చిత్రలహరి మూవీ రివ్యూ

0
605

మెగా హీరోగా తెలుగు సినీ పరిశ్రమ కి వచ్చిన సాయి తేజ్ ఇప్పటి వరకు ఒక్క మెగా హిట్ ని కూడా ఇవ్వలేక పోయాడు. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ‘సుప్రీమ్’ సినిమాతో మాస్ ఇమేజ్‌ను కూడగట్టుకున్నారు. కానీ, ఆ సినిమా తరవాత మరో హిట్టు కొట్టలేకపోయారు. గత 6 సినిమాలుగా గా వరుస పరాజయాలు చూస్తున్న తేజ్ కి వినాయక్, కృష్ణ వంశి, కరుణాకరన్ లాంటి మంచి డైరెక్టర్లు దొరికిన తన జాతకం మారలేదు, దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని చిత్ర లహరి తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ‘నేను శైలజ’ లాంటి బ్యూటిఫుల్ లవ్‌స్టోరీని తెరకెక్కించిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం, మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించడం, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిచడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. మరి ఈ సినిమాతో అయినా సాయి తేజ్ ని విజయం వరించిందా లేదా అన్నది సమీక్ష లో చూద్దాం.

తన జీవితంలో ఓడిపోవడం తప్ప, గెలుపు అనే పదానికే చోటు లేని విజయ్ (సాయి ధరమ్ తేజ్).. ఎప్పుడెప్పుడు తనని విజయం వరిస్తుందా అని ఎదురు చూస్తూంటాడు. తన జీవితంలో వెలుగంటూ ఏదైనా ఉందంటే అది లహరి (కల్యాణి ప్రియదర్శన్‌) మాత్రమే. కానీ ఆమె కూడా తన చిన్ననాటి స్నేహితురాలైన స్వేచ్ఛ (నివేదా పేతురాజ్‌) మాటలు విని, విజయ్‌పై నమ్మకాన్నికోల్పోయి అతడి నుంచి దూరమవుతుంది. కానీ స్వేచ్ఛ వల్లే విజయ్‌ కృష్ణ తాను అనుకున్నది సాధిస్తాడు? అదెలా? అటు జీవితంలో, ఇటు ప్రేమలో పరాజితుడిగా మిగిలిపోయిన విజయ్‌ ఎలా విజయాన్ని అందుకున్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

సాయి ధరమ్ తేజ్ తన పేరుని ఈ సినిమా నుంచే సాయి తేజ్ గా పేరు మార్చుకున్నాడు. ఇప్పటి వరకు చేయని కొత్త పాత్ర ని, ఇదివరకటి సినిమాలకు భిన్నంగా చాల కూల్ గా కనిపించాడు తేజ్. తన లైఫ్ లో అసలు విజయమన్నదే లేని యువకుడిగా చాలా బాగా ఒదిగిపోయాడు. కల్యాణి ప్రియదర్శన్‌ తన పాత్ర పరిధి మేరకు బాగా నటించింది. క్యూట్ క్యూట్ ఎక్సప్రెషన్స్ తో ఆకట్టుకుంది. నివేదా పేతురాజ్‌ పాత్ర కి సినిమా లో అసలు ముఖంలో ఎప్పుడూ నవ్వుండదు కానీ, చాలా అందంగా కనిపించింది. ప్రాక్టికల్‌గా ఆలోచించే యువతి పాత్రలో చక్కటి అభినయం కూడా ప్రదర్శించింది. ఫస్ట్ హాఫ్ లో సునీల్, సెకండాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ ప్రేక్షకులని అలరిస్తుంది. సినిమా లో చెప్పుకోదగ్గ మరో పాత్ర పోసాని కృష్ణ మురళిది. కొడుకు టాలెంట్ మీద నమ్మకమున్న తండ్రి గా మంచి అభినయం చూపించాడు. మిగిలిన వారిలో బ్రహ్మాజీ, రావు రమేష్‌, జయప్రకాష్‌ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.

జీవితంలో విజ‌యాన్ని చ‌విచూడ‌ని వ్య‌క్తి.. ప‌ట్టుద‌ల‌తో సాధించే విజ‌యాన్నే ఈ సినిమా కథ గా తీసుకున్నాడు కిషోర్ తిరుమల. జీవితం అంటే ఓట‌మి మాత్రమే కాద‌ని, గెలుపు కోసం చేసే ప్ర‌య‌త్న‌మ‌ని, ప‌ట్టుద‌ల ఉంటే సాధించలేనిది ఏదీ లేద‌ని చెప్పే సినిమా ఇది. తండ్రి పాత్ర‌లో పోసాని యాక్టింగ్, ఆయన చెప్పే మాటలు హైలైట్ . తల్లీతండ్రి క‌ళ్ల ముందే విడిపోయిన విష‌యాన్ని అర్థం చేసుకుని ఎదిగిన అమ్మాయిగా నివేదా పాత్ర ను చాలా మెచ్యూర్డ్ గా డిజైన్ చేసాడు. హీరో ఒక డివైస్ కనిపెట్టాలన్న ఆలోచన కి ఆ అమ్మాయే కారణం అవ్వడం, ఆ డివైస్ ని ఎలాగైనా అందరికీ అందుబాటులోకి తీసుకుని రావడానికి ఆ అమ్మాయి హెల్ప్ చేయడం, ఏ పాత్ర కి ఆ పాత్ర రియలైజ్ అయ్యే విధానం కూడా చాలా క‌న్విన్సింగ్‌గా ఉంది. కార్తీక్ ఘట్టమనేని కెమెరా ప‌నిత‌నం బావుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం లోని పాటలు బావున్నాయి, రీరికార్డింగ్ ఫ్రెష్‌గా అనిపించింది. సాయి తేజ్ వేసిన స్టెప్స్ కూడా మెప్పించాయి. కానీ ఇన్ని ఉన్నాసినిమా లో ఎమోషన్ అనేది వర్కౌట్ అవలేదు, అక్కడ సన్నివేశాల్లో ఉన్న క‌ష్టాల‌ను సినిమాలో హీరో ఎదుర్కొన్న‌ట్టు అనిపించకపోవడం తో ఎక్క‌డా బ‌ల‌మైన కాన్‌ఫ్లిక్ట్ క‌నిపించ‌దు. ఎడిటింగ్ బావుంది. మైత్రి మూవీస్ వారి  నిర్మాణ విలువలు బావున్నాయి.
ప్లస్ పాయింట్స్:
నివేత పేతురేజ్ పాత్ర
నటీ నటుల నటన
డైలాగ్స్
సంగీతం
మైనస్ పాయింట్స్:
ఫీల్ మిస్ అవడం
స్లో ఫస్ట్ హాఫ్
పంచ్ లైన్: విజయం కోసం ఎదురు చూడాల్సిందే
ఫిల్మ్ జల్సా రేటింగ్: 3/5