రీరికార్డిండ్ బాగా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ విష‌యంలో ఇంకాస్త దృష్టి పెట్టుండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
న‌టీన‌టుల న‌ట‌న‌
నేప‌థ్య సంగీతం
డైలాగ్స్

మైన‌స్ పాయింట్స్ః
ల‌వ్ స్టోరీ క‌నెక్ట్ అవ‌క‌పోవ‌డం
అక్క‌డ‌క్క‌డా సాగ‌దీసిన‌ట్లు అనిపించ‌డం

పంచ్‌లైన్ః న‌వ్వుకోవ‌డానికి న‌గ‌రానికి వెళ్లొచ్చు!
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here